దేశంలో మరో సారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇంచుమించు అన్ని సర్వేల్లోనూ ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది. ఇండియా కూటమి రెండు వందల స్థానాల లోపే సాధిస్తుందని అన్ని సర్వేల్లోనూ తేలింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వేలు చెప్పగా..మరి కొన్ని సర్వేలు టిడిపి-జనసేన-బిజెపి కూటమిదే అధికారమన్నాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ వెంటనే వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. 295 స్థానాల నుండి 369 స్థానాల లోపు స్థానాలను ఎన్డీయే సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయ పడ్డాయి. కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి 125 స్థానాల నుండి 205 లోపు స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే నరేంద్ర మోదీ హ్యాట్రిక్ పిఎం కావడం ఖాయం అవుతుంది. అంచనాలు తప్పితే మాత్రం ఇండియా కూటమికి అవకాశం దక్కచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఎన్డీయే కూటమి ఈ సారి దక్షిణాదిలోనూ మంచి ఫలితాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ లో తేల్చారు. కర్నాటకలో 23 స్థానాల వరకు గెలుచుకోవడం ఖాయమన్నారు. తెలంగాణాలోనూ కాంగ్రెస్ తో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండిందని బిజెపి 9 స్థానాల వరకు గెలుచుకోవచ్చునని అంచనాలు వెలువర్చారు.
బి.ఆర్.ఎస్. అసలు బోణీయే కొట్టదని కొన్ని సర్వేలు చెప్పగా మూడు స్థానాల వరకు గెలుచుకోవచ్చునని మరి కొన్ని సర్వేలు అంచనా వేశాయి. తమిళనాడులో మాత్రం ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేశారు.
గుజరాత్, రాజస్థాన్, హరియాణా వంటి కొన్ని రాష్ట్రాల్లో బిజెపి క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనూ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కన్నా బిజెపి మంచి ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని అంచనా వేశారు. కేరళలోనూ ఇండియా కూటమిదే హవా అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను కాంగ్రెస్ పార్టీ బాయ్ కాట్ చేసింది. మెజారిటీ మీడియా బిజెపికి కొమ్ము కాస్తున్నారన్నది కాంగ్రెస్ ఫిర్యాదు. అయితే ఓటమి ఖాయమని తేలడంతోనే కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ ను బాయ్ కాట్ చేసిందని బిజెపి నేతలు సెటైర్లు వేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ లో గందరగోళం కనిపిస్తోంది. కొన్ని సర్వేలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చాయి. వాటిలో రెండు సర్వేలు అయితే వైసీపీకి 118 నుండి 159 స్థానాల వరకు వస్తాయని అంచనా వేశాయి. అయితే మరి కొన్ని సర్వేలు దీనికి పూర్తి విరుద్ధమైన అంచనాలు వెల్లడించాయి. టిడిపి-జనసేన-బిజెపి కూటమి దే అధికారమని మరి కొన్ని సర్వేలు అంచనా వేశాయి. దీంతో కొంత అయోమయం నెలకొంది. అయితే కొన్ని సర్వేలు ఆయా పార్టీలకు అనుగుణంగా ఫలితాలు వెల్లడించి ఉండచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు ఫలితాలు జూన్ 4న వెలువడతాయి. అంత వరకు ఎగ్జిట్ పోల్స్ నే నమ్ముకుని రాజకీయ పార్టీలు హల్ చల్ చేస్తాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం కావాలన్న రూలేమీ లేదు. చాలా సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ తల్లకిందులైన ఘటనలు చాలా ఉన్నాయి.2016 లో బిహార్ లో బిజెపి వస్తుందని ప్రముఖ టీవీ ఛానెల్ అంచనా వేసింది. అయితే అక్కడ ఆర్జేడీ-జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. గత బెంగాల్ ఎన్నికల్లోనూ బిజెపిదే అధికారమని కొన్ని సర్వేలు అన్నా్యి. కానీ మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుంది. అంచేత ఎగ్జిట్ పోల్స్ ను పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఎగ్జాట్ పోల్స్ కోసం ఎదురు చూడ్డమే మంచిదంటున్నారు విశ్లేషకులు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…