వారిద్దరి భేటీ ఎప్పుడో ?

By KTV Telugu On 18 August, 2023
image

KTV Telugu ;-

బీజేపీ, జనసేన మైత్రి ఎలా ముందుకు సాగుతుందనే అనుమానం ఏపీలో బలంగా వినిపిస్తోంది. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారా.. కలిసి పనిచేసి జగన్ ను గద్దె దించుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి పవన్ తో ఆమె భేటీ ఉంటుందని ఎదురు చూసినా ఇంతవరకు అలాంటి చర్యలేమీ జరగకపోవడంతో కొత్త అనుమానాలు కలుగుతున్నాయి.

రెండు పార్టీలు కలిసి పనిచేయాలంటే అధినాయకుల భేటీ తరచూ జరుగుతుండాలి. అభిప్రాయాలు ఇచ్చి పుచ్చుకోవాలి. అపోహలు తొలగించుకోవాలి. కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచాలి. జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలైనా సరే..అదే ధోరణిలో పనిచేయాలి. ప్రత్యర్థిని కొట్టగలమన్న ధైర్యం పార్టీ కార్యకర్తల్లో కలిగించాలి. అటు పవన్ కల్యాణ్, ఇటు పురంధేశ్వరి ఆ పని చేస్తున్నట్లుగా కనిపిచడం లేదు…

ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేనతో పొత్తు కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.త్వరలోనే తాను పవన్‌ కళ్యాణ్‌తో భేటీ జరిపి భవిష్య ఉమ్మడి కార్యాచరణ గురించి చర్చిస్తానని చెప్పారు. అయితే పవన్‌ వారాహి యాత్రలతో చాలా బిజీగా ఉండటంతో ఇంతవరకు వారి భేటీ సాధ్యం కాలేదు. . కానీ పురంధేశ్వరి ఆదేశం ప్రకారం జనసేన కార్యకర్తలతో బీజేపీ కార్యకర్తలు కలిసి పనిచేయడం ప్రారంభించారు. అలాగే జనసేన కార్యకర్తలు కూడా బీజేపీ నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పంచాయితీలకు తిరిగి చెల్లించాలంటూ బీజేపీపి పిలుపు మేరకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో బీజేపీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

పురంధేశ్వరి కూడా చాలా బిజీగా ఉంటున్నారు. రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. పార్టీలోని ప్రతీ నాయకుడిని, ప్రతీ కార్యకర్తను పలుకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె జనసేనను కలుపుకుపోవాలనుకుంటున్న మాట వాస్తవం. కాకపోతే నేరుగా జనసేనానితో పురంధేశ్వరి భేటీ కాలేకపోవడం వెనుక ఒకే ఒక కారణం ఉందని భావిస్తున్నారు. టీడీపీతో పొత్తు విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడమే ఇందుకు కారణం. ఈ పని జరగకుండా ఇద్దరు నేతలు భేటీ అయితే టీడీపీని దూరం పెట్టినట్లవుతుందని కూడా అనుమానిస్తున్నారు. అందుకే కాస్త ఆగాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ తానే ముఖ్యమంత్రి అభ్యర్థినని చెప్పుకుంటున్నారు. బీజేపీ నేతలు బయటకు చెప్పకపోయినా దీనిపై కొంత ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండటంపై బీజేపీకి అభ్యంతరం లేకపోయినా ఉమ్మడి సమావేశంలో ఆ ప్రకటన చేస్తే బావుంటుందని బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. అందుకే అన్ని అంశాలపై ఓ అజెండా రూపొందించుకుని, టీడీపీతో పొత్తు వ్యవహారం ఒక్క కొలిక్కి వచ్చిన తర్వాత భేటీ కావాలని ఓ ఆలోచన ఉన్నట్లు ఇరు పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. అది నిజమో కాదో మరి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి