ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం వచ్చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాసేవలో తన కార్యాచరణను ప్రారంభించారు. ప్రమాణ స్వీకారంలో మాత్రం కొన్ని సన్నివేశాలు హైలైట్ గానే నిలిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార వేదికపై మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతులు పట్టుకుని పైకెత్తడం సీన్ ఆఫ్ ది డే అని చెప్పుకోవాలి. మోదీ అలా ఎందుకు చేశారనేది పెద్ద ప్రశ్న. ఏపీలో బీజేపీ వేసిన వ్యూహాత్మక ముందడుగు అంటూ కూడా ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతోంది…
ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. ఎక్కడ ఎలా అడుగులు వేస్తే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందో ముందే ఊహించగల ధీరుడు. అనునిత్యం పార్టీ ప్రయోజనం కోసమే ఆలోచించే తత్వం ఆయనది. అందులో కొంత పర్సనల్ పబ్లిసిటీ కూడా చూసుకుంటారు. ఏ పని చేసినా సొంత ఇమేజ్ కొంత పెంచుకుని ఆయన ముందుకు సాగుతారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుుడు ప్రమాణ స్వీకారానికి మోదీ రావడమే కాకుండా ప్రధాన ఆకర్షణగా కూడా నిలిచారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ వచ్చి మోదీని పలుకరిస్తూ మా అన్నయ్య అక్కడ ఉన్నాడని చూపించారు. అంతే పవన్ కల్యాణ్ చేయి పట్టుకుని లాక్కు వెళ్లిన మోదీ.. అక్కడ చిరంజీవితో ఒక నిమిషం మాట్లాడి మీ తమ్ముడు గట్టి వాడు అని అంటూనే… ఇద్దరి చేతులు పైకి ఎత్తి జనానికి అభివాదం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఏపీలో బీజేపీ గేమ్ కు మోదీ చర్యలకు ఒక లింకు ఉందని చెప్పుకోవాలి. రాష్ట్రంలో కమలం పార్టీ అన్ని రూట్లు రెడీ చేసుకుంటోందని అర్థం చేసుకోవాలి. సామాజిక వర్గాల లెక్కలు కూడా ఇందులో కలిసి ఉన్నాయని తెలుసుకోవాలి. పైగా వారిద్దరూ సెలబ్రిటీలు కదా…
రాజకీయాల్లో రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం బీజేపీకి టీడీపీతో పొత్తు ఉంది. భవిష్యత్తులో కమలం పార్టీ సొంతంగా రంగంలోకి దిగి, చిన్న పార్టీలను కలుపుకుపోవాలని భావించే అవకాశం ఉంది. కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఏపీలో సామాజిక సమీకరణాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది.ఎంత లేదన్న కమ్మ కులం టీడీపీ వైపే ఉంటుంది. రెడ్డి కులం స్థూలంగా వైసీపీ లేదా కాంగ్రెస్ వైపు నిలబడుతుంది. మిగిలిన బలమైన కులాలను మాత్రమే బీజేపీ తన వైపుకు తిప్పుకునే వీలుంది. పైగా ఎప్పుడూ ఒకర్నే నమ్ముకుంటే పని జరగదని కూడా మోదీకి తెలుసు.ఇప్పటికే భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక అంగబలం, అర్థబలం ఉన్న కాపు సామాజికవర్గాన్ని దువ్వ గలిగితే ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని మోదీ, అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. పైగా అన్నదమ్ములిద్దరూ సినీ సెలబ్రిటీలుగా సగటు ఓటరుపై బలమైన ప్రభావాన్ని చూపించగలరని కూడా బీజేపీకి తెలుసు. అందుకే చిరంజీవిని అక్కున చేర్చుకునేందుకు మోదీ ప్రయత్నించారనుకోవాలి…
చంద్రబాబుకు కూడా మోదీ ఒక సంకేతం ఇచ్చారు. మీరు వద్దంటే ఫుల్ టైమ్ పవన్ ఫ్యామిలీతో సెటిలైపోతామని ఆయన పరోక్షంగా చెప్పినట్లయ్యింది. ఎందుకంటే అవసరం కోసం ఆయన చంద్రబాబుతో కలిశారే తప్ప… రెండు పార్టీలు అంత కంఫర్టబుల్ కాదని పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…