డీఎంకేకు వ్యతిరేకంగా…అన్నాడీఎంకేకు అనుకూలంగా..

By KTV Telugu On 7 October, 2024
image

KTV TELUGU :-

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక వారంలోనే రెండు సార్లు తమిళ రాజకీయాలపై ఆసక్తికరమైన కామెంట్స్ వదిలారు. తొలుత ఆయన తిరుపతి వారాహి సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు వార్నింగ్ ఇచ్చారు. సనాతనధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించేశారు. రెండు రోజుల గ్యాప్ లో పవన్ మరో ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడైన పురచ్చి తలైవర్ ఎంజీఆర్ పట్ల తనకు ప్రేమ, అభిమానం ఉన్నాయని, చెన్నైలో ఉండే రోజుల్లో ఆయన్ను ఎంతగానో ఆరాధించేవాడినని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చెన్నై మైలాపూర్ బడిలో తమ తమిళ ఉపాధ్యాయుడు చెప్పిన తిరుక్కురల్ కవితను కూడా ప్రస్తావించారు. పైగా అక్టోబరు 17న జరుపుకునే అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవానికి ఇప్పుడే ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు..

చిన్నతనంలో చెన్నైలో ఉన్న కారణంగా పవన్ కల్యాణ్ కు తమిళుల పట్ల, తమిళ భాష పట్ల అభిమానం ఉండటం సహజమే. పైగా తమిళ స్నేహితుల ద్వారా ఆయన అనేక విషయాలు తెలుసుకుని ఉంటారు. హైదరాబాద్ లో సెటిలైన తర్వాత తమిళనాడుకు దూరమైనప్పటికీ తమిళం పట్ల అభిమానం, తమిళ నాయకులను గమనించడం మానుకోవాల్సిన అవసరమూ లేదు. ఐతే పవన్ కల్యాణ్ ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న టైమింగును కూడా ఆలోచించాల్సి ఉంది. పవన్ ఇప్పుడు బీజేపీతో పొత్తుగా ఉన్నారు. బీజేపీ, దాని భావసారూప్య సంస్థలు సనాతన ధర్మాన్ని పాటిస్తుంటే.. తమిళనాడులో డీఎంకే .. దానికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పాలి. కొన్ని రోజుల క్రితం ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చి, దాన్ని పూర్తిగా రూపుమాపాలని పిలుపునిచ్చారు. అప్పుడు ఏ మాటా మాట్లాడని పవన్ కల్యాణి…ఇప్పుడు కరెక్టుగా తాను దీక్ష చేసినప్పుడే సనాతన ధర్మంపై స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. పైగా తాను ఇంతకాలం పట్టించుకోని డీఎంకే నాయకులను హెచ్చరించారు. తమిళ రాజకీయాలతో సంబంధం లేని పవన్ కల్యాణ్ అలా ఎందుకు మాట్లాడుతున్నారని ఆలోచించే లోపే ఆయన ఎంజీఆర్ ను ప్రశంసించారు. ఇప్పుడు ఎంజీఆర్ ఎందుకు గుర్తుకు వస్తున్నారని కూడా విశ్లేషించుకోక తప్పదు. ఎంజీఆర్ ప్రజా నాయకుడని చెప్పేందుకు సందేహించకూడదు. అది వేరే విషయం…

పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్స్ వెనుక బీజేపీ ఉందా అన్న సందేహాలు కూడా రాకమానవు. ఆయన్ను ఏపీతో పాటు తమిళనాడులో కూడా రాజకీయానికి ఉపయోగించుకోవాలని బీజేపీ అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే డీఎంకే ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో ఉంది. అన్నాడీఎంకే ఒకప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉండేది. కొన్ని కారణాలతో ఆ పార్టీ కమలానికి దూరం జరిగింది. ఇప్పుడు మళ్లీ లెక్కలేసుకుని అన్నాడీఎంకేను బీజేపీ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. కాగల కార్యం గంధర్వులు చేశారన్నట్లుగా ఆ పని పవన్ కల్యాణ్ తో చేయించాలని బీజేపీ భావిస్తుండొచ్చు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై కమలం ఫోకస్ పెట్టింది. లేకపోతే ఏపీ పాలిటిక్స్ లోనే నిండామునిగిపోయి తీరికలేని పవన్ కల్యాణ్ తమిళ రాజకీయాలపైనా, అక్కడి నాయకులపైనా ఎందుకు మాట్లాడతారు.. చెప్పండి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి