జగన్ కు గుడ్ బై…. ఓవర్ టు పవన్….

By KTV Telugu On 24 October, 2024
image

KTV TELUGU :-

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. వైసీపీ నుంచి బయటకు రావాలనుకున్న నేతలకు జనసేన ఇప్పుడో ఆశా కిరణమవుతోంది.పవన్ కల్యాణే తమకు సరైన నాయకుడని వైసీపీ జనం విశ్వసిస్తున్నారు. టీడీపీ కంటే జనసేన బెటర్ అన్న ఆలోచనతో వాళ్లు ఆ పార్టీ వైపు చూస్తున్నారు…

కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించేదెవ్వరని అడిగితే టీడీపీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ నుంచి బయటకు వచ్చే వారు మాత్రం టీడీపీలో చేరేందుకు ఇష్ట పడటం లేదు. నేరుగా పవన్ కల్యాణ్ ను కలుసుకుని ఆయన చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో బలమైన వైసీపీ నేతగా పేరు పొందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీలైనంత మంది ఎక్కువ నేతలను జనసేనలోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. బాలినేని రాకను జనసేన కూడా ఆహ్వానించింది. ఆయన వల్ల పార్టీ బలపడుతుందని ఆకాంక్షించింది..

చాలా మంది నేతలు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారిలో మహిళా నేతలు కూడా ఉన్నారు. జగన్ పాలనా కాలంలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గానూ, అంతకముందు వైసీపీ అధికార ప్రతినిధిగానూ చేసిన వాసిరెడ్డి పద్మ… ఇప్పుడు జగన్ పార్టీకి రాజీనామా చేశారు. పోతూ పోతూ పార్టీ అధినేతపై టన్నుల కొద్ది బురదజల్లి పోయారు. ఆమె కూడా జనసేన కార్యలయం వైపే నడుస్తున్నారని తెలుస్తోంది. ముందే మాట్లాడుకుని మరీ ఆమె వైసీపీకి రాజీనామా చేశారని చెబుతున్నారు. పార్టీలో సముచిత స్థానం ఇస్తానని జనసేనాని నుంచి హామీ వచ్చిన తర్వాతే వాసిరెడ్డి పద్మ ….వైసీపీకి రాజీనామా చేశారు. కమ్మ సామాజికివర్గానికి చెందిన నాయకురాలైనప్పటికీ ఆమె వ్యూహాత్మకంగా టీడీపీలోకి కాకుండా జనసేనలోకి వెళ్తున్నారు….

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ హోంమంత్రి, పత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆమె జనసేనలో చేరే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆమె తన రాజకీయ భవిష్యత్తుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఆమె తన భర్త దయాసాగర్‌తో కలిసి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుతో కొద్ది రోజుల క్రితం సుధీర్ఘ చర్చలు జరిపారనీ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.నాగబాబు స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్నారని ఆయన రాగానే సుచరిత జనసేనలో చేరతారని ఇటు వైసీపీ, అటు జనసేన శ్రేణులు చెప్పుకుంటున్నారు. జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సుచరిత ముందుగానే జనసేనలో చేరాలన్న నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. నవంబర్ మొదటి వారంలో సుచరిత రాజకీయ కొత్త అడుగులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

నిజానికి టీడీపీలో చేరాలనుకునే వారంతా జనసేన వైపుకు వెళ్తున్నారు. దానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. టీడీపీలో ఖాళీలు లేవని చెబుతున్నారు. ఎవరైనా వస్తామన్నా టీడీపీ పెద్దలు ఆసక్తి చూపడం లేదు. దాదాపుగా నో వేకెన్సీ బోర్డు పెట్టేశారు. ఇలాగైతే రండి, అలాగైతే రండి… అంటూ వంద షరతులు పెడుతున్నారు. ఈ సారికి ఎలాంటి పదవులు ఆశించకుండా వచ్చే పనైతే రండి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మరో పక్క జనసేనలోకి బేషరతుగా చేర్చుకుంటున్నారు. వాళ్లు ఎవరు ఎలాంటి వాళ్లు, రాజకీయంగా వాళ్ల ప్రవర్తన ఏమిటి…లాంటి ప్రశ్నలకు తావు ఇవ్వకుండా జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు. అందుకే రాజకీయ జనం పవన్ పార్టీ వైపుకు కదులుతున్నారు. పైగా పవన్ కు కూడా రాజకీయ అవసరాలున్నాయి. పార్టీ బలపడాలంటే అంగబలం, అర్థ బలం కావాలి. అందుకే వచ్చిన వారందరినీ చేర్చుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి