పవన్ అరెస్టు ఖాయమా ?

By KTV Telugu On 21 July, 2023
image

KTV Telugu.– రాజకీయ చదరంగంలో పావులు వేగంగా కదులుతున్నాయి. జనసేనాని ప్రాసిక్యూషన్ కు జగన్ ప్రభుత్వం అనుమతివ్వడంతో వర్షాకాలంలోనూ వాతావరణం వేడెక్కింది దైనికైన రెఢీ అంటూ పవన్ కల్యాణ్ కూడా దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఎవరూ తగ్గేదేలే అంటే సమీప భవిష్యత్తు ఎలా ఉంటుంది. పైగా బీజేపీతో దోస్తీ ఇప్పుడాయనకు మరింత గాఢంగా మారింది. తాజా పరిణామాలపై టీడీపీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ప్రాసిక్యూషన్ ఉత్తర్వులను పవన్ చాలా లైట్ గా తీసుకున్నారు. ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడేది లేదని జనసేన అధినేత తేల్చిచెప్పారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధమని కూడా ప్రకటించారు. పైగా వలంటీర్లు 23 అంశాల సమాచారాన్ని సేకరించి ఎక్కడికి పంపుతున్నారో చెప్పాలని పవర్ స్టార్ నిలదీశారు. జనసేనతో కలిసి పని చేస్తామని, త్వరలోనే పవన్ తో భేటీ అవుతామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రకటించడంతో పవన్ కు కొండంత అండ లభించినట్లయ్యింది.

వలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేశారంటూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆయనపై కేసు నమోదు చేసేందుకు గ్రామ/వార్డ్‌ సచివాలయాల శాఖకు అనుమతి ఇచ్చింది. గురువారం ఈ మేరకు జీవో నం.16ను జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. పవన్‌ కల్యాణ్‌ ఈ నెల తొమ్మిదో తేదీన ఏలూరులో వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వలంటీర్లను ఉద్దేశించి ఆయన నిరాధార ఆరోపణలు చేశారని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఎన్‌సీఆర్‌డీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 29వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, అందుకు వలంటీర్ల వ్యవస్థే కారణమని పవన్ ఆరోపించారు. సంక్షేమ పథకాలిస్తామని చెప్పి ఒంటరి మహిళల సమాచారాన్ని సంఘ వ్యతిరేక శక్తులకు వలంటీర్లు చేరవేశారని, దాని ఆధారంగా మహిళల అక్రమ రవాణా సాగుతోందన్నారు.

నిజానికి ఏపీ రాజకీయ పరిస్థితులపై ఓ క్లారిటీ వస్తోంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు మరింత బలోపేతం అవుతోంది. ఇప్పటి వరకూ పొత్తులో ఉన్నా ఈ రెండు పార్టీలు కలిసి పని చేయడం లేదు. ఇక ముందు కలిసి పని చేయడానికి రంగం సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్ ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడం… బీజేపీతో పొత్తు ఖాయమని.. టీడీపీ కలిసి వస్తుందో లేదో ఆ పార్టీ ఇష్టమని ప్రకటన చేసిన నేపధ్యంలో.. మరింత చొరవ తీసుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. సరిగ్గా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పవన్ భేటీ అయిన 24 గంటల్లోనే పవన్ పై ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు వచ్చాయి.

పవన్ కల్యాణ్ ప్రాసిక్యూషన్ టైమింగ్ మిత్రపక్షం టీడీపీని కూడా ఆశ్చర్య పరిచింది. ఎన్నికల పొత్తులను గాడి తప్పించేందుకే పెద్ద నాటకానికి తెరతీశారని టీడీపీ అనుమానిస్తోంది. తమను దెబ్బకొట్టేందుకు పవన్ ను పావుగా వాడుతున్నారని టీడీపీకి డౌట్ గా ఉంది. అసలు తమకు బీజేపీతో పొత్తు ఇష్టం లేదని ఇప్పుడు ఒకరిద్దరు టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. కేవలం పవన్ కల్యాణ్ స్నేహం కోసం మౌనంగా ఉండాల్సి వస్తోందని టీడీపీ అధికార ప్రతినిధులే చెబుతున్నారు. పవన్ ప్రాసిక్యూషన్ వల్ల ఆయనకు గానీ, సమాజానికి గానీ జరిగే నష్టమేమీ లేదని, అంతా పొలిటికల్ గేమ్ మాత్రమేనని టీడీపీ అనుమానిస్తోంది. కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వానికి అప్పులు పెరిగిపోయాయి. పది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. దానిపై వడ్డీలు చెల్లించలేక జగన్ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. 2023 – 24 సంవత్సరానికి గానూ ఎఫ్ఆర్బీఎం పరిమితి కూడా దాటిపోయే పరిస్థితి వచ్చింది. దానితో ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. రోజువారీ ఖర్చులు, జీతాలు – పెన్షన్లకు డబ్బులు లేకపోతే జనం గోలచేసే వీలుంది. ఆ పరిస్థితుల నుంచి డైవర్షన్ కావాలంటే మరో కొత్త వివాదం అవసరం. అందుకే పవన్ పై కేసు పెట్టి దాన్ని స్లోగా నడిపిస్తారు. అవసరమైనప్పుడు అరెస్టు చేసి రాష్ట్రంలో గందరగోళ పరిస్థితికి తెరతీస్తారు..

పవన్ కు కావాల్సింది కూడా తన పాపులారిటీ పెరగడం. గత ఎన్నికల్లో వచ్చిన ఆరు శాతం ఓట్ల కంటే తన బలం బాగా పెరిగిందని నిరూపించుకునే అవకాశం వస్తే పవన్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. ఎందుకంటే టీడీపీతో పొత్తు ఖరారైతే ఎక్కువ సీట్లు అడిగేందుకు ఏదోటి చూపించాలి కదా. ఒక సారి అరెస్టు అయితే పెద్ద నాయుకుడు కావచ్చన్న విశ్వాసం కూడా ఆయనకు కలుగుతోంది. బీజేపీ ఎలాగూ ఆయన్ను ప్రోత్సహిస్తోంది. పైగా చంద్రబాబును దిగగొట్టాలంటే పవన్ ను పైకి తీసుకురావాల్సిన అనివార్యత ఉందని బీజేపీకి తెలుసు. జగన్ ను ఎలా ఆడించాలో కూడా కమలం పార్టీకి తెలిసినందున ఇకపై వేరంగానే పరిణామాలు మారతాయి. ఈ దిశగా పవన్ ఎప్పుడు అరెస్టు అవుతారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న..

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి