ఏపీలో టీడీపీకి ఎన్టీఆర్ ఎలాగో వైసీపీకి వైఎస్ అలా. ఆయన ఫక్తు కాంగ్రెస్ వాది అయినా సరే.. బీజేపీకి వ్యతిరేకుడు అయినా సరే వైసీపీ అధినేత జగన్ .. వైఎస్ ను వైసీపీలో చేర్చేసుకున్నారు. తన పార్టీని బీజేపీకి మద్దతుగా మార్చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వైఎస్ ను తమ వాడిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్.. గట్టి ప్రయత్నాలు చేస్తోంది . షర్మిల నేతృత్వంలో ఈ మిషన్ ప్రారంభించారు. వైసీపీ కూడా క్రమంగా వైఎస్ ను దూరం చేసుకుంటోంది. అది వ్యూహాత్మకమా.. వ్యూహాత్మక లోపమా అన్నది వారికే తెలియాలి. కానీ మరోసారి వైఎస్ కాంగ్రెస్ నేతగా మారిపోనున్నారు. షర్మిలకే ఈ క్రెడిట్ దక్కుతుంది.
వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావానికి కారణం వైఎస్ లెగసీనే. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ అన్యాయం చేసిందని కుటుంబం అందరూ కలిసి సొంత పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పేరుతో వైఎస్ఆర్ అని ఉండేలా చూసుకున్నారు. నిజానికి వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. షార్ట్ కట్ లో వైఎస్ఆర్ పేరు వస్తుంది కాబట్టి ఆ పేరు ఖరారు చేశారు. వైఎస్ ఆశలు, లక్ష్యాల సాధన కోసమే పార్టీ పెట్టామని ఊరూవాడా ప్రచారం చేశారు. ఓ రకంగా సర్వం వైఎస్ నామస్మరణే ఉంటుంది ఆ పార్టీలో. షర్మిలతో విబేధాల రాక వరకూ అదే పరిస్థితి కానీ…ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
“రాజకీయ వ్యాపారం చేసే వారు వైఎస్‌కు రాజకీయ వారసులు కాదని ఆయన ఆశయాలను తీసుకెళ్లే వాళ్లే అసలైన వారసులు” అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతకు ముందే వైఎస్ కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సోదరుడు జగన్ పేరు ఎత్తకుండానే బీజేపీతో తెర వెనుక పొత్తులు పెట్టుకుని ఆ పార్టీతో చీకటి రాజకీయం చేసేవారు వైఎస్‌కు రాజకీయ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే వైఎస్ చివరి కోరిక అని.. ఆయన ఆశయాలను నెరవేర్చే ఆసక్తి లేని వాళ్లు ఆయనకు వారసులని చెప్పుకోవడంపై ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు షర్మిల కానీ జగన్ పేరు ప్రస్తావించలేదు. కానీ ఆయననే నేరుగా విమర్శించారని అర్థం చేసుకోవచ్చు. వైఎస్ ఆశయాలు, సిద్దాంతాలకు జగన్ దూరంగా వెళ్తున్నారని ఈ ఇద్దరూ బలంగా ప్రజల్లోకి తీసుకెళలేందుకు ప్రయత్నించారు.
వైఎస్ వర్థంతి, జయంతులను వైసీపీ ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. కుదిరినప్పుడు పార్టీ ప్లీనరీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా ఘనంగా చేయాల్సిన వైఎస్ డైమండ్ జూబ్లీ బర్త్ యానివర్శరీని మాత్రం అసలు పట్టించుకోలేదు. ఇడుపులపాయలో ఉదయనే జగన్ నివాళులు అర్పించారు. పార్టీ కార్యకర్తలు యాక్టివ్ గా ఉన్న చోట్ల ఆ పార్టీ నేతలు దండలు వేసి కాస్త హడావుడి చేశారు. వైఎస్ జగన్ తండ్రి జయంతిని ఇంత నిర్లక్ష్యం చేయడం ఏమిటన్న ఆశ్చర్యం రాజకీయాల్లో వ్యక్తమయింది. వైసీపీ కన్నా వైఎస్ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఏపీలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ రాజకీయ వారసుల్ని తానేనని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
వైఎస్ వారసుడ్ని తానేనని జగన్ నిరూపించుకోవాలని తాపత్రయ పడటం లేదు. ఎన్నికలకు ముందు పులివెందులలో సభ పెట్టినప్పుడు షర్మిలను పసుపు చీర కట్టుకుని చంద్రబాబును కలిసిన వాళ్లు వైఎస్ వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. అప్పట్లో తానే వారసుడ్నని ఆయన చెప్పుకోవాలని అనుకున్నారు. కానీ ఎన్నికల తర్వాత మాత్రం సొంత ఇమేజ్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాను అద్భుతమైన పరిపాలన ఇచ్చానని అంటున్నారు. మంచి పరిపాలన ఇచ్చినా ఓడిపోయామని ..తమను ప్రజలు గుర్తుచుకుంటారని అంటున్నారు కానీ.. వైఎస్ ప్రస్తావన తీసుకు రావడం లేదు. కుటుంబ మీడియాలోనూ జయంతికి సంబంధించి గతంతో పోలిస్తే చాలా తక్కువ ప్రాధాన్యం కల్పించారు. వైఎస్ ఆశయాల పేరుతో షర్మిల ఆయనను ఓన్ చేసుకునేందుకు దూకుడుగా వెళ్తున్నందున ఐదేళ్ల పాటు పరిపాలన చేసినందున .. ఆ ముద్ర ప్రజల్లో ఉందని ఆ ఇమేజ్ ఆధారంగానే ఇక రాజకీయాలు చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక తల్లి విజయలక్ష్మి సపోర్టు కూడా అడగకూడదని జగన్ అనుకుంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంటే జగన్ ఇప్పుడు వైఎస్ వారసత్వాన్ని స్వయంగా షర్మిలకు ఇచ్చేసినట్లే అనుకోవచ్చు. అంటే వైఎస్ఆర్ మరోసారి కాంగ్రెస్ నేతగా మారిపోయారు.
వైఎస్ కాంగ్రెస్ కు బద్దుడు. గాంధీ కుటుంబానికి విధేయుడు. అయితే ఆయనను కాంగ్రెస్ రెబల్ గా చనిపోయినప్పటి నుంచి వైఎస్ జగన్ ప్రొజెక్టు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వైఎస్ ను తమవాడిని చేసుకునేందుకు కాంగ్రెస్ … వైఎస్ కుమార్తె సాయంతోనే పెద్ద స్కెచ్ వేసింది. వర్కవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…