కొంతమంది అభ్యర్ధులను బట్టి నియోజక వర్గాల తలరాత మారిపోతుంది. అభ్యర్ధుల గ్లామర్ తో నియోజక వర్గానికి రాజయోగమూ పడుతుంది. కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు నాయుడి కారణంగా పాపులారిటీ వచ్చింది. అదే విధంగా వై.ఎస్.ఆర., ఆయన తర్వాత ఆయన తనయుడి కారణంగా పులివెందుల నియోజక వర్గానికీ అంతే ఘన చరిత్ర వచ్చింది. అటువంటిదే మరో నియోజక వర్గంగా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజక వర్గం అవతరిస్తుందా? అన్నది ఇపుడు చర్చనీయాంశమవుతోంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజక వర్గం వార్తల్లో నిలిచింది. ఎవరిని కదిపినా పిఠాపురం గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ఈ నియోజక వర్గం నుంచి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో భీమవరం ,గాజువాక నియోజక వర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈ సారి పిఠాపురం నుండి గెలిచి తీరాలని కసిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున సినీ ప్రముఖులు, జనసైనికులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఏపీలో టిడిపి-బిజెపి-జనసేన కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వం వస్తే కీలక పదవిని పొందుతారనడంలో సందేహం లేదు.
పిఠాపురం నియోజక వర్గం నుండి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున వంగా గీత పోటీ చేస్తున్నారు. టిడిపితో రాజకీయ ఆరంగేట్రం చేసిన వంగా గీత జిల్లా పరిషత్ ఛైర్ పెర్సన్ గా , రాజ్యసభ సభ్యురాలిగా , ప్రజారాజ్యం తరపున పిఠాపురం ఎమ్మెల్యేగా..కాకినాడ లోక్ సభ స్థానం నుండి వైసీపీ ఎంపీగా కీలక పదవులు అనుభవించారు. పిఠాపురం నియోజక వర్గంతో ఆమెకు తిరుగులేని అనుబంధం ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ఆమె చేపట్టారు. అంతే కాదు వ్యక్తిగతంగా ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహించారు. అందుకే ఆమెకు ప్రజల్లో మంచి పేరు ఉంది. అది చూసే పవన్ పై వంగా గీతను బరిలో దించారు జగన్ మోహన్ రెడ్డి.
పిఠాపురం నియోజక వర్గంలో చివరి ఎన్నికల సభలో పాల్గొన్న జగన్ మోహన్ రెడ్డి వంగాగీతను ఉద్దేశించి తన తల్లిగా అక్కగా అభివర్ణించారు. ఆమె కూడా భావోద్వేగానికి గురయ్యారు. వంగాగీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీ సిఎంగా చేసి కేబినెట్ లో తన పక్కన కూర్చోబెట్టుకుని పిఠాపురం నియోజక వర్గాన్ని తిరుగులేని విధంగా అభివృద్ధి చేయిస్తానని జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ హామీ ఇవ్వడంతోనే వేలాది మంది ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. తమ నియోజక వర్గ బిడ్డను గెలిపించుకుంటే తమ నియోజక వర్గం పేరు చరిత్రలో నిలిచిపోతుందని.. ఆమె డిప్యూటీ సిఎం అయితే నియోజక వర్గానికి మేలు జరుగుతుందని పిఠాపురం వాసులు భావిస్తున్నారు.
మరో వైపు పిఠాపురంలో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు కూడా తమ నాయకుని గెలిపించుకుంటే పిఠాపురం పేరు దేశ వ్యాప్తంగా చరిత్రలో నిలిచిపోతుందని భావిస్తున్నారు. కూటమిలో కీలక నాయకుడిగా ఉన్న పవన్ కల్యాణ్ కి ప్రధాని నరేంద్ర మోదీతోనూ పరిచయం ఉన్న నేపథ్యంలో నియోజక వర్గం అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురాగలుగుతారని నియోజక వర్గ మేథావులు భావిస్తున్నారు. కేంద్రంలో బిజెపి…ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పిఠాపురానికి రాజయోగం ఖాయమని వారు ధీమాగా ఉన్నారు.
మొత్తానికి పిఠాపురం నియోజక వర్గంలో ప్రధాన ప్రత్యర్ధులు అయిన వంగా గీత, పవన్ కల్యాణ్ లలో ఎవరు గెలిచినా తమ నియోజక వర్గం వెలిగిపోతుందని తమందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పిఠాపురం వాసులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వస్తే చంద్రబాబు ఎలాగూ ముఖ్యమంత్రి అవుతారు..అప్పుడు పవన్ కల్యాణ్ కు డిప్యూటీ సిఎం పదవి దక్కే అవకాశాలున్నాయంటున్నారు. అంటే పవన్ నెగ్గి కూటమి అధికారంలోకి వచ్చినా..వంగా గీత గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చినా పిఠాపురం డిప్యూటీ సిఎం నియోజక వర్గంగా వార్తలకెక్కడం ఖాయం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…