పొత్తు లేని పోటీని ఆయన అస్సలు ఊహించుకోలేడు. ఎవరో ఒకరు తోడు ఉంటేనే ఆయనకు సంతృప్తి. తన పాలనపై తనకు నమ్మకం ఉంటే ప్రజలు దీవిస్తారనే గుండె ధైర్యం ఉంటే ఎవరి అండా దండ అక్కర్లేదు. కానీ అలా ముందడుగు వేసేందుకు ఆ దేశం అధినేత ఎందుకో వెనకాడుతుంటారు. ఓటమి భయమో లేక గెలుపు కోసం ముందు జాగ్రత్తనో ఏదైనా అనుకోండి. కానీ అలయన్స్ ఉంటేనే తాను తృప్తిగా ఫీలవుతాడు. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న ప్రతిసారీ తెలుగుదేశం ఏదో ఒక జాతీయ పార్టీపై ఆధారపడి పోటీ చేస్తుంటుంది. నాటి వాజ్ పేయి ప్రభుత్వం దగ్గర్నుంచి 2014ఎన్నికల నాటి మోడీ వరకు బాబుది మొత్తం పొత్తుల ప్రస్థానమే.
తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న తరువాత చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న తొలి సార్వత్రిక ఎన్నికలు 1999. అప్పట్లో కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. వాజ్‌పేయి ఛరిష్మా కార్గిల్ యుద్ధం వంటి అంశాలు కలిసి రావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీచింది. దీన్ని గ్రహించిన చంద్రబాబు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికల్లో గెలిచారు. 2004 ఎన్నికలకు వచ్చే సరికి చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. గోద్రా ఉదంతం అనంతరం గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్లతో బీజేపీ పనైపోయిందని గుర్తించారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ఆయన రాష్ట్రానికి వస్తే అరెస్టు చేస్తానని హూంకరించారు. కమలనాథులతో తెగదెంపులు చేసుకొని 2004లో వామపక్షాలతో జతకట్టి పోటీకి దిగారు. దారుణంగా ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 47 స్థానాలకే పరిమితం అయ్యారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్-టీఆర్ఎస్ కూటమిని ఎదుర్కొన లేక చతికిలపడ్దారు.
2009లో మరోసారి కూటమి కట్టారు చంద్రబాబు. 2004లో వైఎస్ టీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకుంటే అదే టీఆర్ఎస్‌తో 2009లో బాబు పొత్తు కుదుర్చుకున్నారు. సీపీఐ, సీపీఎంలను కూడా కలుపుకెళ్లి మహాకూటమిగా అవతరించారు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కూడా తమ కూటమిలో చేర్చుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. మహాకూటమి ప్రజారాజ్యంలను ఒంటరిగా ఎదుర్కొన్న వైఎస్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనవిధంగా కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రాగలిగారు. ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు. మరోసారి కూటమిగా వెళ్లినా బాబు వైఎస్ చరిష్మాను తట్టుకొని నిలబడలేకపోయారు. ఇక 2014లో మరోసారి కమలంవైపు చూశారు. అప్పటికే టీడీపీతో పాటు బీజేపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉంది. అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడం పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం బాబుకు కలిసొచ్చింది. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవడం తనతోనే సాధ్యమవుతుందనే భావనతో 2014లో బీజేపీతో జత కట్టిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకొని ముందుకెళ్లారు. అధికారంలోకి వచ్చారు.
2014 ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న బాబు మధ్యలోనే ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు. అప్పటివరకు తనతో పాటు సాగిన పవన్ కూడా దూరమయ్యారు. దాంతో 2019 వచ్చే సరికి పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశానికి ఎవరూ దొరకలేదు. పవన్, వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లారు. బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. బాబు ఏపీలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని భావించారు. అయితే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ- కాంగ్రెస్ కూటమి విఫలం కావడంతో ఏపీలో హస్తం పార్టీని కలుపుకొని వెళ్లడానికి బాబు సాహసించలేదు. తప్పని పరిస్థితుల్లో చరిత్రలో తొలిసారి 2019లో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనంత పరాభవాన్ని మూటగట్టుకుంది. జగన్ ప్రభంజనంలో టీడీపీ కొట్టుకుపోయింది. మొత్తం 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లే గెలుచుకుంది. భవిష్యత్తులో మరోసారి ఒంటరిగా పోటీ చేయాలంటే కలలో కూడా భయపడిపోయేంత ఓటమిని ఎదుర్కొన్నారు చంద్రబాబు.
చంద్రబాబు విజన్ ఉన్న నేతగా అభివర్ణించబడుతారు. అందుకే కాబోలు భవిష్యత్తును ముందే ఊహించి పొత్తు లేని పోటీకి వెనకాడుతుంటారేమో. ఈసారి మాత్రం గత ఎన్నికల్లో చేసిన తప్పు చేయనంటున్నారు బాబు. ప్రస్తుతం బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కోవాలంటే 2024 ఎన్నికల్లో ఇతర పార్టీలతో బాబుకు పొత్తు తప్పనిసరిగా మారింది. అందుకే 2014 ఎన్నికల నాటి సీన్ రిపీట్ చేయాలని తాపత్రయపడుతున్నారు. పదే పదే పొత్తులపై సంకేతాలు ఇస్తున్నారు. మళ్లీ బీజేపీ, జనసేనతో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. అయితే బీజేపీ టీడీపీతో పొత్తు ఉండదని తేల్చిచెబుతుండగా తమ పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్ మాత్రం సైకిల్‌తో వెళ్లేందుకే ఇష్టపడుతునన్నారు. మొత్తంగా వచ్చే ఎన్నికలు టీడీపీకి చావోరేవోగా మారిన పరిస్థితుల్లో బాబు జనసేనతో పొత్తు ఫిక్స్ చేసుకునే పనిలో ఉన్నారు. మరి బీజేపీ కూడా కలిసొస్తుందా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది.