పవన్ వారాహి వాహనం రంగు వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణలో పవన్ కల్యాణ్ ప్రచార రథానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఇక రోడ్డెక్కడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో అబ్బే అదేం కుదరదు అంటోంది వైసీపీ. తెలంగాణలో తిప్పలు తప్పినా ఏపీలో మాత్రం వదిలే ప్రసక్తే లేదంటోంది. నిను వీడని నీడను నీను అంటూ వారాహిని వెంటాడుతూనే ఉంది. వారాహికి ఏపీలో ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వారాహి వాహనం అసలు లక్ష్యం ఏపీయే కావడంతో ఇక్కడ దానిపై ప్రభుత్వం లేవనెత్తే అభ్యంతరాలు కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటికే మంత్రులు చేసిన కామెంట్లు వేడి పెంచుతున్నాయి.
వారాహి ఫోటోలు బయటకు రాగానే మాజీ మంత్రి పేర్నినాని టార్గెట్ చేశారు. ఆలివ్ గ్రీన్ రంగును వారాహికి ఎలా వాడతారంటూ ప్రశ్నించారు. ఆ కలర్ అయితే రిజిస్ట్రేషన్ కాదని కూడా తేల్చిచెప్పేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణలో ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే దీని రిజిస్ట్రేషన్ పూర్తి చేయించుకున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వాహనం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని కానీ ఎక్కడ తిరుగుతోందన్నది ముఖ్యమన్నారు. అమెరికాలో వాహనం తీసుకున్నా తిరిగే చోట అమలయ్యే నిబంధనలే దానికీ వర్తిస్తాయన్నారు. తద్వారా పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని అడ్డుకుంటామనే రీతిలో చెబుతున్నారు. ఒకవేళ ఏపీలోకి తన వాహనం రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటే ఏం చేయాలా అనే విషయంలో పవన్ కూడా నిపుణులతో చర్చిస్తున్నారట.
ఇదిలా ఉంటే మొన్నటిదాకా వారాహి కలర్‌ను లక్ష్యంగా చేసుకొని ట్రోల్స్ చేసిన జగన్ సైన్యం ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్‌పై పడ్డారు. పవన్ వెహికల్ నంబర్ 8384 కాగా వాటిని విడదీసి ప్లస్ చేసి కూడుతున్నారు. 8+3+8+4=23 వచ్చేసింది. పవన్ తన యజమానికి ఇష్టమైన నంబర్ తీసుకున్నాడు. అది జనసేనాని అంటే అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ 23 లెక్క ఏంటంటే 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన అసెంబ్లీ సీట్లు 23 . ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి వచ్చిన నంబర్ మొత్తం కలిపితే 23 అవుతోంది. ఆ నంబర్ టీడీపీకి బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు పార్టీకి లింక్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు.
వైసీపీకి జనసేన అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తోంది. జనసేన శ్రేణులు మరో లాజిక్‌తో తిప్పికొడుతున్నారు. వారాహి వాహనం సంఖ్య మొత్తం 23 అంటే 2+3=5. 5వ సంఖ్య అమ్మవారికి ఇష్టమైన సంఖ్య, శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రంలో ఒక శ్లోకం కూడా ఉందని చెబుతున్నారు. మీ పిచ్చి పైత్యాలు జనాలమీద రుద్దమాకండి అంటూ మండిపడుతున్నారు. కాగా పవన్ కళ్యాణ్ వారాహికి తెలంగాణ రవాణా శాఖ టీఎస్13ఈఎక్స్ 8384 నంబర్‌ను కేటాయించింది. వారాహి రంగుపై అభ్యంతరం ఏమీ లేదని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ క్లారిటీ ఇచ్చారు. భారత సైన్యం ఉపయోగించే రంగు కోడ్ 7బీ 8165 అని, జనసేన ప్రచార వాహనం రంగు కోడ్ 445సీ44 అని వివరించారు.