కోటంరెడ్డి, ఆనం ఆరోపణల వెనుక అసలు కారణం అదేనా?

By KTV Telugu On 4 February, 2023
image

ఏపీలో పాలక పక్షాన్ని నెల్లూరు రచ్చ చికాకు పెడుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో బయటకు రావడంతో పాలక పక్షం వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఫోను ట్యాపింగ్ జరగలేదని అంటోన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు మరో పార్టీలోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాకనే వారు ఆరోపణలు చేస్తున్నారని మంత్రులు అంటున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన నెల్లూరు లో పాలక పక్షానికే చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఎక్కుపెట్టిన ఆరోపణాస్త్రాలు చర్చనీయాంశంగా మారాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర రెడ్డి, వెంకట గిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తమ ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు.

వీరిలో వై.ఎస్.ఆర్. కుటుంబానికి విధేయుణ్నని చెప్పుకునే కోటం రెడ్డి వ్యవహారం సంచలనం రేపింది. తన ఫోనును రెండేళ్లుగా ట్యాప్ చేస్తున్నారని అది తనను అవమానించడమే అని కోటం రెడ్డి అంటున్నారు. నాలాగే మీ ఫోన్లు ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలను ప్రశ్నించారు కోటం రెడ్డి. అయితే కోటంరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడానికి అన్ని ఏర్పాట్లూ చేసకున్న తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. డిసెంబరు 25నే కోటం రెడ్డి చంద్రబాబు నాయుణ్ని కలిసి గంటల తరబడి చర్చలు జరిపారని అంతకు ముందు నుంచే నారా లోకేష్ తోనూ టచ్ లో ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టిడిపి తరపున టికెట్ గురించి హామీ వచ్చిన తర్వాతనే ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వం అంటోంది. ఒక వేళ టిడిపిలోకి వెళ్లదలచుకుంటే నేరుగా వెళ్లచ్చని ఇలా బురద జల్లి పోవడం సమంజసం కాదని సీనియర్ మంత్రి పెద్ది రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక ఆనం రామనారాయణ రెడ్డి అయితే మూడేళ్లుగా తన నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ప్రభుత్వం ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వడం లేదని ఆయన దుయ్యబట్టారు. ప్రజలకు సేవ చేయలేనపుడు ఎమ్మెల్యే పదవి ఎందుకోసమని ప్రశ్నించారు. తన ఫోనును కూడా ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించిన ఆనం నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని సవాల్ విసిరారు. ఆనం వ్యాఖ్యలను నెల్లూరు జిల్లాకే చెందిన సీనియర్ నేతలంతా ఖండించారు. మూడేళ్లుగా నియోజక వర్గానికి నిధులు ఇవ్వనిదే నిజం అయితే ఇన్నేళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా అసంతృప్తితో ఉన్నారని కొన్ని ఛానెళ్లలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక ఏం ఉందన్నది అర్ధం కావడం లేదు.

వైసీపీకి చెందిన ఓ సీనియర్ నేత అత్యంత కాన్ఫిడెన్షియల్ గా చెప్పిందాన్ని బట్టి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ టీమ్ ఎమ్మెల్యేల పనితీరుపైనా సర్వేలు చేస్తూ ఉంటుంది. జనంతో మమేకమయ్యే నేతలు ఎవరు గడప గడపకు కార్యక్రమానికి దూరంగా ఉంటున్నదెవరు. ఏయే ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఏ ఎమ్మెల్యేలకు జనంలో ఎక్కువ మార్కులు పడుతున్నాయి వంటి భిన్న అంశాలపై వారు నిరంతరం సర్వేలు చేస్తూ ఉంటారు. ఆ సర్వేల నివేదికల ఆధారంగా పనిచేయని ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వం సూచనలు చేస్తూ ఉంటుంది. మీరు జనంతో మరింతగా మమేకం అవ్వాలనో మీ పనితీరును మెరుగు పర్చుకోవాలనో సూచిస్తూ ఉంటారు. ఇదంతా అల్టిమేట్ గా వై నాట్ 175 అన్న జగన్ మోహన్ రెడ్డి నినాదాన్ని నిజం చేసుకునే క్రమంలోనే నడుస్తోందంటున్నారు పార్టీ నేతలు.

ఈ క్రమంలోనే తమ పనితీరు బాగా లేదని తేలిన నేతలు వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ రావడం కష్టమన్న భావనకు వచ్చిన వారు ఇప్పట్నుంచే ప్రత్యామ్నాయాన్ని అన్వేషించుకునే పనిలో పడి ఉండచ్చన్నది వైసీపీ సీనియర్ నేతల వాదన. కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కూడా బహుశా ఆ కేటగిరీలో ఉండి ఉండచ్చని వారు అనుమానిస్తున్నారు.
కోటంరెడ్డి బాహాటంగా తాను వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేస్తానని పేర్కొనడంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయ కర్తగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర రెడ్డిని నియమించింది పార్టీ హైకమాండ్. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఆదాలను ఆ పదవిలో నియమించినట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఆదాల ప్రభాకర రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి.  ఇక ఆనం రామనారాయణ రెడ్డి కూడా తప్పుకుంటే ఆయన స్థానంలో మరో నేతకు అవకాశం వస్తుంది. నెల్లూరు లో ఏనేత పక్కకు తప్పుకున్నా ఆ స్థానంకోసం చాలా మంది క్యూలు కడతారని పార్టీ సీనియర్ నేత కొడాలి నాని అంటున్నారు.

ఆనం నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ ను నియమించారు. దీంతో ఆనం స్థానంలో రామ్ కుమార్ పోటీ చేయచ్చన్న ప్రచారం మొదలైపోయింది.
రాయలసీమలో మొదట్నుంచీ పార్టీ నాయకత్వంతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ స్వపక్షంలో విపక్ష నేతగా వ్యవహరిస్తోన్న డి.ఎల్. రవీంద్ర రెడ్డి కూడా రేపో మాపో ఇటువంటి ఆరోపణలే చేయచ్చని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇపుడు ఆరోపణలు చేసిన ఇద్దరూ కూడా టిడిపిలో చేరడానికి రంగం సిద్ధమైందని డి.ఎల్. కూడా టిడిపి తో టచ్ లోనే ఉన్నారని వారంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వారు వాడుకున్న అస్త్రమని ఇపుడు చంద్రబాబుతో చర్చించిన తర్వాత కోటం రెడ్డి, ఆనం అవే ఆరోపణలు చేయడం గమనార్హమని వారంటున్నారు. నెల్లూరు జిల్లాలో టిడిపికి అమ్ముడు పోయే నేతలు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది.