పవన్ పై ఒక సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం

By KTV Telugu On 7 November, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇంకా సినీ ఫక్కీలోనే ప్రవర్తిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఏ మాట మాట్లాడినా సినిమా డైలాగ్ లాగానే అనిపిస్తోంది. రెండు రోజుల క్రితం పవన్ చేసిన కామెంట్స్ ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పైగా తాను హోంమంత్రిగా ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని చెప్పడం ద్వారా ఆయన మినిష్టర్ అనితను తప్పుపట్టినట్లయ్యింది. ఇప్పుడు అదే పెద్ద దుమారానికి కారణమవుతోంది…

పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కక్కలేక మింగలేక నానా తంటాలు పడుతున్నారు. పవన్ వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా అందుకుని కూటమి ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటుంటే.. ఏమీ చేయలేక టీడీపీ వర్గాలు చోద్యం చూస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కల్యాణ్ కే రివర్స్ పడే పరిస్థితి వచ్చింది. ఆయనపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. దళితవర్గంలో తమ మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళా మంత్రి అనితను పవన్ కల్యాణ్ అవమానపరిచారని ఆయన ఆరోపిస్తున్నారు. మంత్రివర్గం ఒక సమిష్టి బాధ్యత అని తెలిసి కూడా పవన్ కల్యాణ్ బహిరంగ విమర్శకు దిగడంపై ఆయన ఆక్షేపించారు. అనిత ఫెయిల్యూర్ అయితే సీఎంగా చంద్రబాబు కూడా విఫలమేనని… పవన్ ఇప్పుడు అనితను చంద్రబాబును కలిపి విమర్శించారని అనుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. పైగా మొదటి నుంచి పవన్ ను మాదిగ సామాజికవర్గంపై చిన్నచూపు ఉందని ఆయన మరో ఆరోపణ చేశారు. ఎన్నికల సమయంలో జనసేన తరపున ముగ్గురు ఎస్సీలు పోటీ చేస్తే మూడు స్థానాలు మాల సామాజిక వర్గానికే కేటాయించారని, మాదిగ సామాజికవర్గానికి ఒక్క సీటు అడిగినా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. జనసేన తరపున రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని మాదిగ సామాజికవర్గానికి కోరినా ఆయన లెక్క చేయలేదన్నారు. పవన్ కల్యాణ్ నిత్యం మాదిగలను అవమానపరుస్తున్నారని,కనీసం అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని మంద కృష్ణమాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ ప్రచారం చేసే సామాజిక న్యాయం కూడా ఒట్టిమాటేనని మంద కృష్ణమాదిగ ఆరోపించడం ఇప్పుడు మరో అంశంగా పరిగణించాలి. తన పార్టీ తరపున మంత్రివర్గంలో కాపు, కమ్మకే అవకాశం ఇచ్చారని గుర్తు చేసిన మంద కృష్ణ… బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఒక్కరికి కూడా ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. కాపులు పెద్దన్నల్లా ఉంటారని చెప్పుకునే పవన్ కల్యాణ్.. అమలు చేస్తున్న సామాజిక న్యాయం ఇదేనా అని మంద కృష్ణ ప్రశ్నిస్తున్నారు.దీనితో మంద కృష్ణ వ్యాఖ్యలపై వైసీపీ వర్గాలే కాకుండా… టీడీపీ శ్రేణులు కూడా ఆనందపడుతున్నట్లు సమాచారం. తాము మాట్లాడలేని అంశాలను మంద కృష్ణ ప్రస్తావించారని, కడిగి పారేశారని టీడీపీ వాళ్లు సంబరపడిపోతున్నారట..

మంద కృష్ణ కామెంట్స్ అలా ఉంటే.. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా కూడా పవన్ పై ఒక కన్నేసి ఉంచినట్లుగా చెబుతున్నారు. సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు టీడీపీ నాయ‌కులెవ‌రూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌పై స్పందించ‌న‌ప్ప‌టికీ ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలిసింది.అధికారంలోకి వ‌చ్చి ఐదు నెల‌లు కూడా కాక‌పోవ‌డం, మ‌రోవైపు జ‌నం తిడ్తున్నార‌ని ప‌వ‌న్ చేసిన కామెంట్స్ కూట‌మి స‌ర్కార్‌కు రాజ‌కీయంగా న‌ష్టం తెచ్చాయ‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో వుంది. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పాటు జ‌న‌సేన మంత్రులు, అలాగే ఆ పార్టీ ఎమ్మెల్యే తీరుపై నిఘా పెట్టాల‌నే ఆలోచ‌న‌లో టీడీపీ వుంది. అంతేకాదు, జ‌న‌సేన మంత్రులు ఏ మేర‌కు విజ‌య‌వంతంగా విధులు నిర్వ‌ర్తిస్తున్నారో చూడాల‌ని టీడీపీ అనుకూల మీడియా సీరియ‌స్‌గా వుంది. అలాగే జ‌న‌సేన ఎమ్మెల్యేల అరాచ‌కాల‌పై త్వ‌ర‌లోనే వ్య‌తిరేక క‌థ‌నాలు మొద‌లు పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఆ మీడియా ఉంది.ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నార‌ని, ఆయ‌నకు ప‌రిపాల‌న అంటే ఏంటో రుచి చూపాల‌ని ఆలోచ‌న‌తో టీడీపీ పెద్ద‌లున్నారు.మరి గుట్టు చప్పుడు కాకుండా టీడీపీ కార్యాచరణ ఎప్పుడు మొదలవుతుందో లేదా ఇప్పటికే మొదలైందో చూడాల్సి ఉంది….

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి