పాపం పురంధేశ్వరి

By KTV Telugu On 9 February, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏం జరుగుతోంది. టీడీపీతో పొత్తు ఖరారవుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది. రాష్ట్ర శాఖ ఉన్నట్లా లేనట్టా. పొత్తు చర్చలు ప్రారంభించే ముందు రాష్ట్ర శాఖను సంప్రదించారా లేదా.. పురంధేశ్వరికి సమాచారమైనా అందించారా.. ఇప్పుడామె ఏం చేయబోతున్నారు. ఏం చేయాలి….

అమిత్ షా పిలిచారు. చంద్రబాబు వెళ్లారు. కాసేపు మాట్లాడుకున్నారు. పొత్తుపై చర్చ వచ్చిందే అనుకోవాలి.  లేకపోతే పిలిపించి ప్రయోజనం ఏముంటుంది. పూర్తి వివరాలు  రావడానికి ఒకటి రెండు రోజులు పట్టొచ్చు. మరో సారి సమావేశం కావాల్సిన అనివార్యతా ఉండొచ్చు. ఇదీ టీడీపీకి, బీజేపీ అధిష్టానానికి మధ్య జరుగుతున్న డైరెక్ట్ టాక్స్. ఇందులో బీజేపీ రాష్ట్ర శాఖకు ఎలాంటి ప్రమేయమూ లేదు. పూచికపుల్ల, తమలపాకు అనాల్సిన పనిలేదు కానీ… రాష్ట్ర శాఖను సంప్రదించిన దాఖలాలు మాత్రం లేవు. టీడీపీ ప్రాంతీయ పార్టీ.  ఏ పనిచేసినా అధ్యక్షుడే చేస్తాడు. చేయాలి. బీజేపీ అలా కాదు.. అది జాతీయ  పార్టీ. రాష్ట్రాల్లో పరిస్థితులను అంచనా వేయాలంటే రాష్ట్ర శాఖలను సంప్రదించాల్సి ఉంటుంది. రాష్ట్ర శాఖలకు ఇంచార్జీలుగా ఉండే ప్రధాన కార్యదర్శుల ద్వారా రాష్ట్రాల్లో పార్టీల అధ్యక్షులను కలుపుకుపోయి మాట్లాడుకోవాలి. ఏపీ విషయంలో అలా జరగలేదు. అధిష్టానం డైరెక్టుగా రంగంలోకి దిగింది. దానితో ఇప్పుడు  పురంధేశ్వరి పరిస్థితి దిక్కుతోచకుండా అయిపోయింది..

ఇంతకాలం  పురంధేశ్వరి హుందాగానే వ్యవహరించారు. పొత్తుల విషయంలో అధిష్టానానిదే తుది నిర్ణయమని చెబుతూ వచ్చారు. అన్నంత మాత్రాన ఆమెను సంప్రదించకూడదని కాదు కదా.. ఆమె ఆలోచనలు, కార్యకర్తల మనోభావాలను ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదన్న టాక్ అప్పుడే మొదలైంది. అదే ఇప్పుడు పార్టీకి ఇబ్బందిగా మారిన పక్షంలో ఏం జరుగుతుందన్నదే పబ్లిక్ టాక్…

అనూహ్య  పరిణామాల మధ్య పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలయ్యారు. అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు పట్ల వ్యతిరేకత పెరిగిపోవడంతో ఆయన్ను సాగనంపాల్సిన పరిస్థితుల్లో కొత్త నేత కోసం అన్వేషణ మొదలు పెట్టినప్పుడు చాలా పేర్లే వినిపించాయి. వారందరినీ కాదని అధిష్టానం పురంధేశ్వరి వైపు మొగ్గుచూపింది. ఆమె మొదటి నుంచి బీజేపీలో ఉన్న నాయకురాలు కాదు.  కాంగ్రెస్ లో చేరి యూపీఏలో మంత్రిగా చేశారు. 2014లో బీజేపీలో చేరారు. ఎంపీగా ఓడిపోయారు. ఐనా బీజేపీలో క్రియాశీలంగానే పనిచేశారు. పార్టీ పట్ల అంకితభావంతో ఉన్నారు. అందుకే ఆమెకు రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి లభించిందనుకోవాలి. వచ్చినప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. పొత్తుల విషయంలో ఆమెకు కొన్ని అభిప్రాయాలు కూడా ఉండొచ్చు. చంద్రబాబుతో కుటుంబపరంగా బంధుత్వమున్నప్పటికీ వాళ్లు భిన్న ధృవాలు. చంద్రబాబు తీరు, ఆయన రాజకీయాలు పురంధేశ్వరికి ఇష్టం లేదు. పైగా ఇతరులతో కలిసి పోయేకంటే..బీజేపీ  ఒంటరిగా పోటీ చేస్తే 2029 నాటికైనా బాగుపడుతుందన్న నమ్మకం ఉన్న వారిలో పురంధేశ్వరి ఒకరని చెప్పక తప్పదు. గత ఎన్నికల్లో పార్టీకి ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. ఇప్పుడు  టీడీపీతో పొత్తు పెట్టుకుంటే నాలుగు సీట్లు పోటీ చేసే అవకాశం రావొచ్చేమో కానీ, పార్టీ అభివృద్ధి చెందకపోవచ్చు. అందుకే పొత్తుల విషయంలో పురంధేశ్వరి ఆచి  తూచి మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు  సీన్ మారింది. పొత్తు ఖరారవుతున్న వేళ.. అధిష్టానానికి తలొగ్గడం మినహా వేరు గత్యంతరం లేని పరిస్థితుల్లోకి పురంధేశ్వరి నెట్టబడ్డారు.

తానొకటి తలిస్తే, అధిష్టానం ఒకటి తలచినట్లుగా బీజేపీలో పురంధేశ్వరి లాంటి వారి పరిస్థితి తయారైంది. జనసేనతో మాత్రమే తమకు పొత్తు ఉందని పురంధేశ్వరి చాలా రోజులుగా ప్రకటిస్తూ…. తన మనసులోని మాటను అధిష్టానానికి చెప్పే ప్రయత్నం చేశారు.ఐనా టీడీపీని ఎన్డీయేలోకి చేర్చుకునేందుకు బీజేపీ నిర్ణయించుకుంది. మరి ఇప్పుడు  పురంధేశ్వరి సర్దుకుపోతారా లేక మరో దారి వెదుక్కుంటారా చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి