పీలేరులో నల్లారి ఫ్యామిలీ నిలబడుతుందా ? -PILERU-KIRAN KUMAR REDY | YSRCP-JAGAN MOHAN REDDY

By KTV Telugu On 27 February, 2024
image

KTV TELUGU :-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం పీలేరు. కానీ  కిరణ్ రాజకీయ తప్పిదాలతో ఆ కోటను కోల్పోయారు. గత రెండు ఎన్నికల్లో ఓడజిపోయారు.  కిరణ్ బీజేపీలో ఉన్నారు. కానీ ఆయన నాన్ ప్లేయింగ్ కెప్టెన్. ఎప్పుడూ బయట కూడా కనిపించరు. ఆయన సోదరుడు టీడీపీలో చేరి రాజకీయం చేస్తున్నారు. ఆయనే అభ్యర్థి కూడా. రెండు సార్లు ఓడిన ఆయన ఈ సారి గెలిచి తీరాలన్న పట్టదలతో ఉన్నారు. చంద్రబాబు మొదటి జాబితాలోనే టిక్కెట్ ఖరారు చేశారు.  వైసీపీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఉంది.

ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి. ఈ సెగ్మెంట్ అటు తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాయచోటి, పలమనేరు వంటి ప్రాంతాలకు మధ్యలో అన్నిటికీ 57 కిలోమీటర్ల డిస్టెన్స్ లో సెంటర్ లో ఉంటుంది. రాజకీయంగా, వాణిజ్యపరంగా కీలక ప్రాంతమిది. 1994కు ముందు ఇక్కడ టీడీపీ హవా నడిచింది. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఎలక్షన్ లోనూ పీలేరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. అప్పటి నుంచి పోరాడుతూ ఓడుతూనే వస్తోంది.  వాయల్పాడుగా ఉన్న నియోజకవర్గాన్ని 2009లో పీలేరులో కొన్ని భాగాలు కలిపి కొత్త నియోజకవర్గంగా మార్చారు. నల్లారి అమరనాథరెడ్డి ఇక్కడి ప్రజల మన్ననలు పొందారు. ఆయన హఠాన్మరణంతో..ఆయన కుమారుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సీఎం అయ్యే వరకూ సోదరులు తెర వెనుకే ఉన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ “జై సమైక్యాంధ్ర పార్టీ” పేరుతో సొంత పార్టీ ఏర్పాటు చేసి పోటీ చేశారు. కానీ.. సొంత నియోజకవర్గం పీలేరులోనూ విజయం సాధించలేకపోయారు.  రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత  నల్లారి సోదరులు రాజకీయంగా వేరు బాట పట్టారు.  సోదరుడు కిషోర్ మాత్రం టీడీపీలో చేరారు. కిరణ్ కాంగ్రెస్, బీజేపీల్లో చేరినా  ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

పీలేరు నియోజకవర్గంలో పీలేరు, కలికిరి, కలకడ, కేవీపల్లె, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలు, 293 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. మొత్తం ఓటర్లు  రెండున్నర లక్షల మంది వరకూ ఉన్నారు.  నల్లారి కుటుంబంపై ప్రజల్లో అభిమానం ఉంది. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు.. నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.  వైసీపీ అభ్యర్థి పేరుకు… చింతల రామచంద్రారెడ్డే కానీ.. ఆయనకు… కర్త, కర్మ, క్రియ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే.  నల్లారి కుటుంబంతో అనాదిగా తమకున్న రాజకీయ వైరం కారణంగా పెద్దిరెడ్డి కుటుంబం చింతలను అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఆర్థిక వనరులు సహా.. ఎలక్షనీరింగ్ కూడా పీలేరులో పెద్దిరెడ్డే చూసుకుంటారు.

2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి 49 శాతం ఓట్లు సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులు 6 శాతం ఓట్లు సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపునకు కారణం ఆయన వ్యక్తిగత ఇమేజ్. అలాగే జగన్ వేవ్ తోడవడం మరో రీజన్. అలాగే 2017లో టీడీపీలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 4.4 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయారు.  రెండు సార్లు ఓడిపోయారన్న సానుభూతి నియోజకవర్గంలో కనిపిస్తోంది.  వైసీపీ నేతలు, కార్యకర్తలపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.  రెండు సార్లు ఓడినా నల్లారి కిషోర్ ప్రజల్లోనే ఉన్నారు. ఫార్టీ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లారు.

టీడీపీ-జనసేన పొత్తుతో 15 శాతం వరకూ ఉన్న బలిజ ఓటర్ల మద్దతు ఏకపక్షంగా వచ్చే అవకాశం ఉంది.   వైసీపీలో ఇంకా టిక్కెట్ ఖరారు చేయలేదు.  పెద్దిరెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే    పీలేరు నుంచి కుమారుడు మిధన్ రెడ్డి.. తంబళ్లపల్లె నుంచి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డిని, పలమనేరులోనూ మరో సోదరుడ్ని నిలబెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు.   అయితే..   చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేకే చాన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

పీలేరులో వైసీపీ, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది.  టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో రెండుసార్లు ఓడిన సానుభూతి, జనసేనతో పొత్తు కూడా టీడీపీ అభ్యర్థికి కీ రోల్ పోషించబోతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.  పీలేరు సెగ్మెంట్ లో బలిజ సామాజికవర్గం జనాభా 18 శాతంగా ఉంది. వీరిలో మెజార్టీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీవైపు పడుతాయన్న అంచనాలున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి