మరో ఎనిమిది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి గెలిచి సీఎం కావాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు ఎలాగైనా అధికారంలోకి రావాలనే ధ్యేయంతో బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే గిల్లి కజ్జాలతో కిందా మీదా పడుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసనే అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల్లో పొత్తు కోసం వాళ్లిద్దరూ కలుసుకున్నారని అందరికీ తెలుసు. ఏపీతో పాటు తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఇటీవల ఖమ్మం లో టీడీపీ ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ జరిగింది.
తెలంగాణలో టీడీపీ ఎక్కడుంది అని ప్రశ్నించేవారికి ఈ సభకు వచ్చిన జనమే సమాధానం అన్నారు చంద్రబాబు. దాంతో చంద‌్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనే అభిప్రాయాలు వినిపించాయి. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన నాయకులకు సూచించినట్టు తెలుస్తోంది. 32 నియోజకవర్గాల్లో జనసేన కార్యనిర్వాహకులను కూడా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే త్వరలో కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టబోతున్నారు. ఆయన ఏపీ రాజకీయాల్లో తలదూరిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాలపై వీరిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.