మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ టార్గెట్ అయ్యింది. పెద్దిరెడ్డిని చంద్రబాబు పుంగనూరు పుడింగి అని పిలుస్తారు. పుంగనూరు పుడింగి కుటుంబాన్ని భూస్థాపితం చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించారు. గత ఐదేళ్లలో వాళ్లు చేసి అక్రమాలను వెలికి తీసే ప్రక్రియ వాయువేగంగా కొనసాగుతోంది. ఇందుకోసం మంత్రులు, అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఫైళ్లను జల్లెడ పట్టడమే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన దందాలపై కూడా ఫోకస్ పెట్టారు.
ఇద్దరూ ఒక జిల్లా వారే అయినా చంద్రబాబుకు, పెద్దిరెడ్డికి అసలు పడదు. జగన్ ఆదేశించారో, తానే స్వయంగా చేశారో తెలీదు కానీ.. ఐదేళ్లపాటు చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు పెద్దిరెడ్డి ప్రయత్నించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తం తన ఇలాకాగా పరిగణిస్తూ టీడీపీ శ్రేణులను తెగ ఇబ్బంది పెట్టారు. చంద్రబాబును కుప్పం వైపుకు వెళ్లకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గతేడాది అంగళ్లు దగ్గర జరిగిన సంఘటనలు కూడా పెద్దిరెడ్డి స్కేచ్చేనని పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దిరెడ్డి కుమారుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా అప్పట్లో చంద్రబాబును ఇబ్బందిపెట్టే రాజకీయాలు చేశారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గెలవకుండా చూసేందుకు మిథున్ రెడ్డి స్కెచ్ వేశారు. అయితే జనసేనాని మాత్రం భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రాజెక్టుల్లో పెద్దిరెడ్డి చేసిన అవినీతిని వెలికి తీసేందుకు జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కంకణం కట్టుకున్నారు. అవులుపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాలు అన్నీఇన్నీ కావని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో పెద్దిరెడ్డి 600 కోట్ల అవినీతికి పాల్పడ్డారని సంచలన ఆరోపణ చేశారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును నిర్మించారని ఆయన అన్నారు. ఆవులుపల్లితో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందా? అనే కోణంలో విచారిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అంటే పెద్దిరెడ్డితో పాటు చాలా మంది వైసీపీ నేతలకు చెవుల్లో మ్యూజిక్ వినిపించడం ఖాయమని తెలిపోయింది…
పెద్దిరెడ్డి ఫ్యామిలీపై సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. జగన్ కంటే ముందు చుట్టూ ఉన్నవారి భరతం పడితే తర్వాత అసలు నేత సంగతి చూడొచ్చన్న ఆలోచనతో అధికారపార్టీ పావులు కదుపుతోంది.
నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నది టీడీపీ గుర్తుకు తెచ్చుకుంటున్న సామెత. చంద్రబాబు కుప్పంలో అడుగు పెట్టకుండా చూడాలని పెద్దిరెడ్డి చేసిన ప్రయత్నానికి కౌంటర్ గా ఇప్పుడు ఆయన్ను పుంగనూరులోకి ఎంట్రీ ఇవ్వకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. పుంగనూరులో పెద్దిరెడ్డి పర్యటిస్తారని తెలియడంతో ఆయన్ను పొలిమేర్లలోకి రాకుండా టీడీపీ చర్యలకు దిగింది. ఈ క్రమంలో కొందరు టీడీపీ కార్యకర్తలు కొంచెం అత్యుత్సాహం కూడా ప్రదర్శించి వైసీపీ శ్రేణులపై దాడులకు దిగారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటరెడ్డి యాదవ్, నరసింహులు నివాసాలపై దాడులు జరిగాయి. పుంగనూరులో వైసీపీ కార్యకర్తల సమావేశం జరగకుండా అడ్డుకున్నారు. దానితో తిరుపతి నుంచి బయలుదేరకుండా పెద్దిరెడ్డి ఆగిపోవాల్సి వచ్చింది. అక్కడకు వెళ్లడం శ్రేయస్కరం కాదని పోలీసులు హెచ్చరించి మరీ ఆయన్ను తిరుపతిలోనే ఆపేశారు. ఇలాంటి ఘటనలు ముందు ముందు చాలానే ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డికి పుంగనూరు ఎంట్రీ ఉండదని చెబుతున్నారు. ఈ లోపే కేసులు ఏమైనా పెడితే పెద్దిరెడ్డి కుటుంబానికి అసలు కష్టాలు మొదలవుతాయి….
చంద్రబాబు పగబడితే సీన్ ఎలా ఉంటుందో పెద్దిరెడ్డికి తెలియబోతోంది. వైసీపీ హయాంలో ఇష్టానుసారం వ్యవహరించినందుకు మూల్యం చెల్లించుకునే టైమ్ వచ్చింది. అసలు స్కాములు బయటకు వస్తే పెద్దిరెడ్డి అరాచకాలు ప్రతీ ఒక్కరికీ తెలుస్తాయని అధికార పార్టీ నేతలు అంటున్నారు. చూడాలి మరి ఎప్పుడు, ఏం జరుగుతుందో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…