ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టిన పవన్ కళ్యాణ్

By KTV Telugu On 20 March, 2023
image

జనసైనికుల్లో హుషారును నింపే టానిక్  అందించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. అదే సమయంలో తమతో పొత్తు పెట్టుకోవాలని తహ తహ లాడుతోన్న చంద్రబాబు నాయుడికి ఇవ్వాల్సిన సంకేతాన్నీ ఇచ్చారు. తమతో ఇప్పటికే పొత్తులో ఉన్న బిజెపికి అల్టిమేటం ఇచ్చారు. ఒకే దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టేశారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో జనసేన సత్తా చాటడానికి ఆయన తనకే సాధ్యమైన వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలక్షేపం కోసం రాజకీయాల్లోకి రాలేదు. నిర్దిష్ఠ లక్ష్యంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఏదో కొంత కాలం ఉండి వెళ్లిపోడానికి కూడా ఆయన రాలేదు. కనీసంలోకనీసం పాతికేళ్లకు తక్కువ కాకుండా రాజకీయాల్లో ఉండాలనే వచ్చారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రజలకు తనదైన మార్కు పాలన ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని నిజం చేసుకోడానికి తనదైన శైలిలో వ్యూహాలు రచించుకుంటూ చాలా కూల్ గా ముందుకు సాగుతున్నారు. అంతా కూడా నిజాయితీగానే.

మచిలీపట్నంలో జనసేన బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ తన మనసులో ఉద్దేశాలను శషభిషలు లేకుండా బయట పెట్టారు. అవసరమైతే ఒంటరి పోరాటానికి కూడా సిద్ధమే అన్న ఒక్క వాక్యం టిడిపి నాయకత్వం గుండెల్లో అగ్గి పిడుగులా పడింది అది వారిని వణికించేస్తోంది. ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ కొంపతీసి మనసు మార్చేసుకుని తమతో పొత్తు లేకుండానే ముందుకు సాగుతారా ఏంటి అని టిడిపి నాయకత్వంలో అప్పుడే చర్చ మొదలైపోయిందంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందని సంకేతాలు ఇచ్చినా కూడా టిడిపికి భయం పట్టుకుంది. ఒంటరి పోరుకు సిద్ధమని పవన్ ఎందుకు అన్నారా అని టిడిపి నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. టిడిపితో పొత్తుకు సంకేతాలు ఇచ్చిన పవన్ టిడిపితో పొత్తులో భాగంగా జనసేనకు 20 స్థానాలు కేటాయిస్తారట అంటూ టిడిపి సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలను నిర్ద్వంద్వంగా ఖండిచారు. అసలు అలాంటి ఒప్పందాలేవీ చేసుకోలేదని శ్రేణులకు వివరణ ఇచ్చుకున్నారు.

వాట్సాప్ లలో వచ్చే వార్తలు ఫోటోలను పట్టించుకుంటే ఎలాగ అని ప్రశ్నించారు. ఇలా అనడం ఆయన సున్నితంగానే అన్నా టిడిపి జనసేనపై విషప్రచారం చేయడం మాత్రం పవన్ కు నచ్చలేదని  తెలుస్తోంది. అయితే టిడిపికి సరియైన అదను చూసి జీవితంలో కోలుకోలేని షాక్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారట. లోకేష్ పాదయాత్రను జనం పట్టించుకోరన్న ఉద్దేశంతోనే తన వారాహి యాత్రకు  టిడిపి అధినేత బ్రేక్ వేయడం పైనా పవన్ చికాగ్గానే ఉన్నారని అంటున్నారు. అయితే ఎవరినీ నొప్పించడం చేతకాని పవన్ కళ్యాణ్ మౌనంగానే దాన్ని భరిస్తున్నారు. సమయం వచ్చినపుడు సరియైన సమాధానం చెప్పడమో సరియైన నిర్ణయం తీసుకోవడమో చేయాలని ఆయన అనుకుంటున్నారట. ఇక బిజెపి నేతలు తనను కూరలో కరివేపాకులా వాడుకుంటున్నారని భావిస్తోన్న పవన్ కళ్యాణ్ తాను ఎంతగా కలిసి ఉందామనుకున్నా బిజెపి నేతలే కలసి రావడం లేదని ఆరోపించడం ద్వారా బిజెపికి కటీఫ్ చెప్పడం ఖాయమన్న సంకేతం అందించారు.

2014 ఎన్నికల్లో పదవులు ఆశించకుండా బిజెపి-టిడిపిలకు మద్దతు నిచ్చిన పవన్ 2019 ఎన్నికల్లో  కమ్యూనిస్టులు బిఎస్పీలతో కలిసి బరిలో దిగారు. వచ్చే ఎన్నికల్లో ఒక వేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెద్దగా చీలి అది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే  తనకు రాష్ట్ర వ్యాప్తంగా అశేష సంఖ్యలో అభిమానులు ఓటర్లు ఉన్నా ఓట్లు చీలకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతోనే పవన్ పొత్తులతో వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నారు. అయితే పవన్ నిర్ణయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం పవన్ కళ్యాణ్ చెవులనూ చేరింది. అయితే  దీన్ని ఎలా అధిగమించాలా అన్న అంశంపై పవన్ తన ఆంతరంగికులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతిమంగా 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెరపై జనసేన బలమైన సంతకం చేసి తీరాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారు. దాన్ని నిజం చేసుకుని తీరతానంటున్నారు.