కాపుల్లో చీలిక ఎవరికి లాభం – Pawan-Kalyan-Mudragada-Harirama-Jogayya-TDP-JSP-YSRCP

By KTV Telugu On 9 March, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. అధికారంలోకి రావాలంటే కాపులు ఓ కాపు కాయాల్సిందేనని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసమే చంద్రబాబు నాయుడు కాపు ఓట్లు సొంతం చేసుకోడానికి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ను చేరదీసి తన రాజకీయ అనుభవాన్ని రంగరించి పొత్తు కొనసాగేలా చేసుకోగలిగారు. ఈ నేపథ్యంలో ఏపీలో సీనియర్ కాపు నేతలు అయిన చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంలు ఇద్దరూ కూడా  టిడిపి-జనసేన కూటమికి దూరం అయ్యి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు దగ్గర అవుతుండడం  రాజకీయ సమీకరణలను మార్చేస్తోందంటున్నారు రాజకీయ పండితులు.

ఏపీ రాజకీయాల్లో చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభాలకు చాలా చరిత్ర ఉంది.  ఎన్టీయార్ టిడిపిని స్థాపించిన తర్వాత ఈ ఇద్దరూ కూడా  ఎన్టీయార్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేశారు.  ఆ తర్వాత ఇద్దరూ కూడా కాంగ్రెస్ లో  పనిచేశారు.  ముద్రగడ అయితే  కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో బాగా పాపులర్ అయ్యారు కూడా. నిజాయితీ పరుడిగా ముద్రగడకు మంచి పేరు ఉంది. అటు చేగొండి కూడా సమర్ధవంతుడైన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. కాపు సామాజిక వర్గంలో అందరికీ ఈ ఇద్దరు నేతలపై గౌరవం ఉంది. ఈ ఇద్దరు నేతలు కూడా జనసేనకు  మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సలహాలు సూచనలూ ఇచ్చారు. అయితే చిత్రంగా ఈ ఇద్దరినీ జనసేన దూరం చేసుకుంది.

టిడిపి-జనసేన సీట్ల సర్దుబాటుపై చేగొండి హరిరామ జోగయ్య  ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ముద్రగడ పద్మనాభం కూడా  మరీ తక్కువ సీట్లతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? అని  నిలదీశారు. వీరి ఇద్దరికీ పవన్ కళ్యాణ్  కౌంటర్ వేశారు.  టిడిపి-జనసేనల మొదటి ఉమ్మడి సభలో  తనకు సలహాలు, సూచనలు ఇచ్చేవారు వద్దే వద్దన్నారు. తనను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. తనకు మద్దతు ఇవ్వాలనుకునే వారు జనసైనికుల్లా తనతో కలిసి నడవాలే తప్ప యాగీ చేయద్దన్నారు. దీంతో ఈ ఇద్దరు నేతలు అవమానంగా భావించారు. ముద్రగడ అయితే పవన్ తన ఇంటికి వస్తానని చెప్పి రాకుండా అవమానించారని అన్నారు. ఒక సమయంలో జనసేనలో చేరాలని ముద్రగడ అనుకున్నారు. పవన్ కూడా ఆయన్ను పిలిచారు.  ఏమైందో తెలీదు కానీ ఆ తర్వాత ముద్రగడను వదిలేశారు.

పవన్ కళ్యాణ్ ను చంద్రబాబే నడిపిస్తున్నారన్నది చేగొండి, ముద్రగడల ఆరోపణ. పవన్ వైఖరితో నొచ్చుకున్న చేగొండి హరిరామ జోగయ్య తనయుడు సూర్యప్రకాష్ జనసేనకు రాజీనామా చేశారు. ఆ వెంటనే  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పవన్ వైఖరిపై బాహాటంగా విమర్శలు కూడా చేశారు. ఇపుడు ముద్రగడ పద్మనాభం కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే ముద్రగడ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారన్నది మాత్రం బయటకు రాలేదు. ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేసుకుంటున్నారు.

చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం కూడా టిడిపి-జనసేన కూటమితో ఉంటే అది ఈ ఎన్నికల్లో వారికి అడ్వాంటేజ్ గా ఉండేదని కాపు మేథావులతో పాటు రాజకీయ పరిశీలకులు కూడా వాదిస్తున్నారు. ఈ ఇద్దరితోనే మంచిగా ఉంటూ వారిని తమతోనే ఉంచుకోవడంలో జనసేన విఫలమైందని అంటున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలతో వేగలేమని..వారిని చేర్చుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు అనుభవ పూర్వకంగా చెప్పడం వల్లనే ముద్రగడ ఇంటికి వెళ్లాలని ముందుగా అనుకున్న పవన్  ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది.

చేగొండి, ముద్రగడలు ఇద్దరూ వైసీపీలో చేరితే  గోదావరి జిల్లాలో కాపు ఓటు బ్యాంకు  కచ్చితంగా చీలడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చేగొండి, ముద్రగడలకు వారి సామాజిక వర్గంలో మంచి పేరే ఉంది . కాకపోతే ఇద్దరికీ కాస్త చాదస్తం ఎక్కువన్న భావన ఉంటే ఉండచ్చు కానీ ఇద్దరిపైనా గౌరవం ఉంది. వారిని దూరం చేసుకోవడం ద్వారా అవమానించారని  జనసేనపై    కొంతమందిలో  వ్యతిరేకత కూడా వస్తుందంటున్నారు. ఇది ఓటింగ్ సరళిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఇది ఎవరికి లాభం చేకూరుస్తుంది ఎవరికి నష్టం తెస్తుందన్నది మాత్రం ఇపుడే చెప్పలేం అంటున్నారు  మేథావులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి