ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. అటు అధికార పార్టీ వరుసగా అభ్యర్థులు ప్రకటించుకుంటూ దూకుడు ప్రదర్శిస్తుంది. మరోవైపు పొత్తులో ఉన్న టీడీపీ, జనసేనలు కూడా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ సారి రాజకీయ వర్గాల్లో పవన్‌కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆయన ఇప్పటి వరకూ ఎలాంటి హింట్ ఇవ్వలేదు సరి కదా కొత్త కొత్త రూమల్స్ పుట్టుకొస్తున్నాయి. ఆయన నేరుగా లోక్ సభకు వెళ్తారని..కేంద్రమంత్రి పదవిపైనే గురి పెట్టారని అంటున్నారు.
పవన్ ఎక్కడనుంచి పోటీ చేయబోతున్నారు ? ఏ నియోజకవర్గ అయితే ఆయనకి కి సెట్ అవుతుంది? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చంతా దాని గురించే.. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని, అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అందుకే తాను పోటీ చేయబోయే సెగ్మెంట్ గురించి సైలెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్.. అనూహ్యంగా రెండు చోట్లా ఓడిపోయారు. పార్టీ అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో దాని ఎఫెక్ట్ పార్టీ కేడర్ మీద కూడా కనిపించింది. అయితే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ .. హడావిడిగా జరిగిందని, నియోజకవర్గం ఎంపిక చేసుకునే సమయం కూడా లేకపోవడం పవన్ ఓటమికి కారణాలని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే ఈసారి అలాంటి తప్పులు చేయకుండా కచ్చితంగా గెలిచే నియోజకవర్గంపై పవన్ ఫోకస్ పెట్టారని అంటున్నారు.
గత ఆరు నెలలుగా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. భీమవరం, పిఠాపురం, కాకినాడ టౌన్, గాజువాక, విజయవాడ తూర్పు, తిరుపతి నియోజకవర్గాల నుండి పవన్ పోటీ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.. పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గాలను ఫైనల్ చేయాలనుకుంటున్నారట. జనసేన శ్రేణుల ఇంటర్నల్ సోర్స్ ప్రకారం.. పవన్ కళ్యాణ్ భీమవరం, తిరుపతిల నుంచి పోటీలో ఉండాలని భావించారంట.. భీమవరం వారాహి యాత్ర సందర్భంగా.. తిరిగి తాను అక్కడ పోటీ చేయబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు జనసేనాని. తిరుపతి నియోజకవర్గం సెంటిమెంట్ నియోజకవర్గంగా భావించి.. పవన్ పోటీ చేయాలనుకుంటున్నారట.. 2009 ఎన్నికల్లో పాలకొల్లు, తిరుపతి నుండి పోటీ చేసిన సీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి.. పాలకొల్లు ఓటర్లు ఆదరించనప్పటికీ.. తిరుపతి ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తిరుపతిలో బలిజ సామాజికవర్గం గణనీయంగా ఉండటం మెగాస్టార్‌కి కలిసివచ్చింది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ని రిపీట్ చేస్తూ పవన్ తిరుపతి నుండి కూడా బరిలో ఉంటారని టాక్ వినిపించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ని జనసైనికులు చేశారంటున్నారు.
అయితే పవన్ లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంటోంది. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నప్పటి నుంచి పవర్ షేరింగ్ ఉండాలంటూ పవన్ ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. ఆయనకు మద్దతు ఇచ్చే నేతలు కూడా కొందరరు ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు ప్రభుత్వం ఏర్పాటు అయితే ఎలా అనే చర్చ కూడా నడుస్తోంది. రెండు పవర్ స్టేషన్లు ఒకే చోట ఉండటం ప్రమాదమని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇలాంటి సమస్య రాకుండా పవన్ కల్యాణ్ ఇప్పుడు ఢిల్లీపై దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఎలాగూ బీజేపీ కూడా కూటమిలో చేరుతోంది. ఎన్డీఏలో భాగం అవుతున్నారు. వచ్చే బీజేపీ ప్రభుత్వంలో ఏపీ నుంచి కేంద్రంలో మంత్రి పదవి పవన్ కే దక్కడానికి ఎక్కువ అవకాశం ఉంది. కేబినెట్ ర్యాంక్ కూడా దక్క వచ్చు.
ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా పదే పదే పవన్ కల్యాణ్ కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పలుదఫాలు పర్యటించారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశమయ్యారు. కేడర్‌తో కూడా చర్చించారు. ఎక్కడా పోటీ విషయాన్ని ప్రస్తావించకుండానే పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఆరా తీసినట్టు చెప్పుకుంటున్నారు. దీనిపై ఇంకా చర్చలు నడుస్తున్నాయని… వారం పదిరోజుల్లో పవన్ పోటీపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. అప్పుడు కాని పవన్ వెళ్లేది అసెంబ్లీకా, పార్లమెంట్‌కా అనేది లేదు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి జనసేనాని పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా ఉండే కాకినాడ సీటు సేఫ్టీగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సీట్లలో జనసేనకు బలమైన ఓటు బ్యాంకు ఉన్నట్లు అన్ని సర్వేల్లో తేలింది. కాబట్టి పవన్ ఇక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని తేలిపోవడంతో…పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కానీ అధికారికంగా మాత్రం పోటీ ఎక్కడనేది ప్రకటన చేయాల్సి ఉంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…