పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ పేరే తెలుగురాష్ట్రాల్లో ఓ వైబ్రేషన్. ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ట్రాలన్నింటా ఒక ఐకాన్.
వెండితెరపై అదో బాక్సాఫీస్ బంపర్ హిట్ సంతకం. సినిమాల్లో ఎన్నో రాబిన్ హుడ్ పాత్రల్లో ఒదిగిపోయారు పవన్ కళ్యాణ్. ఆయన నటన చూసి జనం చప్పట్లతో థియేటర్లను మార్మోగిస్తూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతల కొంగు బంగారం కాబట్టే పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా తీస్తే చాలనుకుంటారు నిర్మాతలు. అందుకోసం ఆయన కాల్షీట్ల కోసం వెంటబడతారు. ఎన్నాళ్లైనా నిరీక్షిస్తారు. ఇదంతా ఎందుకంటే సినిమాల్లో ఆయన పవర ఏ పాటిదో చెప్పడానికే. సినీ పరిశ్రమలో ఇంతటి స్టార్ డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ 2009లోనే రాజకీయాల్లోకి వచ్చారు. తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అప్పుడే విలువల్లేని రాజకీయాలపైనా నేతలపైనా నిప్పులు చెరిగిన ఫైర్ బ్రాండ్ పవన్.
2014లో రాష్ట్ర విభజన నేపథ్యంలో జనసేన పార్టీని స్థాపించారు పవన్. పార్టీకి శ్రీకారం చుట్టుని రోజునే ఓ విషయం స్పష్టం చేశారు. తాను పదవులకోసం రాజకీయాల్లోకి రావడం లేదని అన్నారు. ప్రజల జీవితాలు మెరుగు పర్చడమే తన లక్ష్యమన్నారు. అందుకోసం తాను ఎందాకైనా పోరాడతానని శపథం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పదవులు సీట్లు ఆశించకుండా బిజెపి-టిడిపిలకు మద్దతు నిచ్చి ఆ రెండు పార్టీలూ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అయిదేళ్ల పాటు చంద్రబాబు నాయుడి పాలనపై ఓ కన్నేసే ఉంచారు పవన్. ఆ పాలనలో తనకు నచ్చని విషయాలను నిర్మొహమాటంగా నిప్పులు చెరుగుతూ మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ ని కూడా విడిచి పెట్టకుండా టిడిపి ఎమ్మెల్యేలు మంత్రుల అవినీతిని ఎండగట్టిన పవన్ తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని చాటుకున్నారు.
2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బి.ఎస్పీలతో కలిసి జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగారు. ఆ ఎన్నికలకు ఆయన కేటాయించింది అతి తక్కువ సమయమే అయినా ఆరు శాతానికి పైగా ఓట్లు తెచ్చుకుని వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికల్లో తాను ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా డబ్బులు పంచలేదు. తాను రాజకీయాల్లో ఎలాంటి మార్పు తేవాలనుకున్నారో దానికి అనుగుణంగానే ఆయన ఆదర్శంగా నిలిచారు. తాను ఓటమి చెందినా కృంగి పోలేదు. పై పెచ్చు తాను మరో పాతికేళ్లు రాజకీయాల్లో ఉండేందకు సిద్దపడే వచ్చానని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇపుడు 2024 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోన్న పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన స్పందన లభిస్తోంది. జనసేనలో చేరేందుకు జనం పోటీలు పడుతున్నారు.
అయితే మిగతా రాజకీయ పార్టీల మాదిరిగా ప్రజలను కేవలం సభ్యులుగా చేర్చి వారిని ఎన్నికల్లో వాడుకుని ఆ తర్వాత వదిలేసే రకం కాదు పవన్. అందుకే క్రియాశీలక సభ్యులుగా చేరేవారికి పార్టీతరపున జీవిత బీమా కల్పిస్తూ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. ఇది దేశ రాజకీయాల్లోనే ఓ అద్భుతం. ఇంత వరకు అధికారంలోకి రాని ఓ ప్రాంతీయ పార్టీ తమ కార్యకర్తల ఉజ్వల భవిష్యత్ కోసం ఇంత జాగ్రత్త తీసుకోవడం ఇంతటి శ్రద్ధ వహించడం చాలా గొప్పవిషయమని రాజకీయ పండితులతో పాటు మేథావులూ కితాబునిస్తున్నారు. ఈ పథకం ప్రకారం సభ్యుల్లో ఎవరికైనా ఏ ప్రమాదం సంభవించినా బీమా ఆదుకుంటుంది. దీనికోసం పవన్ కళ్యాణ్ ఏటా కోటి రూపాయలను తన జేబులోంచి తీసి ఇవ్వనున్నారు. ఇతర పార్టీల తరహాలో చందాలు, విరాళాలు సేకరించి దాంతో పబ్బం గడుపుకోకూడదన్నది జనసేనాని లక్ష్యం. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి అత్యథిక ప్రాధాన్యత నివ్వాలన్నది పవన్ ఆశయం.
పార్టీ కోసం అహర్నిశలూ పనిచేసే వారంతా తన కుటుంబ సభ్యులే అన్నది ఆయన సిద్దాంతం. అందుకే ఈ వినూత్న బీమా పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. పథకం అమలును పార్టీలో నెంబర్ టూ గా ఉన్న నాదెండ్ల మనోహన్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 2024 ఎన్నికల నాటికల్లా అన్ని జిల్లాల్లోనూ లక్ష్యాలకు అనుగుణంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీన్ని జన సైనికులంతా ఓ యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లనున్నారు. పాత తరం రాజకీయాలకు స్వస్తి పలికి కొత్త రకం రాజకీయాలకు స్వాగతం పలకాలనుకునేవారు రాజకీయాల్లోనూ సమాజంలోనూ విలువలు పెరగాలని ఆకాంక్షించేవారు జనసేనలో చేరేలా చర్యల తీసుకుంటున్నారు. దీనికి అన్ని వర్గాల నుండి కూడా అనూహ్య స్పందన లభిస్తోంది. తమకి కులాలు మతాలు లేవని ఏదో ఒక సామాజిక వర్గానికి చెందిన రాజకీయ పార్టీ కాదని జనసేన గురించి పవన్ ఇప్పటికే చాలా సందర్బాల్లో క్లారిటి ఇచ్చి ఉన్నారు. అందుకే కులమతాలకతీతంగా పెద్ద సంఖ్యలో జనసేనలో చేరడానికి జనం తరలి వస్తున్నారని జనసేన నాయకత్వం అంటోంది. ఈ ఊపు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో జనసేన ఘన ప్రభంజనమే సృష్టిస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.