పూనకాలు లోడింగేనా.. ప్రజలను ఆకట్టుకునేదేమన్నా ఉందా?

By KTV Telugu On 28 January, 2023
image

వెండి తెరపై ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన పేరు చెబితే చాలు అభిమానుల్లో పూనకాలు లోడ్ అయిపోతాయి. ఆయన ఒక్క డైలాగ్ చెబితే చాలు చప్పట్లతో థియేటర్లు మార్మోగిపోతాయి. ఒక్క ఫైట్ ఒక్క పాట చాలు జనం పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. కేరింతలు కొడతారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రతీ ఒక్కరిలోనూ ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇంతటి పవర్ ఫుల్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో మాత్రం ఎందుకు చేష్ఠలుడిగి పోతున్నారు. ఎందుకని పదే పదే తప్పటడుగులు వేస్తున్నారు. ఆయన బహిరంగ సభల్లో మాట్లాడే ప్రసంగాలు ఎవరైనా సినీ రచయితలు రాసి ఇస్తారేమోనని ప్రచారం జరిగేది. అయితే అలాంటిదేమీ లేదు పవన్ కళ్యాణే సొంతంగా తయారు చేసుకుంటారని జనసైనికులు అంటూ ఉంటారు.

కానీ పవన్ ప్రసంగాలు వింటే మాత్రం అందులో కంటెంట్ లేదని అర్దమైపోతుంది. ఎంతసేపూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పై విద్వేషం రగిలేలా ఊగిపోతూ తిట్టిపోయడం మంత్రులను ఎరా ఒరేయ్ సన్నాసి వెధవల్లారా అంటూ ఏకవచన సంబోధనలతో రెచ్చిపోవడం తప్ప జనసేన అధికారంలోకి వస్తే ఏంచేస్తారో పవన్ స్పష్టంగా చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. చేసే ప్రసంగమైనా ఎలా ఉంటుందంటే అందులో ఒక వాక్యానికీ మరో వాక్యానికీ పొంతన ఉండదు. ఉదాహరణకు వారాహి యాత్ర మొదలైన తర్వాత గణతంత్ర దినోత్సవరం రోజున పవన్ కళ్యాణ్ జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా గుర్రం జాషువా చెప్పినట్లు విశ్వనరుడి బాటలో నడుస్తా అన్నారు పవన్ కళ్యాణ్.

చాలా చక్కగా మాట్లాడుతున్నారని అనుకునే లోపే మన చేతుల్లో ఓచెయ్యి మన కులంపై ఉంటే రెండో చెయ్యి ఇతర కులాలపై ఉండాలి. లేదంటే ఇతర కులాలు మనకి దూరం అయిపోతాయి అని అనేశారు పవన్. విశ్వనరుడిగా ఉంటాననడం ఏంటి కులాల ఓట్ల కోసం వ్యూహాలు సిద్ధాంతీకరించడం ఏంటి అని బుర్రలుబద్దలు కొట్టుకోవలసిన పరిస్థితి. అలాగే భవిష్యత్ అంతా యువతరానిది. అంటే మీదే. వచ్చే 50 ఏళ్ల పాటు మీరే ఏలాలి. ఈ ముసలాళ్లు చెప్పింది నమ్మకండి. వారి మాటలు వినకండి అని పవన్ దిశానిర్దేశనం చేశారు. మరి ఆయన చెప్పిన ముసలోళ్లు ఎవరు. 2024 ఎన్నికల నాటికి 75 ఏళ్లు నిండే చంద్రబాబు నాయుడితో పవన్ అంటకాగుతున్నారు. వైసీపీని ఓడించేందుకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు.

మరో పక్క ఏడు పదులు దాటిన బిజెపి అగ్రనేత ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకిష్టమంటారు. తనకు బిజెపి నుండి రోడ్ మ్యాప్ రావాలంటారు. మరి ఇద్దరు ముసలోళ్ల కనుసన్నల్లో రాజకీయాలు చేస్తూ వస్తోన్న పవన్ కళ్యాణ్ యువతను మాత్రం ముసలోళ్ల మాటలు వినకండి అంటే అర్దం ఏంటి. యువత చంద్రబాబు మాటలు కూడా నమ్మకూడదని పవన్ చెప్పదలచుకున్నారా అన్నది అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు. అందరూ ప్రశాంతంగా ఉండాలని తాను శాంతినే కోరుకుంటానని అన్నారు. అదే నోటితో  ఉత్తరాంధ్ర వాసులు తమకి రాజధాని ఇవ్వకపోతే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరడంపై మండి పడుతూ వేర్పాటు వాదంతో మాట్లాడితే తోలు తీస్తా విరగ్గొడతా అంటూ దురహంకారంతో హెచ్చరికలు జారీ చేశారు పవన్. తోలు తీయడం కూడా శాంతి యజ్ఞంలో భాగమా అని శాంతి గురించి తెలీని అమాయకులు నిలదీస్తున్నారు.

2019 ఎన్నికల ప్రచారంలో తన మనసులో రాజధాని అంటే కర్నూలే అన్నారు పవన్ కళ్యాణ్ తాజా ప్రసంగంలో మాత్రం మూడు రాజధానులంటే ఊరుకోం అంటూ హుంకరించారు. ఎంత సేపూ ఆవేశంతో ఊగిపోతూ మంత్రులను తిట్టిపోస్తూ ప్రసంగాలు చేయడమే తప్ప అర్ధవంతమైన నాలుగు మాటలు మాట్లాడ్డం లేదంటున్నారు రాజీకయ విశ్లేషకులు. ఇక ప్రజలు, జనసేన అభిమానులను ఉద్దేశించి మీరు నాకు సొంతంగా అధికారాన్ని ఇస్తామని గ్యారంటీ ఇస్తే నేను పొత్తులు పెట్టుకోవలసిన అవసరమే ఉండదు. మీరు గ్యారంటీ ఇస్తారా చెప్పండంటూ నిలదీశారు. మిమ్మల్ని నమ్ముకుని రాజకీయాల్లోకి దూకేసినందుకు నాలిక తెగ్గోశారని నెత్తుటి గాయాలైపోయాయని చెప్పుకొచ్చారు. తన ఓటమికి ప్రజలదే బాధ్యతని చంద్రబాబు నాయుడిలాగే శాపనార్దాలు పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలుకంటోన్న పవన్ కళ్యాణ్ ముందుగా ప్రజలను ఆకట్టుకునేలా నాలుగు మంచి మాటలు మాట్లాడ్డం నేర్చుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.