జనసేన అధినేత పవన్ కల్యాణ్ డైలమాలో ఉన్నారు. ఎన్నికల నగారా మోగింది. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవలసిన పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశంపై ఊగిసలాడ్డం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. జనసైనికులను గందరగోళానికీ గురి చేస్తోంది. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలా లేక లోక్ సభ స్థానానికి పోటీ చేయాలా అన్నది తేల్చుకోవలసి ఉందని పవన్ కల్యాణే వ్యాఖ్యానించడం విశేషం. ఏపీలో విపక్ష కూటమి ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ తను ఎక్కడి నుండి పోటీ చేయాలన్న విషయంలో మాత్రం తర్జన భర్జనలు పడుతున్నారు.
ఏపీలో విపక్ష కూటమి ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించారు పవన్ కల్యాణ్. తెలుగుదేశం పార్టీతో ముందుగా పొత్తు పెట్టుకున్నారు పవన్. ఆ తర్వాత బిజెపిని తమ కూటమితో కలపడానికి చాలా కష్టపడ్డారు. టిడిపితో పొత్తుకు బిజెపి అగ్రనేతలు తటపటాయిస్తోన్న తరుణంలో ఏపీలో వైసీపీని ఓడించాలంటే టిడిపి-జనసేన-బిజెపి జట్టుకట్టాల్సిందేనని పదే పదే బిజెపి నాయకత్వానికి చెప్పారు పవన్. చివరకు పవన్ ఒత్తిడి మేరకే బిజెపి నాయకత్వం దిగి వచ్చిందని హస్తిన వర్గాల భోగట్టా. ఆ క్రమంలో భాగంగానే అమిత్ షా మూడు పార్టీల కూటమికి సై అనేశారు. ఇది నిజంగానే చంద్రబాబుకు పెద్ద రిలీఫ్ ను ఇచ్చింది.బిజెపి ఇక పొత్తు పెట్టుకోదనే బాబు అనుకున్నారు. అందుకే పొత్తు తేలకముందే 94 మంది అభ్యర్ధులతో తమ మొదటి జాబితా విడుదల చేసేశారు కూడా.
బిజెపి పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిజెపి -జనసేనలకు 31 అసెంబ్లీ 8 లోక్ సభ స్థానాలు ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మూడు పార్టీల మొదటి సభ చిలకలూరి పేటలో జరిగింది. తాను పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం టికెట్ ఆశించిన టిడిపి సీనియర్ నేత వర్మ చంద్రబాబుపై అలిగారు. తన సీటును జనసేనకు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు నచ్చచెప్పడంతో ఆయన సైలెంట్ అయ్యారు. పవన్ విజయానికి కృషి చేస్తానని మాటిచ్చారు కూడా. వర్మ సహకరిస్తానని అనడంతోనే పవన్ కల్యాణ్ పిఠాపురంలో వైసీపీ ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చినా తను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తానని చాలా ధీమా వ్యక్తం చేశారు. అది పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.
అయితే ఒక్కరోజులోనే పవన్ కల్యాణ్ మాట మార్చారు. తాను పిఠాపురం అసెంబ్లీ నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నానని..అయితే బిజెపి కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశిస్తే లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని అన్నారు. అదే జరిగితే కాకినాడ లోక్ సభ స్థానానికి జనసేన అభ్యర్ధిగా నిర్ణయించుకున్న ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని..తాను కాకినాడ లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తానని అన్నారు. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో బిజెపి నాయకులు చెప్పడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఓ పార్టీ అధినేతగా పవన్ సొంత నిర్ణయం తీసుకోవాలి కాని ఇలా మరో పార్టీ కనుసన్నల్లో ఉండకూడదని వారంటున్నారు.
పవన్ కల్యాణ్ ఇలా డైలమాలో ఉండడాన్ని గమనించిన పిఠాపురం టిడిపి నేత వర్మలో కొత్త ఆశలు చిగురించాయి. ఒక వేళ పవన్ కల్యాణ్ కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని అన్నారు. పవన్ పోటీ చేస్తేనే తన మద్దతు ఉంటుంది తప్ప పవన్ లేకపోతే పిఠాపురం స్థానాన్ని వేరేవారికి దానం చేయడానికి తాను సిద్ధంగా లేనన్నారు వర్మ. అసలు పవన్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ఎందుకున్నారని రాజకీయ వర్గాల్లో గుస గుసలు వినపడుతున్నాయి. పిఠాపురం నియోజక వర్గంలో గెలిచే అవకాశాలు లేవని పవన్ కల్యాణ్ అనుమానిస్తున్నారా? అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.
జనసేన వర్గాల వాదన మరోలా ఉంది. ఈ ఎన్నికల్లోనూ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఒక వేళ బిజెపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అయితే పవన్ కల్యాణ్ కు కేంద్రంలో ఏదో ఒక పదవి రావడం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. పవన్ లోక్ సభ స్థానానికి పోటీ చేసి గెలిస్తే.. మోదీ మంత్రివర్గంలో చోటు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. తన అన్న చిరంజీవి కాంగ్రెస్ సారధ్యంలోని యూపీయేలో కేంద్ర మంత్రి అయ్యారు. ఇపుడు పవన్ ఎన్డీయేలో మంత్రి పదవి అయి అన్న రికార్డును సమం చేస్తారని జనసైనికులు అంటున్నారు. అయితే అమిత్ షా చెబితేనే తాను పోటీ చేస్తానని పవన్ అనడం గమనార్హం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…