తన విమర్శకులపై పవన్ కళ్యాణ్ మండి పడుతున్నారు. తనకు సలహాలు ఇచ్చేవాళ్లు..తనని ప్రశ్నించే వాళ్లు అవసరమే లేదన్నారు. తనతో నడిచేవాళ్లు..తానేం చేసినా సై అనేవారే తన మనుషులని స్పష్టం చేశారు. టిడిపితో పొత్తులో భాగంగా 24 సీట్లే ఎందుకు తీసుకున్నారని తనని ప్రశ్నించేవారిని ఉద్దేశించిన పవన్.. జనసేన పార్టీకి అంతకు మించి సత్తా ఎక్కడుంది? వనరులు ఎక్కడున్నాయి? పార్టీ నిర్మాణం ఎక్కడుంది? టిడిపితో పోటీపడగల బలం ఎక్కడుంది? అని నిలదీయడం ద్వారా జనసేన పార్టీ పరిమితిని స్వయంగా ఒప్పుకున్నారు.
తెలుగుదేశం-జనసేన పార్టీల మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం నియోజక వర్గంలో జరిగింది. ఈ సభలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా తనపైనా జనసేనపైనా వస్తోన్న విమర్శలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనలో ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్లు కనపడింది. టిడిపి-జనసేనల పొత్తు కుదిరిన తర్వాత రెండు పార్టీలకు సంబంధించి 99 మంది అభ్యర్ధులతో ఇద్దరూ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలున్న ఏపీలో జనసేనకు 24 స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. వాటిలో అయిదు స్థానాలకు పవన్ అభ్యర్ధులను ప్రకటించారు. ఆ వెంటనే జనసేన అభిమానుల్లోనూ పవన్ మద్దతు దార్లలోనూ కాపు మేథావుల్లోనూ జనసేనకు అవమానం జరిగిందన్న భావన వచ్చింది.
టిడిపి కష్టాల్లో ఉంటే దానికి మద్దతు పలికిన పవన్ నిజమైన స్నేహితుడిగా అండగా నిలిచి టిడిపిని పైకి తీసుకు వస్తే పొత్తులో జనసేనకు ముష్టి 24 సీట్లు ఇస్తారా అంటూ కాపు మేథావులు నిప్పులు చెరుగుతున్నారు. అటు జనసైనికుల్లోనూ తమ నాయకుడిపై ఆగ్రహం పెల్లుబికింది. చంద్రబాబుతో గట్టిగా మాట్లాడి మరిన్ని స్థానాలు పట్టుబట్టి సాధించుకోకుండా 24 స్థానాలకే ఎందుకు ఒప్పుకున్నారంటూ జనసైనికులు పవన్ పైనే మండి పడుతున్నారు. జనసేనకు మొదటినుంచీ మద్దతుగా ఉంటోన్న సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు నేత చేగొండి హరిరామ జోగయ్య కూడా మరీ 24 స్థానాలతోనే జనసేన డీల్ కు ఒప్పుకోవడం దేహీ అన్నట్లుందని విమర్శించారు. కూటమిలో పవన్ స్థానం ఏంటో క్లారిటీ ఇవ్వాలని అన్నారు.
అన్ని వర్గాల్లోనూ జనసేనపైనా పవన్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ జనసేనానిని బాగా ట్రోలింగ్ చేస్తున్నారు. వీటన్నింటినీ మనసులో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఎవరి పేరూ ప్రస్తావించకుండా టిడిపి-జనసేన జెండా సభ వేదికగా ఆవేశంగా అందరికీ సమాధానాలు చెప్పారు. 24 స్థానాలే తీసుకున్నారేంటని కొందరు అడుగుతున్నారు. అంతకు మించి స్థానాలు తీసుకోడానికి జనసేనకు ఏం బలం ఉంది? ప్రతీ నియోజక వర్గంలో కనీసం 800 మంది నుండి వెయ్యి మంది దాకా మనకి కార్యకర్తలు ఉన్నారా? పార్టీని నడపడానికి రోజూ ఓ యాభై మందికి భోజనాలు పెట్టింతే స్థోమత జనసేన నేతల్లో ఉందా? మనకసలు సరియైన పార్టీ నిర్మాణం ఉందా? సంస్థాగతంగా ఎంతో బలంగా ఉన్న టిడిపిని ఎదిరించగల సత్తా మనకి ఉందా? ఏం ఉందని ఎక్కువ సీట్లు తీసుకోవాలంటున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
అదే విధంగా చేగొండి హరిరామజోగయ్య వంటి వారిని ఉద్దేశించి నాకు సలహాలు ఇవ్వకండి. సలహాలు ఇచ్చే వారు నాకు అవసరం లేదు. నేనది చేశాను ఇది చేశానని ప్రశ్నించే వారు నాకు అవసరం లేదు. నాకు మద్దతు ఇచ్చే వారయితే నాతో పాటు నడవాలి అంతేకానీ..నాకు సలహాలిచ్చి..ప్రశ్నలతో వేధించకూడదు అంటూ ఆగ్రహంగా అన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ దురంధరుడు కాబట్టే ఆయనతో పొత్తు పెట్టుకున్నాను అని వివరించారు.
గత ఎన్నికల్లోనే తక్కువ సీట్లలో పోటీ చేసి ఉండి ఉంటే ఈ పాటికి జనసేన చాలా బలంగా ఉండేదన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయే కంటే 24 స్థానాల్లో పోటీ చేసి అన్నింటా గెలిస్తే రాష్ట్ర గతినే మార్చవచ్చునన్నారు పవన్ కళ్యాణ్.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని అధఃపాతాళానికి తొక్కేయడానికి వచ్చిన వామనుణ్ని అంటూ తనను తాను అభివర్ణించుకున్నారు. వామనుడి విషయంలో కూడా ఒక్క పాదమే కదా అని తీసిపారేశారని.. ఇపుడు 24 సీట్లేనా అని తనని తీసిపారేస్తున్నారని కానీ తాను కూడా వామనుడిలాగే 24 స్థానాల్లో బరిలో దిగి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేస్తానని పవన్ అన్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…