రఘురామ కృష్ణరాజు ఫైర్ బ్రాండ్ మాత్రమే కాదు.. ప్రజాసంక్షేమానికి పాటుపడే నాయకుడు కూడా అని తేలిపోయింది.ఉండి నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి ఆయన స్థానిక ప్రజలకు పనికి వచ్చే ఏదోక కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నారు.నియోజకవర్గంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన రఘురామ అక్కడి డ్రైనేజీల ప్రక్షాళణకు శ్రీకారం చుట్టారు….
కనుమూరి రఘురామకృష్ణరాజు పరిచయం అక్కరలేని పేరు. నరసాపురం ఎంపీగా ఆయన 2019 నుంచి 2023 వరకూ వైసీపీలోనే ఉండి ఆ పార్టీకే కంట్లో నలుసుగా మారారు. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో మీడియా సమావేశం పెట్టి మరీ పార్టీపైన, అధినేత జగన్ పైన విమర్శలు చేసే రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో నరసాపురం టీడీపీ టిక్కెట్ ఆశించినా దక్కలేదు. ఆ సీటు కూటమిలో పొత్తులో భాగంగా బీజేపీ ఎగరేసుకుపోయింది. ఇక రాజును కాదనలేక, బయట ఉంచలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టి మరీ ఆయనకు ఉండి శాసనసభ టిక్కెట్ ఇచ్చారు. కూటమి ప్రభంజనంతో ఆయన ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు.కూటమి అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి గ్యారంటీ అనుకున్న రఘురామకృష్ణరాజుకు చివరకు నిరాశ ఎదురయింది. ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. స్పీకర్ పదవి అయినా దక్కుతుందని భావించినా అది కూడా అయ్యన్నపాత్రుడికి దక్కింది. దీంతో రఘురామకృష్ణరాజుకు మంత్రివర్గంలో ఇక తనకు స్థానం దక్కదని తేలిపోయింది. అయినా ఆయన ఉండిలో తనకంటూ ప్రత్యేకతను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిధుల పైన ఆధారపడకుండా నిధులు సమీకరించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో రఘురామకు ఉన్న పరిచయాల కారణంగా నిధులు బాగానే వచ్చినట్లుగా చెబుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ఖజానా ఒట్టిపోవడం, మరో పక్క ఇతర కారణాలతో నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఉన్నప్పటికీ రఘురామ ఎక్కడా వెనుకంజ వేయలేదు. మూడు నెలలుగా ఆయన ఉండి నియోజకవర్గం పరిధిలోని డ్రైనేజీలను ఆధునీకరించే పని సమర్థంగా నిర్వహించారు. మూడు నెలల కాలంలో ఉండి నియోజకవర్గాన్ని దాదాపుగా అత్యాధునిక ప్రదేశంగా ఆయన తీర్చిదిద్దారని జనం ప్రశంసిస్తున్నారు. సొంత నిధుల సేకరణ కార్యక్రమం సక్సెస్ కావడంతో పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వీటి గురించి వాకబు చేసి రఘురామ సేవలను ప్రశంసించారు. అందరూ ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కొల్లేరు ప్రాంత అభివృద్ధికి కూడా రఘురామ కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. ఇక రఘురామ కేంద్ర నిధుల కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. తన నియోజకవర్గంతో పాటు పరిసర నియోజకవర్గాల్లో రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి అయిన నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మతో భేటీ అయి.. ఉండి నియోజకవర్గంలో పనులకు సహకరించాలని కోరారు. తనకు రావాల్సిన టికెట్ ను శ్రీనివాస వర్మ ఎగరేసుకుపోయారని ట్రిపుల్ ఆర్ ఎప్పుడూ ఆందోళన చెందలేదు..
ఫైర్ బ్రాండ్ లక్షణాలను మాత్రం రఘురామ వదులుకోలేకపోతున్నారు. పెన్షన్ల పంపిణీ కరపత్రంపై ఎన్టీయార్ ఫోటో ఎందుకు లేదని ఆయన నిలదీసిన తీరు టీడీపీ వర్గాల్లో ఆశ్చర్యానికి కారణమైంది. చంద్రబాబు పేరు ఉంటే చాలు కదా అన్న చర్చ జరిగింది. నియోజకవర్గంలో పార్టీతో సంబంధం లేకుండా రఘురామ సొంత బలంపై ఎదగాలనే ప్రయత్నంచేస్తున్నారని కొందరు అనుమానిస్తున్నారు. మరి దానికి ట్రిపుల్ ఆర్ సమాధానం ఏమిటో…..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…