ఏరు దాటేదాక ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా తయారైంది పిఠాపురంలో కూటమి పార్టీల్లో పరిస్థితి. అక్కడి టీడీపీ ఇన్చార్జ్ వర్మతో ఎన్నికల ముందు ఒకలా..ఇప్పుడు మరోలా వ్యవహరిస్తోంది జనసేన పార్టీ. తన గెలుపును వర్మ చేతిలో పెడుతున్నట్లు ఎన్నికల సందర్భంగా పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఇప్పుడు తన సోదరుడి తరపున పిఠాపురం పగ్గాలు చేతబట్టిన నాగబాబు టీడీపీ నేత వర్మకు చెక్ పెట్టారు. దీంతో కూటమిలో కుంపట్లు రాజుకుంటున్నాయి. అసలు పిఠాపురంలో ఏం జరుగుతోంది?
రాష్ట్రం అంతా దుర్భిణీ వేసి వెతికి చివరికి పిఠాపురంలో పోటీ చేయడానికి నిర్ణయించుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భారీ మెజారిటీతో అక్కడ విజయం సాధించారు. కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు పిఠాపురం సీటు కేటాయించడంతో అక్కడి టీడీపీ ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎస్ వర్మ తన సీటు పోతుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఆయన్ను బుజ్జగించి పవన్ విజయానికి సహకరించాలని సూచించారు. వర్మ కూడా పవన్ కోసం ప్రచారం చేశారు. సీటు త్యాగం చేసిన వర్మకు పవన్ తగువిధంగా గౌరవం ఇచ్చారు.
ఎన్నికల ముందు తన గెలుపును వర్మ చేతిలో పెడుతున్నానని .పవన్ బహిరంగంగానే ప్రకటించారు. పవన్ గెలిచి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆరు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కట్ చేస్తే….ఇప్పుడు పిఠాపురం లో సీన్ రివర్స్ అయ్యింది. ఎన్నికల్లో పవన్ విజయడానికి సహకరించిన వర్మతో పాటు మొత్తంగా టిడిపి క్యాడర్ కు పిఠాపురం నియోజకవర్గంలో చెక్ పెట్టింది జనసేన పార్టీ. రెండు రోజుల క్రిందట ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు నాగబాబు.
నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా పవన్ దృష్టికి లేదా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురావాలని చెప్పాలని వెల్లడించారు. నియోజకవర్గంలో పనుల గురించి ఇతర పార్టీలవారికి చెప్పాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఇన్ డైరెక్ట్ గా వర్మను..టిడిపి నాయకులను ఉద్దేశించే నాగబాబు ఈ కామెంట్స్ చేశారు. నాగబాబు వ్యవహరిస్తున్న తీరుతో పిఠాపురంలోని టీడీపీ శిబిరం రగిలిపోతోంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, పవన్ విజయానికి కృషి చేసిన వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అవసరానికి తమనరు వాడుకుని..ఎన్నికల్లో గెలిచాక పక్కన పెట్టేయడమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు జనసేన ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ టీడీపీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి కాని ఒక పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారులకు హుకుం జారీ చేయడమేంటంటూ నాగబాబు తీరును విమర్శిస్తున్నారు. పవన్ గెలుపు కోసం పని చేసిన తమకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని ఇటీవల జరిగిన కొన్ని ఘటనలను గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం వన్నెపూడిలో పర్యటించిన వర్మపై జనసేన దాడి చేసింది. రాళ్ళు, కర్రలతో ఆయన కారు అద్దాలను పగుల కొట్టారు.
తాటిపర్తిలోని అమ్మవారి ఆలయం నిర్వహణ తెలుగుదేశం చేతుల్లోకి వెళ్ళకుండా స్థానిక జనసేన నాయకులు అడ్డుకున్నారు. పిఠాపురంలో జరుగుతున్న వరుస ఘటనలు టిడిపికి అడ్డుకట్ట వేసేలా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జనసేన వ్యవహరిస్తున్న తీరునుఏ వర్మ అనుచరులు సహించలేకపోతున్నారు. చాప క్రింద నీరులా జనసేన..టిడిపి మధ్య విభేధాలు మరోసారి బయట పడుతున్నాయి. కూటమిలో రాజకీయ ఆధిపత్యం కోసం రాజేస్తున్న కుంపట్లను పిఠాపురం ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. టీడీపీ, జనసేన మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ వార్ రానున్న రోజుల్లో ఎక్కడికి దారి తీస్తుందో అనే చర్చ మొదలైంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…