ముందుగానే భుజాలు తడుముకున్న టిడిపి

By KTV Telugu On 23 April, 2024
image

KTV TELUGU :-

తెలుగుదేశం పార్టీ ముందుగానే భుజాలు తడుముకుంటోంది. జగన్ మోహన్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో అనవసర వ్యాఖ్యలతో టిడిపి నేతలు  తమపై వచ్చిన ఆరోపణలకు తామే ఊతమిస్తున్నారన్న  వాదనలు వినిపిస్తున్నాయి. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఎవరు చేస్తారో వారి సామాజిక వర్గం ఏంటో వారిని పురమాయించిన నేత ఎవరో తెలుగుదేశం పార్టీ నేతలకు ముందస్తుగానే తెలుసా? హత్యాయత్నానికి పురికొల్పింది టిడిపి నేతలేనా? అందుకే ఏ నేతపై కేసులు పెట్టే  అవకాశం ఉందో దాడి చేసిన వారు ఏ సామాజిక వర్గానికి చెందిన వారో  టిడిపి నేతలకు ముందుగానే తెలిసిందా? పోలీసులను చూడగానే బోండా ఉమ ఎందుకు వణికిపోతున్నారు. పోలీసుల కంటపడకుండా ఎందుకు గోడలు దూకుతున్నారు?

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.

దాడి జరిగిన మరు నిముషం నుంచే టిడిపి,జనసేన నేతలు  జగన్ మోహన్ రెడ్డే  తనపై తాను దాడి చేయించుకున్నారని ఎదురు దాడికి దిగారు. సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారని ఆరోపించారు.  హత్యాయత్నానికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ఉధృతం చేయగానే.. చంద్రబాబు నాయుడితో పాటు టిడిపి నేతలంతా  బీసీలను దోషులుగా చూపించి వారిని వేధించుకు తినే కుట్ర జరుగుతోందని  ఆరోపించారు.విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ టిడిపి అభ్యర్ధి బోండా ఉమను కేసులో ఇరికించాలని అనుకుంటున్నారని కూడా టిడిపి ఆందోళనలు వ్యక్తం చేసింది.

పోలీసులు ఎవరినీ పట్టుకోక ముందే..వారు బీసీలను పట్టుకుంటారని టిడిపి నేతలు అనేశారు.  హత్యకు కుట్ర చేసిన సూత్రధారి ఎవరో దర్యాప్తు అధికారులు  ఇంత వరకు తేల్చనే లేదు. దానికి ముందే  బోండా ఉమను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందంటూ హడావిడి చేశారు. ఇక్కడే టిడిపి నేతలు తమపై వచ్చిన ఆరోపణలకు తామే ఊతమిచ్చినట్లయ్యిందంటున్నారు  నిపుణులు. హత్యాయత్నానికి పాల్పడిన వారిలో  రాయి విసిరిన సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను వడ్డెర కాలనీకి చెందిన వాడని తేలింది. దుర్గారావు అనే టిడిపి బిసి సెల్ నేత  చెబితేనే సతీష్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి తెగబడ్డాడని తేలింది.

దుర్గారావు టిడిపి నేత బోండా ఉమకు సన్నిహితుడన్నది బహిరంగ రహస్యం. అంటే  బీసీ సామాజిక వర్గానికి చెందిన సతీషే ముఖ్యమంత్రిపై దాడి చేశాడని..అతన్ని ఆ పనికి పురమాయించిన దుర్గారావు బోండా ఉమ శిష్యుడే అని టిడిపి నేతలకు ముందుగానే తెలుసు కాబట్టే  బీసీలను ఇరికించే అవకాశాలున్నాయని చంద్రబాబు అండ్ కో ముందుగానే  ఆరోపించారని అనుకోవాలంటున్నారు నిపుణులు.

ఈ ఘటన తర్వాత బోండా ఉమ కూడా  తనను  ఈ కేసులో ఇరికించడానికి కుట్ర జరుగుతోందన్నారు. తన పేరు చెప్పమని  నిందితులపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని  తనకు తెలిసిందని కూడా బోండా ఉమ ఆరోపించారు. ప్రతీ ఎన్నికలోనూ ఆర్భాటంగా నామినేషన్ వేసే బోండా ఉమ ఈ సారి గుట్టు చప్పుడు కాకుండా..ఎవ్వరికీ తెలీకుండా నామినేషన్ వేసి ఇంటికి వెళ్లిపోయారు.

భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా  ఇద్దరు పోలీసులను బోండా ఉమ ఇంటికి  సెక్యూరిటీ కోసం పంపారు అధికారులు. వారిని చూడగానే తనను అరెస్ట్ చేయడానికే వచ్చారనుకున్న బోండా ఉమ వణికిపోయారు. ఆవెంటనే టిడిపి నేతలకు ఫోను చేసి పార్టీ కార్యాలయానికి రమ్మన్నారట. వారు స్పందించకపోవడంతో  వంగవీటి రాథాకు ఫోను చేసి తన భయం చెప్పుకున్నారట. దాంతో రాథా తన అనుచరులు పంపి బోండా ఉమను తన ఇంటికి  తెప్పించుకున్నారు. ఇది కూడా ఎలాగంటే బోండా ఉమ పోలీసుల కళ్లు కప్పి పార్టీ కార్యాలయంలో చొక్కా మార్చుకుని గోడ దూకి పరారయ్యి వంగవీటి ఇంటికి వెళ్లారు.

బోండా ఉమ పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారన్నది బోండా ఆరోపణ. పోలీసులు ఎవరి ఆధీనంలో ఉన్నారో బోండా మర్చిపోయినట్లున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా  ఎన్నికల సంఘం అజమాయిషీలో ఉంది. అందుకే జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన క్షణం నుంచి రోజు వారీ కేసు దర్యాప్తు వివరాలను నివేదికల రూపంలో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి అందిస్తున్నారు పోలీసులు. ఆ నివేదికలో ఏం ఉందో సిఈసీకి వివరించి వస్తున్నారు.పోలీసులంటేనే భయపడుతోన్న బోండాఉమ తనపై కేసు పెడితే మాత్రం జూన్ 4 తర్వాత వారి భరతం పడతానని హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఉమకు ఎలాంటినోటీసులు ఇవ్వకముందే ఉమ భయపడ్డానికి కారణం ఈ హత్యాయత్నం ఆయనే చేయించారు కాబట్టే అంటున్నారు  వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్

ఒక వేళ హత్యాయత్నం చేయించిన దుర్గారావును  బొండా ఉమానే  ఆ పనికి పురమాయించి ఉంటే ఆ విషయం కూడా పోలీసుల దర్యాప్తులో  బయట పడుతుంది. బోండా ఉమ పేరును అధికారులు చెప్పకముందే  బోండా ఉమ తన పేరు చెబుతారని..తనను కేసులో ఇరికిస్తారని ఎలా చెబుతున్నారు? ఆయనకు ఏదైనా కర్ణపిశాచి వచ్చి  చెవిలో చెబుతోందా? అని  నిపుణులు నిలదీస్తున్నారు.

అన్నా క్యాంటీన్ తీసేసినందుకే సతీష్ దాడి చేశారని బోండా ఉమ  చెప్పారు. ఆ విషయం బోండా ఉమకు ఎవరు చెప్పారు? పోలీసుల అదుపులో ఉన్న సతీష్ బోండా ఉమకు ఫోన్ చేసి చెప్పారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో బోండా ఉమ భయపడుతున్నారన్నది వాస్తవం. చాలా చాలా టెన్షన్ పడుతున్నారు. దీనర్ధం ఆయన ఏదో ఒక తప్పు చేసి ఉండడమే కావచ్చునంటున్నారు నిపుణులు. అందుకే తనపై కేసులు పెడతారని ముందస్తుగానే ఉమ పెడ బొబ్బలు పెడుతున్నారు. అయితే బోండా ఎన్ని పిల్లిమొగ్గలు  వేసినా దర్యాప్తు అధికారులు తమ పని తాము చేసుకుపోతారు. తప్పు చేసిన వారిని వారు బోనులో నిలబెడతారు. న్యాయస్థానాలు దోషులకు కఠిన శిక్షే విధిస్తాయి. దానికి బోండా ఉమ అతీతుడు కాదంటున్నారు  పాలక పక్ష నేతలు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి