పవన్ కళ్యాణ్ అందుకే భయపడుతున్నారా

By KTV Telugu On 16 March, 2023
image

జనసేన పదవ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ అనేక అంశాలను ప్రస్తావించారు. జనసేన బలిపశువు కావడానికి తాను ఇష్ట పడటం లేదన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ఎప్పుడో చెప్పానన్నారు. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ టీడీపీతో పొత్తు ఉంటుందని ఆయన పరోక్షంగా ప్రకటించేశారు. వైసీపీని గద్దె దించాలంటే విపక్షాలు ఐకమత్యంగా ఉండాలని టీడీపీ జనసేన ఎప్పుడో గుర్తించాయి. ఇటీవలి కాలంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ రెండు సందర్భాల్లో భేటీ అయ్యారు. పొత్తులపై చర్చలు జరిగినట్లు జనసేనకు కేటాయించే స్థానాల సంఖ్యపై స్పష్టత వచ్చినట్లు లీకులు కూడా వదిలారు. అయినా అధికారిక ప్రకటనకు మాత్రం నోచుకోలేదు. మచిలీపట్నం ఆవిర్భావ సభలో కూడా పవన్ కల్యాణ్ పరోక్ష సంకేతాలిచ్చారే తప్ప నేరుగా ఎక్కడా పొత్తు సంగతి మాట్లాడలేదు.

టీడీపీ జనసేన పొత్తు ఖాయమని దాదాపుగా ఏడాదిగా చర్చ జరుగుతూనే ఉంది. క్షేతస్థాయిలో కార్యకర్తలు ఇప్పటికే డిసైడైపోయారని రెండు పార్టీల్లో కొందరు బల్లగుద్ది చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే క్లారిటీ వచ్చిందని అక్కడ జనసేన శ్రేణులు పనిచేసుకుపోతుంటే టీడీపీ సహకరిస్తోందని కూడా అంటున్నారు. మిగతా చోట్ల టీడీపీకి జనసైనికులు -వీరమహిళలు సహకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అందులో కొంతమేరకు మాత్రమే నిజం ఉందని ఇరు పార్టీల నేతలు ఒప్పుకుంటున్నారు. టీడీపీ జనసేన పొత్తుపై సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. మరి అధికారిక ప్రకటన ఎందుకు రావడం లేదన్నది పెద్ద ప్రశ్న. ఎన్నికలకు బాగా ముందే ప్రకటన వచ్చి నియోజకవర్గాల గుర్తింపు జరిగితే కలిసి పనిచేసుకోవడానికి సులభంగా ఉంటుందని విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు ఇరు పార్టీల ద్వితీయ శ్రేణి నేతలు తమదైన శైలిలో సమాధానమిస్తున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. ఆయన వెళ్లిన నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. తిరుపతి సహా నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదని వాటిని జనసేనకు వదిలేసినట్లేనని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. పొత్తుపై ఇంతకంటే క్లారిటీ ఏం కావాలని టీడీపీ నేతలు ఎదురు ప్రశ్న వేస్తున్నారు.

పొత్తుపై ప్రకటన రాకపోవడానికి మాత్రం చాలా కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడే పొత్తు ప్రకటించి నియోజకవర్గాలను గుర్తిస్తే కొందరు నేతలు జారిపోయే అవకాశాలున్నాయని అనుమానిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతీ నియోజకవర్గంలో టీడీపీకి కనీసం అరడజను మంది ఆశావహులు ఉన్నారు. వాళ్లంతా తమకు టికెట్ వస్తుందని ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్న క్యాంటిన్ల నిర్వహణ జనంలోకి వెళ్లి వారి బాగోగులు తెలుసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇప్పటికే లక్షలు ఖర్చుచేసిన ఆశావహులూ ఉన్నారు. పొత్తు ప్రకటించి ఆయా స్థానాలు జనసేన ఖాతాలో పడేస్తే వాళ్లంతా నొచ్చుకునే అవకాశం ఉంది. అలాంటి వారిని వైసీపీ రా రమ్మని ఆహ్వానిస్తుందన్న అనుమానమూ ఉంది. పైగా నేతలను ఎలా లాక్కోవాలో వైసీపీకి బాగానే తెలుసు కదా. జనసేన పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించిన పక్షంలో టీడీపీలో కొందరు రెబెల్ స్టార్స్ తయారయ్యే అవకాశం ఉంది. వైసీపీలో ఆనం కోటంరెడ్డి తరహాలోనే టీడీపీలోనూ పార్టీ వ్యతిరేక ప్రకటనలు చేసే వాళ్లు బయటకు వస్తారు. పార్టీలో ఉంటూనే టీడీపీపైనా పొత్తు అభ్యర్థులపైనా వ్యతిరేక ప్రకటనలు నిరసనలకు దిగే ఛాన్సుంది. కొందరైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా దిగే అవకాశం ఉంది. అందుకే టీడీపీ జనసేన ఆచి తూచి వ్యవహరిస్తున్నాయని చెప్పుకోవాలి.

ఏడాది ముందే పొత్తులు నియోజకవర్గాలు ప్రకటిస్తే వైసీపీకి అవకాశం ఇచ్చినట్లవుతుందని ఇరు పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. పొత్తు అభ్యర్థి ఎవరో తెలిసిపోతే అటు వైపు నుంచి నరుక్కొచ్చేందుకు వైసీపీ ప్లాన్ చేసుకునేందుకు కావాల్సినంత సమయం ఉంటుంది. పొత్తు అభ్యర్థి బలాబలాలు తెలుసుకుని వైసీపీ వ్యూహాలు పన్నే వీలుంటుంది. పాత కేసులు ఏమైనా ఉంటే తవ్వి బయటకు తీసి ఇబ్బందులకు గురిచేసే అవకాశం వస్తుంది. కొత్త కేసులు కూడా పెట్టి వేధించే వీలు కలుగుతుంది. బెదిరింపులు కిడ్నాపుల్లో వైసీపీ నేతలు సిద్ధహస్తులని అందుకే ముందు జాగ్రత్తగా నిదాన వైఖరిని పాటిస్తున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరో పక్క జనసేన పోటీ చేయబోయే స్థానాల సంఖ్యపై కూడా గోప్యత పాటిస్తున్నారు. 20 సీట్లు కేటాయిస్తున్నారంటూ వస్తున్న వాట్సాప్ ప్రచారాలను నమ్మవద్దని పవన్ కళ్యాణ్ స్వయంగా చెబుతున్నారు. జనసైనికులు వైసీపీ ట్రాప్ లో పడిపోతారన్న భయం ఆయనకు ఉంది. పార్టీని కాపాడుకోవాలి అధికారం వైపుకు దూసుకుపోవాలి. ప్రత్యర్థి పార్టీకి అందకుండా వ్యూహాలు రచించాలి అప్పుడే విజయం ఖాయం. ఈ సంగతి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు బాగానే తెలుసు. చిన్న పొరపాటు జరిగినా జగన్ అండ్ కో తమను మింగేస్తుందని వారికి అంతకంటే బాగానే తెలుసు.