మోదీ చంద్రబాబు మధ్యలో పవన్

By KTV Telugu On 5 April, 2023
image

 

సింగడు అద్దంకి వెళ్లనూ వెళ్లాడు. రానూ వచ్చాడన్నది పాత సామెత. కొన్ని సందర్భాల్లో ఆ సామెత నిజమవుతూ ఉంటుంది. ఈ సారి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి రావడం కూడా అలాగే అనిపిస్తోంది. ఎక్కడ నుంచో సడన్ గా పవన్ కళ్యాణ్ హస్తినలో ఊడిపడ్డారు. పక్కన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి రెండుమూడు రోజులు ఢిల్లీలో తెలుగు మీడియాకు కావాల్సినంత మేత ఇచ్చారు. రెండు సార్లు వాళ్లు బీజేపీ ఏపీ ఇంఛార్జ్ మరుళీధరన్ తో పాటు బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు వార్తలు వచ్చాయి. పవన్ టీమ్ ను శివప్రకాశ్ నిలదీసినట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది కాకపోతే ఏ అంశంపై నిలదీశారో మాత్రం తెలియలేదు. మంగళవారం రాత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుల ప్రస్తావన రాలేదని అయితే చాలా విషయాలు చర్చించామన్నది మీడియాకు పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. పైగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు జరిపినట్లు పాతపాటే పాడారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామనడం కూడా ఇదీ మొదటి సారి కాదు. ఆ దిశగా పవన్ చేస్తున్న ప్రకటన కూడా తప్పేనని చెప్పాలి. వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనేందుకు ఏ ఇతర పార్టీకి దమ్ము లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లవుతోందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదో ఒకసారి మాట్లాడితే ఫర్వాలేదు కానీ పదే పదే అదే మాట మాట్లాడితే చులకనై పోతారని కూడా సలహాలు వినిపిస్తున్నాయి. ఒంటరిగా 175 స్తానాల్లో పోటీ చేసే దమ్ముందా అని ఇప్పటికే సీఎం జగన్ నుంచి సాధరణ వైసీపీ నేత వరకు విపక్షాలను ప్రశ్నిస్తున్నారు.

మురళీధరన్ నడ్డాతో చర్చలు సత్ఫలితాలనిచ్చాయని పవన్ వెల్లడించారు. పొత్తుల గురించి అడిగితే మాత్రం చర్చలు ఆస్థాయి దాకా వెళ్లలేదని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం సాధించడానికి అడుగులు వేస్తున్నామని చెప్పుకున్న పవన్ . ఈ క్రమంలో బీజేపీ తనను తాను సంస్థాగతంగా బలోపేతం చేసుకునే చర్యలు త్వరలో చేపడుతుందన్నారు. ఏపీ రాజకీయాలపై బీజేపీ పెద్దలతో చర్చించాలని చాలా రోజులుగా అనుకుంటుంటే ఇప్పటికి సాధ్యపడిందన్నారు. పవన్ ఎందుకు వెళ్లారు మోదీ అమిత్ షాలను ఎందుకు కలవలేదన్నది పెద్ద పెద్ద ప్రశ్నలే. మోదీ విశాఖ వచ్చినప్పుడు స్వయంగా పవన్ ను పిలిపించుకుని మాట్లాడారు. పావు గంట పైగా ముఖాముఖీ చర్చ జరిగింది. అప్పుడేం జరిగిందో పవన్ ఇంతవరకు బయట పెట్టలేదు. పవన్ ఢిల్లీ వెళ్లినప్పుడు మాత్రం ఆయన మోదీని కలవలేకపోయారు. అప్పాయింట్ మెంట్ అడగలేదా ఇవ్వలేదా అన్న చర్చ కూడా జరుగుతోంది. అమిత్ షా కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. దానితో పవన్ కు అంత సీన్ లేదని బీజేపీ ఢిల్లీ పెద్దలు గుర్తించారన్నది తాజాగా సోషల్ మీడియా టాక్ వైసీపీ బ్యాచ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ ను ఉతికి ఆరేస్తోంది.

పవన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీని వదిలేసి రావాలని టీడీపీ నుంచి సంకేతాలు అందుతున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో బీజేపీ బలమేంటో తెలిసిన టీడీపీ ఇప్పుడా జాతీయ పార్టీని అడాకమేట్ చేసేందుకు సిద్దంగా లేదు. అంతగా ఐతే అదీ తప్పకపోతే నాలుగు లేదా ఐదు స్థానాలు బీజేపీకి కేటాయిద్దామని పవన్ వద్ద టీడీపీ నేతలు ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అంతకు మించి అనవసరమని అన్నారట. ఈ సంగతి బీజేపీకి లీక్ కావడంతో ఇప్పుడు కమలనాథులు ఆగ్రహంతో ఊగిపోతున్నారని తెలుస్తోంది. అందుకే పొత్తు చర్చలు ఇప్పుడే వద్దని కూడా పవన్ తో వాళ్లు చెప్పేసినట్లు లీకులు వచ్చాయి. ఆ సంగతి బయటకు చెప్పలేక జనసేనాని మథనపడుతున్నట్లు సమాచారం.

జనసేనతో పొత్తు కూడా మనకు అవసరమా అని టీడీపీలో ఒక వర్గం ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ వర్గం బాగా యాక్టివ్ అయ్యింది. గత ఎన్నికలతో పోల్చి చూస్తే పవన్ కు ఎక్కువ స్థానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీలోని బలమైన వర్గం వాదిస్తోందట. పవన్ రెండు చోట్ల ఓడిపాయారని ఆయన పార్టీకి వచ్చినదీ ఒక్క స్థానం మాత్రమేనని వారు గుర్తుచేస్తున్నారు. దానితో పవన్ కళ్యాణ్ కు పరిస్థితి అర్థం కావడం లేదు. టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందో తెలీదు. కేంద్రంలో ఉన్న అధికారంతో బీజేపీ ఎలాంటి బ్లాక్ మెయిల్ కు దిగుతుందో అర్థం కావడం లేదు. పొత్తులపై ముందుకెల్దామంటే బీజేపీ ఒప్పుకోదు. ఏదోటి తేల్చకపోతే మీకే నష్టమని తెలుగుదేశం అంటోంది. దానితో ఇప్పుడు పవన్ పరిస్తితి ఆగమ్యగోచరంగా ఉంది. మోదీ చంద్రబాబు మధ్య ఆయన నలిగిపోతున్నారనిపిస్తోంది.