పులివెందుల నియోజవకర్గంలో వైఎస్ ఫ్యామిలీ తప్ప మరొకరు గెలుస్తారని ఎవరూ ఊహించలేరు. కానీ ఆ ఫ్యామిలీ తరపున ఎవరు నిలబడినా వారి పై పోరాటానికి మాత్రం సీరియస్ గా ప్రత్యర్థులు ప్రయత్నిస్తూనే ఉంటారు. గత ఎన్నికల వరకూ టీడీపీ తరపున సతీష్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు బీటెక్ రవి తెర ముందుకు వచ్చారు. అదే సమయంలో జగన్ ఫ్యామిలీలో చీలిక వచ్చింది. షర్మిల కూడా పులివెందుల నుంచి పోటీ చేయవచ్చని చెబుతున్నారు అందుకే ఈ సారి ఫ లితం మరీ అంత ఏకపక్షంగా ఉండదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది ?
పులివెందుల ఈ పేరు వినగానే వై.ఎస్. రాజశేఖరరెడ్డి కుటుంబం గుర్తుకువస్తుంది. వైఎస్‌ఆర్ మరణానికి ముందు వరకు కాంగ్రెస్.. ఆ తర్వాత వైసీపీ జెండా తప్ప మరో జెండా ఎగరలేదు. 1955 నుంచి 2010 వరకు ఇక్కడ కాంగ్రెస్ ఏకంగా 13 సార్లు విజయం సాధించింది. ఒక్క ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు అంటే ఇక్కడి నేతలు ఎంత పవర్‌ఫులో అర్థం చేసుకోవచ్చు. వైఎస్‌ఆర్ ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978 నుంచి ఈరోజు వరకు ఈ నియోజవర్గానికి మకుటం లేని మహారాజుగా కొనసాగుతోంది వైఎస్‌ఆర్ ఫ్యామిలీ. కానీ ఇప్పుడా ఫ్యామిలీలో చీలిక వచ్చింది. వైఎస్ షర్మిల అనూహ్యాంగా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. అన్నతో పోరుకు సై అంటున్నారు. ఆమెకు తోడుగా నేను సైతం అంటున్నారు మరో చెల్లెలు సునీత.
2019 ఎన్నికల్లో పులివెందులలో వార్ వన్‌సైడే అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. ఏకంగా 73 శాతం ఓట్లు సాధించి సంచలన విజయం సాధించారు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయనకు టీడీపీ నుంచి బరిలోకి దిగిన వెంకట సతీష్ కుమార్ రెడ్డికి కేవలం 23 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక ఇతరులకు 4 శాతం ఓట్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితుల్ని బట్టి వైఎస్ జగన్, బీటెక్ రవి, షర్మిల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సారి మారిన పరిస్థితి వైఎస్ కుటుంబం చీలిపోవడం. వైఎస్ కుటుంబ పాలనను వ్యతిరేకించే వారు.. టీడీపీ మద్ధతు దారులు బీటెక్ రవిని బలపరుస్తున్నారు. ఆయనను టీడీపీ అధినేత చాలా కాలం ముందే పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి వర్గం కూడా బీటెక్ రవికి మద్ధతిస్తున్నారు. నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదని భావిస్తున్న వారు కూడా టీడీపీకి మద్ధతిచ్చే అవకాశం ఉంది.
ఇక వైఎస్ కుటుంబంలో చీలిక కీలకంగా మారింది. వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యామిలీపై అంతా వ్యతిరేకంగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గం మొత్తం చూసుకునేది అవినాష్ రెడ్డి ఫ్యామిలీనే. వారి తరపు వారికే ప్రాధాన్యం ఇస్తూండంతో మెజార్టీ వ్యతిరేకమయ్యారు. పులివెందులలో ఉన్న ముఖ్య నేతలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని భావిస్తున్న వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీన్ని గమనించి ఇటీవలి కాలంలో క్యాడర్ కు నేరుగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి., ఎంపీటీసీలకు కూడా పది లక్షల వరకూ ఇస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వచ్చే కార్యకర్తలకు యాభై వేలకు తగ్గకుండా ఇస్తున్నారు.
పులివెందులలో గతంలో ఉన్నంత ఏకపక్ష పరిస్థితి లేదని తాజా పరిణామాలను బట్టి రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. వైఎస్ చనిపోయినప్పుడు వచ్చిన సింపతీ పరిస్థితులకు ఇప్పటికీ పూర్తి స్థాయి తేడా వచ్చిందని ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. గతంలో ఇతర పార్టీలు కార్యకలాపాలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఉండేవి. కానీ ఇప్పుడు పూలంగళ్ల సెంటర్‌లోనే టీడీపీ, కాంగ్రెస్ బలప్రదర్శనలు చేస్తున్నాయి. వైఎస్ కుటుంబంలోనే చీలిక .. షర్మిల లేదా సునీత పోటీ మొత్తంగా… వైసీపీ ఓటు బ్యాంక్ ను నిలువునా చీల్చనుంది. ఈ ప రిస్థితుల్లో టీడీపీ లాభపడే అవకాశం ఉంది. అయితే అది ఫలితాన్ని తారుమారు చేస్తుందా లేదా అన్నది మాత్రం అంచనా వేయడం కష్టం. అదే జరిగితే వైసీపీ ఉనికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే సీఎం జగన్ అంత తేలికగా తీసుకోరు. కానీ గట్టిపోటీ ఎదుర్కొన్నా ఆయనకు ఓటమి లాంటిదే అనుకోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…