నేతల మాటలు నీటిమూటలు
పోలవరం పూర్తయ్యేదెప్పుడు
ఐదుకోట్ల ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీలో మళ్లీ కొట్లాట మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రణం నడుస్తోంది. మొన్న పోలవరం సందర్శనకు వెళ్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం నిరసనగా ఆయన అక్కడే బైఠాయించడం లాంటి పరిణామాలతో హైడ్రామా చోటుచేసుకుంది. పోలవరంను తన బిడ్డగా అభివర్ణించుకున్న చంద్రబాబు కమీషన్లకు కక్కుర్తిపడి వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు బాబు. పోలవరం తన ప్రాణమని దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెబుతున్నారు. దాంతో వైసీపీ నుంచి కౌంటర్ మొదలైంది. పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు బంగారు బాతుగా వాడుకొని రాజకీయ రాద్దాంతం చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారు. అనుమతి లేకుండా బాబు పోలవరం వెళ్లినందువల్లే పోలీసులు అడ్డుకున్నారని చెబుతున్నారు. పోలవరం పేరుతో బాబు డ్రామా చేస్తున్నారని రాత్రి వేళ పోలవరానికి వెళ్లాల్సిన అవసరమేముందని ప్రశ్నిస్తున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి పుట్టిన బిడ్డ అని ఎవరికో పుట్టిన బిడ్డను నీకు పుట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గు లేదా అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు కొందరు.
టీడీపీ, వైసీపీ వర్షన్ అలా ఉంటే బీజేపీ వర్షన్ మరోలా ఉంది. వైసీపీ ప్రభుత్వం చేతకానితనం వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని బీజేపీ ఆరోపిస్తోంది. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. పోలవరం వద్ద బాహుబలిలా ప్రతాపం చూపించడం తప్పితే ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని కమలనాథులు సెటైర్లు వేస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అంటున్నారు. అది నిజం కాదనుకుంటే జగన్ ప్రభుత్వం తనతో చర్చకు రావాలంటూ ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ సవాల్ విసురుతున్నారు. ఇక అదే సమయంలో చంద్రబాబును బీజేపీ టార్గెట్ చేస్తోంది. పోలవరాన్ని నిర్మిస్తామని కేంద్రం చెబితే చంద్రబాబు తామే నిర్మించుకుంటామన్నారని గుర్తుచేస్తున్నారు. పోలవరం జాప్యానికి బాబే కారణమని ప్రాజెక్ట్ పేరుచెప్పి టీడీపీ నేతలు కమీషన్లు దండుకున్నారని ఆరోపిస్తున్నారు కమలనాథులు. మళ్లీ వస్తే పోలవరం పూర్తిచేస్తానంటున్న బాబు తాను అధికారంలో ఉన్న 14ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.
2018నాటికి పోలవరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని గత చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. కానీ అది జరగలేదు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా 2022నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పింది. ఇప్పుడు కూడా అది అనుకున్న సమయానికి నెరవేరింది లేదు. బాబు గతంలో చేసిన తప్పిదాల కారణంగానే ప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యం జరుగుతోందనే ఆరోపణలకే పరిమితమవుతోంది జగన్ సర్కార్. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మించి బాబు చారిత్రక తప్పిదం చేశారని అంటున్నారు. ఇక బాబు తన హయాంలో 70శాతం ప్రాజెక్ట్ పూర్తయ్యిందని జగన్ తన శ్రమను నాశనం చేశారని గొంతు చించుకుంటున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని చెబుతూనే మెరుగైన ప్యాకేజీతోపాటు పోలవరం ప్రభావిత మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామంటున్నారు. కానీ అక్కడ నిలువనీడ కోల్పోయిన నిర్వాసితుల కష్టాలు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. పోలవరం విషయంలో ఒకరిపై మరొకరు విమర్శలకే పరిమతమవుతున్నారు తప్పితే అసలు పోలవరం పూర్తయ్యేదెప్పుడు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
వాస్తవానికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను చట్టం ప్రకారం కేంద్రమే అందించాలి. అయితే నిర్మాణ బాధ్యతలను వేగంగా పూర్తి చేస్తామని చెప్పి 2016లో చంద్రబాబు సర్కార్ దీన్ని నెత్తినపెట్టుకుంది. అప్పటినుంచి సమస్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా డబ్బులు ఆదా చేసి పనులు త్వరగా అయ్యే ఏర్పాట్లు చేశారు. అటు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించేలా చేశారు. కానీ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో చిక్కుకున్న తమకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందిస్తే ఊళ్లు ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. పునరావాస కాలనీలు పూర్తి చేయాలని అడుగుతున్నారు. దానికి కేంద్రమే నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టుకు వరదలు పెద్ద సమస్యగా మారాయి. భారీ వరదల కారణంగా డయాఫ్రం వాల్ కూడా కొట్టుకుపోయింది. ఇప్పుడు దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. పాత డయాఫ్రం వాల్ పనికొస్తుందని నిపుణులు చెబితే ఓకే లేకపోతే మళ్లీ దాన్ని నిర్మించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరిగేదెప్పుడు, పోలవరం పూర్తయ్యేదెప్పుడనే సందేహం కలుగుతోంది.