బాలినేని బాటలో ఉమ్మడి ప్రకాశం ఎమ్మెల్యే….

By KTV Telugu On 14 October, 2024
image

KTV TELUGU :-

పదవి ఉన్నా లేకపోయినా నేతలు వైసీపీలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. ప్రస్తుతానికి ఆ పార్టీకి పదకొండు మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ.. వారిలో జగన్ తప్పితే ఎంతమంది మిగులుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఐదేళ్ల పాటు చేతులు ముడుచుకుని కూర్చునే కంటే.. ఫిరాయిస్తే కాస్తైనా ప్రయోజనం ఉంటుందని నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ ట్రెండ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రకాశం జిల్లాలో వైసీపీ స్ట్రాంగ్ మేన్ అయిన బాలినేని శ్రీనివాస రెడ్డి వెళ్లిపోయారు. దాదాపు మూడేళ్ల పాటు వైసీపీలో అసంతృప్తి నేతగా కొనసాగి.. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడు జగన్ ను దూరం పెట్టేసి, జై పవన్ అంటున్నారు. ఇప్పటికే వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఇటీవల వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటూ ఎమ్మెల్సీ పదవి కి రాజీనామా చేశారు. పోతుల సునీత టీడీపీలో చేరేందుకు ఆపార్టీ నేతలతో ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్లు సమాచారం..

వారిద్దరే కాకుండా చాలా మంది పార్టీ మారేందుక రెడీ అవుతున్నారు. వైసీపీ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కూడా పార్టీ మారతారని ప్రచారం మొదలైంది. దీంతో తాటిపర్తి చంద్రశేఖర్ పై తాడేపల్లి పెద్దలు నిఘా పెట్టారని ఫ్యాన్ పార్టీలో టాక్ వినిపిస్తుంది. వ్యాపార వేత్త అయిన తాటిపర్తి చంద్రశేఖర్ 24 ఎన్నికల సమయంలో కొండపి వైసీపీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఎర్రగొండపాలెం నుండి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ని కొండపి కి బదిలీ చేశారు. కొండపి టిక్కెట్ ఆశించిన తాటిపర్తి చంద్రశేఖర్ కి ఎర్రగొండపాలెం టిక్కెట్ ఇచ్చారు. ఎన్నికల్లో స్వల్ప ఓట్ల మెజారిటీతో తాటిపర్తి చంద్రశేఖర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల వైసీపీ కి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తాటిపర్తి చంద్రశేఖర్ అనుచరుడిగా పేరుంది. బాలినేని చలువతోనే తాటిపర్తి చంద్రశేఖర్ కి ఎర్రగొండపాలెం టిక్కెట్ దక్కింది. ఎర్రగొండపాలెంలో గెలిచినా అధికారాన్ని అనుభవించలేక పోతున్నానని తాటిపర్తి చంద్రశేఖర్ ఫీలైపోతున్నారు. వైసీపీ కి అధికారం దక్కకపోవడంతో ఎర్రగొండపాలెంలో కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా ప్రయోజనం లేకుండా పోయిందని చంద్రశేఖర్ నిరుత్సాహంలో ఉన్నారు. ఈనేపథ్యంలో తాటిపర్తి చంద్రశేఖర్ తో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతుంది. జనసేనలో చేరితో ఎర్రగొండపాలెంలో అధికారం చేతుల్లోకి వస్తుందని చంద్రశేఖర్ కి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

నేతలు ఒక్కరొక్కరుగా జారిపోతుంటే వైసీపీ అధిష్టానం తలపట్టుకు కూర్చుంది. ఒకప్పుడు తమకు కంచుకోటగా ఉన్న జిల్లాలో ఇలా నేతలు వెళ్లిపోవడమేంటని ప్రశ్నించుకుంటోంది. రెబెల్ స్టార్ బాలినేని పోతే పోయాడు.. మిగతావారు ఉంటారని ఎదురుచూసిన తాడేపల్లి ప్యాలెస్ కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు. తాటిపర్తి చంద్రశేఖర్ ను ఎలాగోలా ఆపాలని పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.పార్టీలో ఆయనకు ఎలాంటి పదవి కావాలన్నా ఇచ్చేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. చంద్రశేఖర్ తో మాట్లాడి ఆయన్ను చల్లబరిచేందుకు ఒక కీలక నేతకు బాధ్యతలు అప్పగించినట్లుగా చెబుతున్నారు. కాకపోతే ఇప్పుడు అధికారం కోసం వెళ్లిపోతున్న చంద్రశేఖర్ ఆగుతారని ఎదురు చూడటం కూడా పొరబాటే అవుతుంది. నిజానికి వైసీపీ భయపడటానికి మరో కారణం కూడా ఉంది. నేతలు వెళ్లిపోతే కేడర్ వీక్ అయిపోయి… వాళ్లు కూడా పక్క చూపులు చూస్తారు. మరి ఇప్పుడు చేయగలిగిందేముంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి