వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చేశారు. టిడిపి-బిజెపిలతో కలిసి పొత్తు పెట్టుకుందామని అనుకున్నామని ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపి తో మాత్రం కచ్చితంగా పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తమతో బిజెపి కూడా కలిసొస్తుందని తాము నమ్ముతున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. బిజెపి మిత్ర పక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ బిజెపితో సంప్రదించకుండా బిజెపితో తెగతెంపులు చేసుకోకుండా టిడిపితో పొత్తు ఖాయమని ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక వేళ బిజెపి టిడిపితో పొత్తుకు సుముఖంగా లేకపోతే పవన్ కళ్యాణ్ బిజెపికి కటీఫ్ చెప్పేస్తారా? అన్న ప్రశ్నలు వినపడుతున్నాయి.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుణ్ని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఆయనతో పాటు చంద్రబాబు బావయ్య నందమూరి బాలకృష్ణతో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారు. ముగ్గురూ కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత వర్తమాన పరిస్థితులపై చర్చ జరిపారు. రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకుడు, 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నాయకుణ్నే జైలుకు పంపితే ఇక రాష్ట్రం ఏమైపోవాలి? అని ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల మేలుకోసం కీలక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు.
చంద్రబాబును కలిసిన తర్వాత బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఇంత వరకు పొత్తుల విషయంలో ఎలాంటి నిర్ణయానికీ రాలేదన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నేతను అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిన తీరు చూశాక^రాష్ట్రం కోసం ఇపుడే కీలక నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని తాను అనుకోడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ పాలనే అన్న పవన్ విపక్షాలు విడి విడిగా పోటీ చేస్తే ఏపీలో మరో 20 ఏళ్ల పాటు జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనే నడుస్తుందని వ్యాఖ్యానించారు. దాన్ని నివారించడానికే తాను టిడిపితో పొత్తు పెట్టుకుని వెళ్లాలని డిసైడ్ చేశానని ప్రకటించారు.
బిజెపి-టిడిపి-జనసేనలు కలిసి 2024 ఎన్నికల బరిలో దిగితే బాగుంటుందని తాను అనుకుంటూ వచ్చానని కానీ మారిన సమీకరణల్లో భాగంగా చంద్రబాబు నాయుడి పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని భావించానన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసే పోటీ చేస్తాయన్నారు. భారతీయ జనతా పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో తనకు తెలీదని.. కచ్చితంగా తమతో పాటే బిజెపి కూడా వస్తుందని అనుకుంటున్నానన్నారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో జనసేన ఓటమి అనంతరం ఆయన బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. అప్పట్నుంచీ బిజెపికి మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. ఇంతకాలానికి ఇపుడు టిడిపితో పొత్తు అనివార్యమని పవన్ భావిస్తున్నారు.
టిడిపితో పొత్తు పెట్టుకుందామని పవన్ కళ్యాణ్ చాలా కాలంగా కేంద్రంలోని బిజెపికి చెబుతున్నారు. అయితే బిజెపి అగ్రనేతలు మాత్రం టిడిపితో పొత్తుకు సిద్ధంగా లేరు. ఎన్నికల లోపు బిజెపి నాయకత్వాన్ని ఒప్పించగలనన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ఉన్నారు. సరిగ్గా ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. టిడిపి కష్టకాలంలో ఉందని భావించిన పవన్ కళ్యాణ్ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయంగా ఉంటేనే నిజమైన మిత్రులం అవుతామని భావించారు. అందుకే టిడిపితో పొత్తు నిర్ణయాన్ని అక్కడి కక్కడ ప్రకటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. టిడిపి-జనసేన పొత్తుపై ఇక ఎవరికీ ఎలాంటి అనుమానాలూ అవసరం లేదని ఆయన స్పష్టం చేసినట్లయ్యింది.
పవన్ ఏకపక్ష ప్రకటనతో బిజెపి నేతల్లో ఆలోచనలు మొదలయ్యాయి. తమ మిత్ర పక్షంగా ఉంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ తమతో కనీసం సంప్రదించకుండా టిడిపితో పొత్తును ఖరారు చేయడం బిజెపి నేతలకు మింగుడు పడ్డం లేదు. అలాగని పవన్ ను గట్టిగా నిలదీసే పరిస్థితులూ లేవు.
ఒక వేళ టిడిపి ఉన్న కూటమిలో తాము ఉండలేమని బిజెపి నాయకత్వం అంటే అపుడు ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ బిజెపికి కటీఫ్ చెప్పేస్తారా? లేదా టిడిపికి గుడ్ బై చెప్పి బిజెపితోనే ముందుకు వెళ్తారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తన ప్రకటనతో పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రకంపనలు సృష్టించారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…