అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఐనా అధినేత జగన్ రెడ్డిలోనూ, పార్టీ శ్రేణుల్లోనూ ఎలాంటి మార్పు రావడం లేదు. అధికారంలో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తూ.. సామాన్య జనంపై పెత్తనం సాగించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు కూడా బాగానే పెరిగింది. సాధారణంగా అధికార పార్టీలో ద్వితీయ శ్రేణి నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. వైసీపీలో మాత్రం ఓడిపోయిన తర్వాత ఆధిపత్య పోరు పెరిగింది. పైగా ఒకరు కార్యక్రమం నిర్వహిస్తే మరొకరు వారిని కిందకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు..
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉండేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి, ఆర్కే రోజా లాంటి నేతలు ఒక వెలుగు వెలిగారు. చిత్తూరు రాజకీయాలు మొత్తం పెద్దిరెడ్డి చుట్టూ తిరిగితే.. రోజా లాంటి వాళ్లేమో కలెక్షన్ క్వీన్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఓడిన తర్వాత మాత్రం కొందరు నేతలు సైడ్ అయిపోయినప్పటికీ మిగతా వాళ్లు మేమున్నామంటూ చక్రం తిప్పే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు…
తాజాగా పార్టీ నియామకాల్లో ఉమ్మడి చిత్తూరు, తిరుపతి అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నియమితులైన సందర్బంగా పదవీ స్వీకార కార్యక్రమంలో నేతల తీరు బయటపడింది. జగన్ రెడ్డి స్వయంగా ఆదేశించి తిరుపతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా వైసీపీలో కొందరు నేతలు దానికి అడ్డు తగిలారు. పట్టుమని పదివేల మంది హాజరు కాకుండా గేమ్ ఆడేశారు…
ఎన్నికల ముందు చెవిరెడ్డి చిత్తూరును వదిలి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వెళ్లిపోయారు. అక్కడ ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మళ్లీ చిత్తూరుపై ఆయన దృష్టి పెట్టారు. ప్రకాశంలో పార్టీని నాశనం చేసిందీ చాలక మళ్లీ చిత్తూరు వచ్చావా అంటూ చెవిరెడ్డిపై పెద్దిరెడ్డి వర్గం మండిపోతోంది. అందుకే భూమన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో షో చేద్దామని భావించిన చెవిరెడ్డికి నోస్ కట్ అయిపోయే స్కెచ్ వేసింది. భూమన ప్రమాణ స్వీకారం తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారు. లక్ష మంది వస్తారనుకుని ఆ రేంజ్ లో ఆహార పదార్థాలు సిద్ధం చేయిస్తే.. వచ్చిన జనం పదివేల లోపే ఉండటంతో అంతా వృథా అయిపోయింది. మన వాళ్లు ఎవరూ వెళ్లొద్దని, ఇతరులను కూడా వెళ్లకుండా అడ్డుకోవాలని పెద్దిరెడ్డి ఆదేశించడం వల్లే చిత్తూరు జిల్లా శ్రేణులు భూమన ప్రమాణ స్వీకారానికి రాలేదని చెబుతున్నారు. దీని లక్షల సొమ్ము వృథా అయ్యిందని చెవిరెడ్డి బ్యాచ్ పళ్లు కొరుక్కుంటోంది.
ఇక నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా పరిస్తితి పైన పటారం, లోన లొటారం అన్నట్లుగా తయారైంది. ప్రత్యర్థుల మీద ఆమె వాగ్బాణాలతో విరుచుకుపడుతున్నారే తప్ప.. సొంత పార్టీలో ఆమెను ఎవరూ పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ ఎలాంటి కార్యక్రమానికి తనను పిలవడం లేదని రోజా తన సన్నిహితుల దగ్గర వాపోతున్నారు.. ఉమ్మడి జిల్లా మొత్తం వైసీపీ కేడర్ నీరసంగా పడుంటే.. పార్టీ నేతలు మాత్రం అంతర్గత కుమ్ములాటతో టైమ్ పాస్ చేస్తున్నారు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…