ఏలూరులో హైవోల్టేజ్ పోరు – ఫ్యాన్‌కు కరెంట్ పోతుందా ?

By KTV Telugu On 10 January, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ లో ని వీఐపీ నియోజకవర్గాల్లో ఒకటి ఏలూరు.  ఎప్పుడూ హోరాహోరీ పోరు జరిగే ఈ నియోజకవర్గంలో గెలుపోటముల మధ్య తేడా స్వల్పంగా ఉంటుంది.  గత ఎన్నికల్లో మాజీ మంత్రి ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని నాలుగు వేల ఓట్ల తేడాతోనే గెలిచారు. కానీ జనసేన పార్టీకి ఇరవై వేల ఓట్ల వరకూ వచ్చాయి.  ఇప్పుడు టీడీపీ, జనసేన మధ్య  పొత్తు ఉండటం కాపు వర్గం ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉండటంతో  హైవోల్టేజ్ పోరులో ఫ్యాన్‌కు కరెంట్ కట్ అవుతుందేమో అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది.

ఏలూరు రాజకీయం ఎప్పుడూ  హాట్ హాట్ గానే ఉంటుంది. ఈ నియోజకవర్గం ఏ పార్టీకి కంచుకోట కాదు.  తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కాస్త పట్టు దొరికింది కానీ.. గత నాలుగు ఎన్నికల్లో ఒక్క సారే గెలిచింది. మూడు సార్లలో రెండు సార్లు కాంగ్రెస్ ఓ సారి వైసీపీ గెలిచింది. ఈ మూడు సార్లు గెలిచింది ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ ఆళ్ల నానినే. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆళ్ల నాని.. స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. గత రెండు దశాబ్దాలుగా ఏలూరులో ఆళ్ల నాని, బడేటి బుజ్జి మధ్యే రాజకీయం నడుస్తోంది. కానీ బడేటి బుజ్జి గత ఎన్నికల ఓటమి తర్వాత హఠాత్తుగా చనిపోవడంతో ఆయన సోదరుడు బడేటి చంటి బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు టీడీపీని ఆయనే నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఏలూరు నియోజకవర్గం పరిధిలో మొత్తం రెడున్నర లక్షల మంది  ఓటర్లు ఉన్నారు. వీరిలో కాపు, తూర్పు కాపు, వైశ్య సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. ఎవరు.. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా.. ఎక్కువగా కాపు సామాజికవర్గం నేతలే.. ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా ఉంటారని భావిస్తున్న ఆళ్ల నాని, బడేటి చంటి కూడా కాపు వర్గం అభ్యర్థులే. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అంబికా కృష్ణ వైశ్య వర్గానికి చెందిన వారు.  ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు. పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ పోటీ మాత్రం కాపు నేతల మధ్య సాగనుంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని మూడేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనకు టిక్కెట్ ఉందా లేదా అన్నది హైకమాండ్ తేల్చి చెప్పడం లేదు.  ఆళ్ల నాని నింపాదైన రాజకీయ నాయకుడు. ఇతరుల్ని అసభ్యంగా దూషించరు.  ఇది వైసీపీ హైకమాండ్ పాలసీకి విరుద్ధం. అందుకే ఆయనపై అంత సాఫ్ట్ కార్నర్ సీఎం జగన్ పెట్టుకోవడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా ఇతర నేతల్ని ప్రోత్సహించారు.  ఆళ్ల నాని అభీష్టానికి వ్యతిరేకంగా ఏలూరు మేయర్ పదవికి నూర్జహాన్ అనే నేతకు ఇచ్చారు. ఇప్పుడు ఆమె.. ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు..  ఏలూరు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు.  ఏలూరులో ఆళ్ల నాని వర్సెస్ పెదబాబు అన్నట్లుగా వర్గ పోరు నడుస్తోంది.   ఎమ్మెల్యే నానిని ఏలూరు పార్లమెంట్ బరిలో దించే ఆలోచనలో అధిష్టానం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అయితే.. ఆళ్ల నాని మాత్రం.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు

అధికార పార్టీలో ఉన్న వర్గపోరును.. టీడీపీ క్యాష్ చేసుకుంటోంది. అవినీతి ఆరోపణల్ని జనంలోకి తీసుకెళుతోంది. అన్న మరణంతో పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్న బడేటి చంటి  విస్తృతంగా పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి కూడా ఆళ్ల నాని.. ఏలూరులో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు.  టీడీపీతో పొత్తు కుదిరితే.. జనసేన అభ్యర్థే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ టీడీపీ తరపున టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్న బడేటి చంటి  పవన్ కల్యాణ్ బంధువులే. ఈ కారణంగా జనసేన ఒత్తిడి చేయకపోవచ్చన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

ఇక.. బీజేపీ నేతలు కూడా తాము కూడా పోటీలో ఉంటామంటున్నారు. నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.  పోటీ చేస్తే.. అంబికా కృష్ణ పోటీ చేయాలి. ఆయన పోటీ చేస్తే వైశ్య వర్గం ఓట్లు ఆయనకే పడే అవకాశం ఉంది.  అయితే ఇవి  ఫలితాలను మారుస్తాయా లేదా అన్నది చెప్పలేము. ఇప్పటికైతే..   వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత. వైసీపీలో వర్గ పోరు కలిసి  ఆ పార్టీని నిండా ముంచే దిశగా ఉన్నాయని అనుకోవచ్చు.  టీడీపీలో  నాయకత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు లేవు.  ప్రభుత్వం తీరుపై కాపు, వైశ్య వర్గాలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నాయి. మొత్తంగా ఈ సారి ఏలూరు హైవోల్టేజ్ పోరులో ఫ్యాన్‌కు కరెంట్ కట్ కావడానికే ఎక్కువ చాన్స్ ఉందన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో వినిపిస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి