ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో స్టార్ మినిస్టర్ విడదల రజని. అతి చిన్న వయసులోనే అదీ కూడా తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి అయ్యారు. కానీ ఆమె నియోజకవర్గాన్ని జంబ్లింగ్ చేసేశారు వైసీపీ అధినేత జగన్. చిలుకలూరిపేట నియోజకవర్గం నుంచి ఆమె స్థానాన్ని గుంటూరు పశ్చిమకు మార్చారు. చిలుకలూరిపేటలో ఆమెకు ఎందుకంత మైనస్ అయింది…? ఓడిపోతారని ఎందుకు తేలింది ? గుంటూరు పశ్చిమలో ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విడదల రజనీ ఓ సంచలనం. ఆమె కానీ ఆమె కుటుంబానికి కానీ రాజకీయ నేపధ్యం లేదు. హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు.. ఆమె భర్త చిలుకలూరిపేట వ్యక్తి.. కానీ తెలుగుదేశంపార్టీ హయాంలో మంత్రిగా ఉన్న చిలుకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో ఆ కుటుంబానికి ఉన్న పరిచయం ఆమెను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. ఓ మహానాడులో ప్రసంగించే అవకాశాన్ని ఆమెకు కల్పించారు. ఆ ఒక్క ప్రసంగంతో ఆమె అందర్నీ ఆకట్టుకున్నారు. వైసీపీ అధినేత జగన్‌ను రాక్షసుడిగా పోలుస్తూ చేసిన ప్రసంగం వైరల్ అయింది. అక్కడ్నుంచే ఆమె రాజకీయ కథ మారిపోయింది.
మహానాడులో ప్రసంగం తర్వాత టీడీపీలో ప్రత్తిపాటి పుల్లారావు సీటుకే విడదల రజని కుటుంబం ఎసరు పెట్టింది. ఏదైనా నామినేటెడ్ పోస్టు లేదా మున్సిపల్ చైర్మన్ పదవి వంటివి పరిశీలిస్తామని చెప్పినా ఎమ్మెల్యే సీటే కావాలని పట్టుబట్టారు. నేరుగా టీడీపీ అధినేత వద్ద లాబీయింగ్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ప్రత్తిపాటి పుల్లారావు అప్రమత్తమయ్యారు. ఆమెను మెల్లగా పార్టీ నుంచి దూరం పెట్టారు. కానీ రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన విడదల రజనీ మహానాడు ప్రసంగం ద్వారా వచ్చిన క్రేజ్‌తో వైసీపీతో టచ్‌లోకి వెళ్లిపోయారు. తనకు చిలుకలూరిపేట టిక్కెట్ ఇస్తే ఎలా గెలుచుకుని వస్తానో వారికి లెక్క చెప్పారు. ఆ లెక్కతో వైసీపీ హైకమాండ్ ఫిదా అయిపోయింది. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయనతో ఉంటున్న మర్రి రాజశేఖర్ ను పక్కన పెట్టేసి.. విడదల రజనీని చిలుకలూరిపేట ఇంచార్జ్ గా పెట్టడం అయిపోయింది. వైసీపీ గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని మర్రి రాజశేఖర్ కు ప్రజల ముందు హామీ ఇచ్చారు జగన్. ఎమ్మెల్యే సీటే ఇవ్వలేదు.. మంత్రి పదవి ఇస్తారా అని ఆయన కూడా అనుమానపడలేదు. జగన్ చెప్పారంటే.. చేస్తారని అనుకున్నారు. విడద ల రజనీ విజయం కోసం పని చేశారు. ధనానికి లోటు లేని విడదల రజనీ టీడీపీ నుంచి కొంత మంది నేతల్ని చేర్చుకుని ఆ ఎన్నికల్లో రాజకీయ గురువు అయిన ప్రత్తిపాటి పుల్లారావును ఓడించేశారు.
ముందుగా చెప్పుకున్నట్లుగా రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన విడదల రజనీ చిలుకలూరి పేట ఎన్నికల్లో గెలిచిన వెంటనే మంత్రి పదవిపై కన్నేశారు. కానీ గుంటూరు నుంచి సీనియర్ నేతలకు చాన్సివ్వడంతో మొదటి సారి తప్పి పోయింది. కానీ రజనీ.. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ప్రచారం చేయించుకున్నారు. ఓ ప్రత్యేకమైన సోషల్ మీడియా మేనేజ్ మెంట్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు.. వైఎస్ఆర్సీపీ పెద్దలకు ఆమె నాయకత్వ లక్షణాలు బాగా నచ్చాయి. రెండో విడత మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టినప్పుడు గుంటూరు నుంచి చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ.. వారెవర్నీ పట్టించుకోని సీఎం జగన్.. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన విడదల రజనీకి కేబినెట్లో చోటిచ్చారు. అదీ కూడా అత్యంత ప్రాధాన్యమైన వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు. వైసీపీ మంత్రుల్లో ఎవరైనా శాఖలపై సమీక్షలు చేయడం చాలా అరుదు. కానీ.. విడదల రజనీకి మాత్రం ఆ స్వేచ్చ ఉందంటే.. హైకమాండ్ వద్ద ఆమెకు ఉన్న పలుకుబడి అర్థం చేసుకోవచ్చు.
మంత్రిగా తిరుగులేని హవా చూపించిన విడదల రజనీ పరిస్థితి చిలుకలూరిపేటలో రాను రాను దిగజారిపోయింది. దానికి కారణం ఆమె బంధువులతో పాటు అనుచరుల కక్కుర్తి. పార్టీలో వర్గ పోరాటం. ఫలితం ఆమె పోటీ చేస్తే భారీ తేడాతో ఓడిపోతారని తేలడంతో ఆమెను గుంటూరుకు మార్చారు సీఎం జగన్.
మొదటి సారి ఎమ్మెల్యే, మంత్రి అయిన విడదల రజనీ..తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అవకాశం లభించిందే తడవు అనుకున్నారేమో కానీ.. విడదల రజనీ బంధువులు చెలరేగిపోయారు. అడ్డు చెప్పేవారు లేకపోవడంతో… నియోజకవర్గం మొత్తం దందాలు చేశారు. ప్రతి వ్యాపారి దగ్గర నెలవారీ వసూళ్లు చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇసుక మైనింగ్ దందాల గురించి చెప్పాల్సిన పని లేదు. అక్రమ మైనింగ్ పై కోర్టు ఆదేశాలతో కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపుగా ప్రతి ఊరిలో ఈ దందా సాగింది. చిలుకలూరి పట్టణంలో ఆర్యవైశ్యుల్ని వేధించారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి.
ఓ వైపు ఈ దందాలతో పాటు ప్రతి గ్రామంలో వర్గ పోరాటం పెరిగిపోయింది. సంపాదించుకునే కొంత మంది వైసీపీ నేతలు.. తమకు అవకాశం ఇవ్వడం లేదని మరో వర్గం మధ్య ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంపీ కృష్ణదేవరాయులను నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చేసి మరింత వ్యతిరేకత తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారం ఏమో కానీ.. అసలైన నాయకత్వం ఏమిటో మంత్రి పదవి చేపట్టిన తర్వాత బయటపడటంతో ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ద్వితీయ శ్రేణి నేతల వ్యతిరేకతతో పాటు .. ప్రజల అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉండటంతో విడదల రజనీని గుంటూరు పశ్చిమ ఇంచార్జ్ గా నియమించి చిలుకూలరిపేటకు మల్లెల రాజేష్ నాయుడు అనే నేతను నియమించారు. ఈయన కూడా ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడే. 2019లో విడదల రజనీనే వైసీపీలో చేర్పించారు. ఇప్పుడు ఆ నేతకు టిక్కెట్ ఇచ్చి.. విడుదల రజనీనే సైడ్ కావాల్సి వచ్చింది.
మరి గుంటూరు పశ్చిమలో రజనీకి చాన్స్ ఉంటుందా అంటే.. అక్కడ ఉన్న సామాజికవర్గాల ప్రకారం చూసినా.. . ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ప్రకారం చూసినా… విడదల రజనీకి కనీసం పది శాతం కూడా చాన్స్ ఉండదని ఇప్పటికే వైసీపీ నేతలే చెబుతున్నారు. గుంటూరు పశ్చిమలో కమ్మ, కాపు, బీసీ ఓట్ల బలం ఉంటుంది. బీసీల్లో వడ్డెర వర్గానికి బలం ఉంటుంది. విడదల రజనీ ముదిరాజ్ వర్గానికి చెందిన వారు.ఆమె భర్త రజక వర్గానికి చెందిన వారు. ఈ వర్గాల ప్రభావం పశ్చిమలో అంతంతమాత్రం. పైగా గుంటూరు పశ్చిమ టీడీపీ కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పాతిక వేల ఓట్ల వరకూ చీల్చినప్పటికీ.. టీడీపీ ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సారి టీడీపీ, జనసేన పొత్తుతో పోటి చేస్తున్నాయి కాబట్టి… పలితం ఏకపక్షంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. అందుకే మంత్రి కాబట్టి బుజ్జగంచాడనికి ఇంచార్జ్ గా నియమించారని.. కానీ చివరికి ఆమెకూ టిక్కెట్ ఇవ్వరన్న ప్రచారం వైసీపీలోనే జరుగుతోంది.
రాజకీయాల్లోకి రావడానికి…. మంత్రి పదవి పొందడానికి తన టాలెంట్ చూపించిన విడదల రజనీ.. తన కెరీర్ ను మరింత పొడిగించుకోవాలంటే.. నియోజకవర్గంలో ప్రజాభిమానం పొందాలన్న విషయంలో మాత్రం వెనుకబడిపోయారు. ఇప్పుడు ఆమెకు నియోజకవర్గం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…