హ్యాట్రిక్ విజయాలపై పలువురి కన్ను

By KTV Telugu On 3 June, 2024
image

KTV TELUGU :-

వైఎస్అర్ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ పై అందరిలో ఉత్కంఠత కొనసాగుతొంది. మరో వైపు సిఎం వైఎస్ జగన్ తో పాటు మరో నలుగురు వైసిపి ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా హ్యట్రిక్ కొట్టేందుకు అతృతగా ఎదురుచూస్తున్నారు.  వైసీపీ అవిర్బావం నుంచి  వరుస విజయాల పరంపర సాగిస్తూ వస్తున్న  వీరు ఎలాగైనా హ్యట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు.  ప్రస్తుత ఎన్నికల సరళిని బట్టి చూస్తే సిఎం వైఎస్ జగన్ తో పాటు మరో అయిదుగురు నేతలు హ్యాట్రిక్ కొడతారని వైసీపీ భావిస్తోంది.

ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ద్వారా వైఎస్అర్ జిల్లా వైసిపి ఎమ్మెల్యేలు ఇద్దరు మినహా ఐదు మంది హ్యాట్రిక్ ఎమ్మెల్యేలుగా నిలువనున్నారు. జిల్లాలో ఎమ్మెల్యేలు వైసీపీ అవిర్బావం నుంచి  వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో  పార్టీ జెండా ఎగరేస్తు వస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో పలువురు సీనియర్లు వరుస విజయాలు సాధించినా, 2009 నుండి జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ సారి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలో దిగారు.

వీరిలో 2009 నుండి పోటీ చేస్తూ వస్తున్న ఇద్దరు ఇప్పటికే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి హ్యాట్రిక్ దాటి నాలుగు సార్లు విజయం సాధించగా మరో ఐదుగురు రెండు సార్లు  విజయం సాధించి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ఎన్నికల రేసులో నిలబడ్డారు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము హ్యాట్రిక్ కొడతామంటూ  వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ రేస్ లో ఉన్నారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2014లో మొదటిసారి  పులివెందుల నియోజక వర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ప్రతిపక్ష నేతగా కొనసాగారు. 2019లో తిరిగి పోటీ చేసి రెండోసారి తన సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి భారీ మోజార్టీతో గెలుపొందారు.  పార్టీ ఘన విజయంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయిదేళ్ల పాలన తర్వాత  ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈ సారి గెలిస్తే హ్యాట్రిక్ సొంతం అవుతుంది. ఈయన కూడా ఈ సారి గెలుపుపై ధీమాగానే ఉన్నారు. ఆరు నూరు అయినా నూరు నూట ఆరు అయినా  తాను హ్యట్రిక్ సాధిస్తానంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కడప ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అంజద్ భాషా సైతం హ్యాట్రిక్ పై కన్నేశారు .మైదుకూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సీనియర్ నాయకుడు రఘురామిరెడ్డి 2014,2019 ఎన్నికల్లో  వరుస విజయాలు సాధించారు. కాంగ్రెస్ మాజీ మంత్రి డి.ఎల్. రవీంద్రారెడ్డిని రెండు సార్లు ఓడించిన రఘురామి రెడ్డి మూడో విజయం సాధించాలని ముచ్చటపడుతున్నారు.

కమలాపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి జగన్ మేనమామ రవీంద్రనాధ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. ఈయన కూడా తప్పక విజయం సాధించి హ్యట్రిక్ సొంతం చేసుకుంటానని  ఆయన  ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వైఎస్అర్ జిల్లాలో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు  ఎన్నికల్లో విజయాలు సాధిస్తే జిల్లా ఎన్నికల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించినట్లవుతుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి