పవన్ వర్సెస్ లోకేశ్ – సోషల్ మీడియా గేమ్

By KTV Telugu On 9 February, 2024
image

KTV TELUGU :-

టీడీపీ, జనసేన పొత్తను దెబ్బకొట్టాలనుకుంటున్నారా.  రెండు వర్గాలను దూరం చేయాలనుకుంటున్నారా. పొత్తును టీడీపీ వద్దనుకుంటున్నట్లు ప్రచారం మొదలుపెట్టారా.  పవన్ ను దూరం పెట్టడమే నారా లోకేశ్…  ఉద్దేశమా. ఇది నిజంగా నిజమా.. సోషల్ మీడియా గేమ్ మాత్రమేనా….

పవన్ కల్యాణ్ కు ఎంతమంది మద్దతుదారులున్నారు. గతంలో వచ్చిన  దాదాపు ఏడు శాతం ఓట్లకు పైగా ఎంత మేర ఓట్ షేర్  పెరుగుతుంది.వాపుకు, బలుపుకు మధ్య తేడా తెలుసుకునే పరిస్థితి  లేదా. పవన్ కు బలం లేకుండానే ఆయన స్పీచులను చూసి సీట్లు కేటాయించాలనుకోవడం సరికాదని టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదీ వాస్తవం..ఎందుకంటే పార్టీ ఒకసారి ఊపుమీదకు వచ్చిన తర్వాత పక్కనోడితో షేర్  చేసుకునేందుకు ఏ పార్టీ ఒప్పుకోదు. టీడీపీ కేడర్లో ఉన్న  ఈ అభిప్రాయాన్ని ఆసరాగా తీసుకుని సోషల్ మీడియా గేమ్ మొదలైంది. ఈ గేమ్  కొంత వేగంగానే విస్తరిస్తోంది. జేఎస్పీతో పొత్తును టీడీపీ నేతలు ఇష్టపడటం లేదన్నది ఇప్పుడు సామాజిక  మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం. అందులోనూ స్వయంగా  చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేశ్…ఈ మేరకు స్కెచ్ వేస్తున్నారని కూడా ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తో చెలిమి లోకేశ్ కు ఇష్టం లేదని, అందుకే క్రమంగా ఓ పద్ధతి ప్రకారం పొగ పెడుతున్నారన్నది ఆ ప్రచారం  సారాంశం. అందుకు వారి  వద్ద అనేక ఉదంతాలు కూడా ఉన్నాయని  చెప్పక తప్పదు…

ఇంతకీ నారా లోకేశ్ ఏం చేస్తున్నారు. ఆయన తీరు ఎలా ఉంది. పవన్ కల్యాణ్ తో మైత్రికి లోకేశ్ ఎందుకు ఇష్టపడటం లేదు.  టీడీపీ కేడర్లో వస్తున్న స్పందన ఏమిటి….

లోకేశ్ కు పవన్ కల్యాణ్ ఎప్పుడూ పోటీనే… అందులో ఎలాంటి సందేహమూ  లేదు. 2019లో  పొత్తు పెట్టుకోకపోవడానికి కూడా అదే కారణమని చెబుతారు. పవన్ తో చేతులు కలిపితే లోకేశ్ వీకైపోతాడని అప్పట్లో ఓ పెద్దమనిషి నారా చంద్రబాబు నాయుడుకి నూరిపోశారు. ఆ మాట నమ్మి ఒంటరిగా పోటీ చేసి టీడీపీ ఓటమి పాలైంది.అందుకే ఇప్పుడు పొత్తుకు అంగీకరిస్తున్నప్పటికీ పాత భయం మాత్రం వెంటాడుతోంది. పవన్ ఎంత బలపడితే  లోకేశ్ అంత బలహీనుడవుతారని టీడీపీ వ్యూహకర్తల భయం. అటువంటి భయంలో నిజం లేకపోలేదు. ఎందుకంటే పవన్ కు సినీ గ్రామర్ ఉంది. లోకేశ్ కు  పప్పు అన్న  పేరు ఉంది. ఆ రెండింటినీ ఎవ్వరూ కాదనలేరు. పైగా ఇప్పుడు లోకేశ్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా మొదలుపెట్టారు. వైసీపీని వీడిన వారిని స్వయంగా పిలిచి మాట్లాడటంతో పాటు అవసరాన్ని  బట్టి పార్టీలో చేర్చుకుంటున్నారు. తమకు  అవసరం లేని వారిని జనసేనకు పంపుతున్నారు. అదీ మరో గేమ్. అయితే ఎన్నికల నాటికి టీడీపీని బలోపేతం చేసి ఒంటరిగా పోటీ చేసినా గెలిచే విధంగా పార్టీని సిద్ధం చేస్తున్నారని కేడర్లో ఒక వర్గం చెప్పుకుంటోంది. లోకేశ్ కు కూడా చాలా యాంబిషన్స్ ఉన్నాయి. పవన్ తో కలిసి నడిస్తే అవి పూర్తికాకపోవచ్చు. లేనిపక్షంలో అసంపూర్ణంగా ఆగిపోవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు  జనసేనను దూరం చేసుకునే సీన్ మాత్రం లేదు. ఐనా సరే ఈ అంశాలను అర్థం చేసుకోవడం, వాటిపై పూర్తి అవగాహన ఉండటంతో టీడీపీ వ్యతిరేకులు కొందరు సోషల్ మీడియాలో గేమ్ మొదలు పెట్టారు. ఇంకేముంది పవన్ ను తరిమేయడం, టీడీపీ ఒంటరిగా పోటీ చేయడం ఎంతో దూరం లేదని ప్రచారం చేస్తున్నారు…

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ చిత్రవిచిత్రాలు చాలానే జరుగుతాయి. పార్టీ వ్యతిరేకులు రకరకాల ప్రచారాలు చేస్తారు. ఇద్దరి  మధ్య పచ్చగడ్డి  వేస్తే భగ్గుమనే స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తారు. వారి కోరిక ఫలించకుండా చూడాల్సిన బాధ్యత టీడీపీ నేతలపైనే ఎక్కువగా ఉంటుంది. ఆ మాట చెప్పడానికి ఎవరూ సందేహించకూడదు.  లోకేశ్ తిరుగులేని నాయకుడు అవుతారా లేదా అన్నది వేరే విషయం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి