నెల్లూరు దగ్గర తీరం దాటే అవకాశం…

By KTV Telugu On 17 October, 2024
image

KTV TELUGU :-

ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కనీసం మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. భారీ వర్షాలకు కారణమవుతోంది. అది వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సాయంత్రానికి వేగం పెరిగే అవకాశమూ ఉంది. వాయుగుండం ప్రస్తుతం చెన్నైకి 360 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్లు, నెల్లూరుకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం గురువారం తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రేపు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు ముప్పు పొంచి ఉంది.ఇవాళ ఆ ఆరు జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా, మరికొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు, కడప, తమిళనాడులోని చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్‌ జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

తీవ్ర అల్పపీడనం నుంచి తీరం వైపు వస్తున్న మేఘాల ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురవనున్నాయి. బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించింది. అలాగే బాపట్ల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. వాయుగుండం తీరం దాటే సమయంలో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నెల్లూరు సహా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వాన పడుతుందని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని తెలియడంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం ఉత్తర్వులిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని కూడా సూచించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో టీటీడీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రెండో ఘాట్ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో సహాయ చర్యల కోసం ప్రత్యేక మొబైల్ స్క్వాడ్ లను నియమించారు. ఇంజనీరింగ్, ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బందితో టీములు ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడక్కడ మట్టిపెళ్లలు విరిగిపడుతున్నాయి. జేసీబీలతో వాటిని తొలగిస్తున్నామని టీటీడీ అధికారులు చెబుతున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి