ఓ భారీ బడ్జెట్‌సిన్మా ప్రమోషనంత హడావుడిచేసి పార్టీ పెట్టాడు అన్నయ్య. కానీ నడపలేకపోయాడు. చివరికి కాంగ్రెస్‌లో కలిపేసి జెండా ఎత్తేశాడు. అన్నయ్య పిరికోడు తమ్ముడలా కాదు అసలు సిసలు డేరింగ్ డాషింగ్ అనుకున్నారు. కానీ తమ్ముడి రాజకీయం అర్ధంకాక పార్టీ కేడర్ జుట్టు పీక్కుంటున్నారు. పవన్‌కళ్యాణ్ స్ట్రాటజీ అర్ధంకాక తలపట్టుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్ టార్గెట్ ఒక్కటే. వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని అధికారంలోకి ఎలాగైనా దించేయాలి. సింగిల్‌గా దించేసేంత బలం జనసేనకుందా. టీడీపీ పొత్తుతో గెలిచి అధికారాన్ని చంద్రబాబుకు అప్పగించేందుకు ఆయన సిద్ధమా.
ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. మహాఅయితే 15నెలలు. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి ఎవరితో కలిసి వెళ్లాలి అన్నదానిపై ఇంకా క్లారిటీ లేకపోతే ఎలా. ఆర్భాటంగా టీజర్ రిలీజ్ చేసిన వారాహి షెడ్డులోనే రెస్టు తీసుకుంటోంది. పోనీ పొత్తులపైనన్నా ఓ స్పష్టత ఇచ్చారా అంటే అదీలేదు. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూస్తే వైసీపీని ఈజీగా ఓడించొచ్చంటారు పవన్‌కళ్యాణ్. ప్రతిపక్షాలన్నిటినీ ఏకతాటిపైకి తెస్తానంటారు. మాటలు చెప్పినంత తేలిక్కాదు ఇది. చంద్రబాబుని ఒప్పించి 50సీట్లకు పొత్తు కుదుర్చుకున్నా గొప్పే. పొత్తు కుదిరితే మూడోవంతు సీట్లలో పోటీకి దిగుతామని చెప్పే ధైర్యం పవన్‌కళ్యాణ్ చేయలేరు.
మొన్నటిదాకా కాపుల ఓట్లపై నమ్మకం. ఇప్పుడేమో బీసీలు దళితులు కూడా వాళ్లతో కలిస్తే రాజ్యాధికారం ఖాయం అంటున్నారు. టీడీపీ-జనసేన కలిసిపోటీచేసినా రాజ్యాధికారం చంద్రబాబు అండ్‌కోకే వెళ్తుంది. అధికారం లేకపోయినా ఫర్లేదన్నంత త్యాగానికి టీడీపీ అధినేత సిద్ధపడే అవకాశమేలేదు. పోనీ బీజేపీతో వెళ్తారా అంటే దేన్నో పట్టుకుని గోదారి ఈదినట్లేనని పవన్‌కి తెలుసు. టీడీపీని కూడా కలుకుని వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. మరి ఇన్ని లెక్కలు పెట్టుకుని ఊరికే ఊహాలోకాల్లో తేలిపోతే లాభం ఏముందున్నది పవన్‌కళ్యాణ్ ఆలోచించుకోవాలి. కాపు సంక్షేమ సేన సమావేశానికి వచ్చిన కురువృద్ధుడు హరిరామజోగయ్య సూచనలతో పవర్‌స్టార్ ఇంకాస్త కన్‌ఫ్యూజన్‌లో పడి ఉండాలి.
వైసీపీతో పాటు టీడీపీతో సమానదూరం పాటించాలన్నది కాపు కురువృద్ధుడి సలహా. ఆ రెండుపార్టీల పతనానికి ప్రయత్నించాలని పవన్‌కళ్యాణ్‌కి ఉపదేశం చేశారు హరిరామజోగయ్య. టీడీపీతో దోస్తీకి మానసికంగా సిద్ధమైన జనసేనానికి బహుశా పెద్దాయన సలహా రుచించకపోయి ఉండొచ్చు. ఈమధ్య కాపు నేత కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరారు. జనసేనలో చేరాలనుకున్న కన్నాని చంద్రబాబు హైజాక్ చేశారన్నది హరిరామజోగయ్య సంచలన ఆరోపణ. జనసేనకి 20 సీట్లు మాత్రమే ఇస్తామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారనేది ఆయన మరో ఆరోపణ. టీడీపీతో కలిస్తే పతనం తప్పదని చెప్పకనే చెప్పారు కాపు వృద్ధనేత. హతవిధీ ఇప్పుడేం చేయవలె.