ఏపీలో పొత్తుల రాజకీయం చిత్ర విచిత్రంగా నడుస్తోంది. బీజేపీతో పొత్తులోనే ఉన్నామంటారు జనసేన అధినేత. అటు కమలనాథులు కూడా అదే మాట చెబుతున్నారు. కానీ ఎవరి రాజకీయం వారు చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే ఎన్నికల ముందు చూసుకుందాములే అంటున్నారు. కానీ ఈలోగా చేయాల్సిందంతా చేసేసుకుంటున్నారు. 2014 నాటి కాంబినేషన్ గురించి తాను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయనంటోన్న పవన్ అది జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయమని బంతిని ఢిల్లీ పెద్దల కోర్టులోకి విసురుతున్నారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కూడా సేమ్ టు సేమ్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తమతో పొత్తులోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాను బీజేపీతో పొత్తులో లేనని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటిస్తే- అప్పుడు దీని గురించి ఆలోచించవచ్చని జనసేనకే నిర్ణయాన్ని వదిలేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గ్లామరస్ హీరో కాబట్టి ఎవరైనా కలవొచ్చు తప్పేముందంటూ వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీతో పెద్దగా లాభం లేదనుకుంటోన్న పవన్ కళ్యాణ్ బాబుతో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు . దాంతో మొన్నటిదాకా పవన్ మావాడేనని చెప్పిన కమలనాథులు కూడా ఇప్పుడు ఆయన గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ నేతలు తమ నిర్ణయమేంటో చెప్పేశారు. తెలుగుదేశం, వైసీపీకి తాము సమదూరం పాటిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ప్రజలతోనే తమకు పొత్తుంటుందన్నారు. అయితే సమావేశాల్లో బీజేపీ నేతలెవరూ తమతో అధికారికంగా పొత్తున్న జనసేన గురించి మాత్రం ప్రస్తావించలేదు. వైసీపీ, టీడీపీలకు సమదూరం పాటిస్తామని బీజేపీ నేతలు ప్రకటించడం ద్వారా చంద్రబాబుతో పొత్తుండదని తేల్చేయడంతోపాటు పవన్ కళ్యాణ్ తమతో ఉంటారో లేదో తేల్చుకోవాలని పరోక్షంగా సూచన చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
పవన్ మనసంతా సైకిల్‌పైనే ఉన్నప్పటికీ బీజేపీని కూడా కలుపుకొని పోవాలని ఆరాటపడుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూసేందుకు కమలం పార్టీ కూడా కలిసిరావాలని కోరుతున్నారు. కానీ బాబుతో పొత్తు ప్రసక్తే లేదనే మాట ఢిల్లీ నుంచి వినబడుతోందట. జాతీయ పార్టీగా ఉండి ఓ ప్రాంతీయ పార్టీని సీట్లు అడగాల్సిన పనిలేదనే భావనతో హస్తిన పెద్దలున్నారట. రాష్ట్రంలో పార్టీ బలపేతంపై దృష్టిసారించాలన్న అగ్రనేతల ఆదేశాలను ప్రస్తుతానికి రాష్ట్రస్థాయి నేతలు ఫాలో అవుతున్నారు. ప్రభుత్వంపై పోరాటానికి ఒంటరిగానే కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ జనసేన కూడా తెగదెంపులు చేసుకుంటే అప్పుడు చూద్దామనే ఆలోచనతో కాషాయ నేతలున్నారట. ప్రస్తుతం పవన్ పొత్తులపై చర్చలు జరుపుతూనే సొంత అజెండాతో ప్రచార యాత్రకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ, జనసేనల బంధం తెగుతుందా లేక మరింత ముడిపడుతుందా అనేది చూడాలి.