పార్టీలో లేని వైసీపీ ఎంపీగా కొనసాగిన రఘురామ కృష్ణరాజు దారెటు అన్నది పెద్ద చర్చగా మారింది. మూడు పార్టీల్లో ఎవరు చేర్చుకున్న ఫర్వాలేదు.. నర్సాపురం టికెట్ ఇస్తే చాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఏపీ బీజేపీలో కొందరు నేతలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారని, మోకాలడ్డుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనంటే భయపడుతున్నారా.. లేక వేరే కారణం ఉందా అన్నదే ఇప్పుడు తెలియాల్సిన అంశం…
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు రచ్చబండతో జగన్ కు నిద్రపట్టకుండా చేసిన మాట వాస్తవం. లోపలేసి కొట్టినా కూడా ఆయన మటుకు తన తీరు మార్చుకోలేదు. జగన్ ను ఓడించి తీరుతానని శపథం చేసిన రఘరాజు..ఇటీవలే వైసీపీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారో చెప్పలేని పరిస్థితి ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీలో ఏదోక పార్టీ తరపున నర్సాపురం అభ్యర్థి తానేనని రఘురాజు ప్రకటించుకున్నారు. అదీ చంద్రబాబు, పవన్ సమక్షంలోనే ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన తనకు తానుగా ప్రకటించుకోవడం మరో కీలకాంశంగా భావించాలి.. రఘురాజును పార్టీలో చేర్చుకుంటామని టీడీపీ గానీ, జనసేన గానీ ఇంతవరకు ప్రకటించలేదు. ఆయన బీజేపీలో చేరే అవకాశాలున్నాయని ఒక వైపు వార్తలు వస్తున్న తరుణంలోనే ఆ దిశగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
రఘురాజు తాజాగా ఒక ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరడాన్ని రాష్ట్ర శాఖలో కొందరు అడ్డుకుంటున్నారంటూ విష్ణు వర్థన్ రెడ్డి పేరు కూడా చెప్పేశారు. అలాగని వేరే పార్టీలో చేరే విషయంపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన్ను ఆహ్వానించడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో తెలియడం లేదు…
రఘురాజుకు నర్సాపురం టికెట్ కావాలి. టీడీపీ, జనసేన, బీజేపీలో ఎవరు ఇచ్చినా కూడా ఫర్వాలేదన్నట్లుగా ఆయన డైలాగులు ఉన్నాయి . ఇప్పుడున్న పరిస్తితుల్లో నర్సాపురం నుంచి ఆయన గెలవడం చాలా సులభమని చెబుతున్నారు. కాకపోతే ఎందుకో టీడీపీ, జనసేన ఆయన్ను చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దానితో ఆయన బీజేపీ ద్వారానే రాజకీయాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనుకున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో తనకున్న సాన్నిహిత్యం ఏపీలో సీటు కొట్టేందుకు ఉపయోగపడుతుందని రఘురాజు భావించారు. అయితే స్టేట్ పాలిటిక్స్ అందుకు భిన్నంగా ఉన్నాయి.ఆరుగురు బీజేపీ నేతలు ఆయన ఎంట్రీకి అడ్డుపడుతున్నారు. అందులో విష్ణువర్థన్ రెడ్డి గట్టిగా అడ్డుకుంటున్నారని రఘురాజే స్వయంగా చెప్పారు. ఆయనతో పాటు కేతినేని సురేంద్ర, నిర్మల, శాంతా రెడ్డి, ఏ దయాకర్ రెడ్డి, పాక సత్యనారాయణ కూడా రఘురాజు ఎంట్రీకి విముఖత చూపుతున్నారన్నది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త. తను వస్తే స్థానిక బీజేపీ నేతలకు అంతకష్టమెందుకని రఘురాజు ప్రశ్నిస్తున్నారంటే… మొత్తం విషయం ఆయన దాకా కూడా చేరిందనుకోవాలి. రఘురాజు తీరు బహుశా ఆ నేతలకు నచ్చలేదనుకోవాలి. జగన్ ను తిట్టినట్లుగానే రేపు బీజేపీని కూడా తిడితే ఇబ్బందవుతుందని భయపడుతుండాలి. లేదా కొత్తగా వచ్చిన నేతకు టికెట్ ఇవ్వాల్సి వస్తుందన్న లెక్కలు కట్టుకుని ఉండాలి.
రాజుగారి పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలా తయారైంది. ఏ పార్టీలో చేరాలి. టికెట్ ఇచ్చే పార్టీలో చేరాలా…పదవి లేకపోయినా ఫర్వాలేదు.. అధికార కూటమిలో సేఫ్ గా ఉండొచ్చని ఆ మూడు పార్టీల్లో ఒక దానిని ఆశ్రయించాలా అన్నది ఆయనకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ఎన్నికల ప్రచారంలో మాత్రం రఘురాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం ఖాయం. అంతవరకు అది నిజం ..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…