పవన్ కళ్యాణ్ పవర్ పంచ్

By KTV Telugu On 25 September, 2023
image

KTV TELUGU :-

నలభై ఏళ్ల  వయసున్న రాజకీయ పార్టీని కూడా  ఇబ్బందులు పెడుతున్నారంటే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంత దుర్మార్గంగా  పాలన చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చునంటున్నారు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ  అధికారం చేతుల్లో ఉంది కదా అని వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలన చేస్తానంటూ తాము చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనవంటి జనాదరణ ఉన్న నేతనే ఆంధ్ర ప్రదేశ్ లో అడుగు పెట్టనీయకుండా పోలీసులతో అడ్డుకున్న నిరంకుశ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు త్వరలోనే వస్తాయన్నారు.

చంద్రబాబు నాయుణ్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ లో కలిసిన అనంతరం జైలు నుండి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్  తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు జైల్లో చంద్రబాబు నాయుణ్ని పరామర్శించిన^పవన్ కళ్యాణ్.. సుదీర్ఘ రాజీకయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడి వంటి మహానాయకుడికి ఈ దుస్థితి ఏంటని  మనస్తాపం చెందారు. చంద్రబాబు నాయుడి ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్  మీకు న్యాయం జరిగే వరకు నేను మీకు మద్దతుగా ఉంటూ నియంతపాలకులకు వ్యతిరేకంగా పోరాడతానని మాట ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత భావోద్వేగంగా ప్రసంగించిన  పవన్ కళ్యాణ్  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఇంటికి పంపాలంటే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావల్సిందే అన్నారు.

టిడిపితో జనసేన పొత్తు ఉంటుందని   ప్రకటించిన తర్వాత మొట్ట మొదటి సారిగా పవన్ కళ్యాణ్  పార్టీ లోని కీలక నేతలందరినీ పిలిచి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.  తెలుగుదేశం పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో.. టిడిపి-జనసేనల పొత్తు ఎందుకు అవసరమో పార్టీ శ్రేణులకు  వివరించి చెప్పారు పవన్ కళ్యాణ్. విపక్షాలు విడి విడిగానే పోటీ చేస్తే మరో 20 ఏళ్ల పాటు ఏపీలో వైసీపీ దుర్మార్గ పాలన కొనసాగుతూనే ఉంటుందని ఆయన హెచ్చరించారు. అభివృద్ది కోసం తపన పడే చంద్రబాబు నాయుడి వంటి సీనియర్ నేతనే  జగన్ ప్రభుత్వం జైలుకు పంపిందంటే  ఎంత అరాచక పాలన సాగుతోందో అర్ధం చేసుకోవాలని పార్టీ  శ్రేణులకు చెప్పారు. అన్యాయం జరుగుతూ ఉంటే తాను చూస్తూ ఊరుకోలేనన్నారు

ప్రతిపక్ష నేతలపై ఎన్ని కేసులు పెడతారు? అని వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు పవన్. మీరు కేసులు పెడితే భయపడిపోతామా? అని ప్రశ్నించారు. వైసీపీ రాక్షస పాలనను ఎదుర్కోవాలంటే రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. ధర్మాన్ని పాటించి ప్రేమగా  ప్రజలను చూసే వారే మంచి పాలన అందిస్తారన్నారు పవన్. సనాతన ధర్మం కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుందని అన్నారు. సంక్షేమ పథకాలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే మొదలు కాలేదన్నారు. దశాబ్ధాలుగా చాలా ప్రభుత్వాలు మంచి మంచి పథకాలను అమలు చేస్తూనే వచ్చాయని పవన్ అన్నారు. విస్తృత స్థాయి సమావేశం ద్వారా పార్టీ శ్రేణులకు టిడిపి-జనసేనల మధ్య పొత్తు  చారిత్రక అవసరమని చాటి చెప్పారు.

టిడిపితో పొత్తు ఖాయమని పవన్ కళ్యాణ్  ప్రకటించిన తర్వాత  అన్ని జిల్లాల్లోనూ టిడిపి-జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. రెండు పార్టీలూ కలిసికట్టుగా   ముందుకు సాగితే  వచ్చే ఎన్నికల్లో   వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవని  రెండు పార్టీల నేతలు నమ్ముతున్నారు. టిడిపి-జనసేన  కూటమి  ఏపీని క్లీన్ స్వీప్ చేయడాన్ని ఏ శక్తీ ఆపలేదని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కొత్త పల్లి సుబ్బారాయుడు సైతం టిడిపి జనసేనల పొత్తును స్వాగతించారు. రెండు పార్టీలూ కలిస్తే  జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడం ఖాయమని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న  నేపథ్యంలో టిడిపిలో కొంత స్తబ్ధు వాతావరణం  అనివార్యమైన తరుణంలో  జనసేన జనంతో మమేకం అవుతూ కార్యక్రమాలు  వేగవంతం చేయాలని జనసేన నాయకత్వం భావిస్తోంది. చంద్రబాబు నాయుడికి జరిగిన అన్యాయాన్ని  ఎండగడుతూ  ప్రభుత్వ తీరును  తూర్పారబడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని  నేతలు నిశ్చయానికి వచ్చారు. త్వరలో వారాహి యాత్రను  తిరిగి ప్రారంభించనున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి