రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే కొన్నిటికి మెంటల్‌గా ఫిక్స్అయిపోవాలి. రాజపూజ్యం 10, అవమానం సున్నా ఉండాలంటే అది కుదిరేపని కాదు. సెంట్ పర్సెంట్ అవమానాలున్నా మనరోజు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. నువ్వు చెడ్డీలు వేసుకున్నప్పుడే నేను పాలిటిక్స్‌లో ఉన్నా తమ్ముడూ అని చెప్పే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఈ లాజిక్ ఎక్కడో మిస్ అయినట్లుంది. అందుకే ఫోన్ ట్యాపింగ్ అంటూ నానా హంగామా చేస్తే చివరికి అది ఆడియో రికార్డ్‌గా తేలిపోతోంది. మొన్నటిదాకా అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉన్న హంగూఆర్భాటం అంతా కళ్లముందునుంచి జారిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే చుక్కాని లేని నావలా ఉంది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పరిస్థితి.
కోటంరెడ్డి స్థానంలో కొత్త ఇంచార్జి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని ఆదాల ప్రభాకర్‌రెడ్డి సవాల్ చేస్తున్నారు. పాపం కోటంరెడ్డేమో నీకు ఆ పదవి ఇప్పించింది నేను, ఆ అంగీ కుట్టించింది నేను, వేలు పట్టుకుని నడిపించింది నేను అనుకుంటూ వేదాంతంలోకి జారిపోతున్నారు. చావైనా బతుకైనా మీతోనే అని వచ్చిన కొందరు కార్పొరేటర్లు ఇంకొందరు నేతల్ని చూసుకుని తన భుజం తాను చరుచుకోవడం తప్ప కోటంరెడ్డి చేయగలిగింది కూడా లేదు. చంద్రబాబుతో అన్నీ మాట్లాడుకున్నాకే ఆరోపణలు చేశారనుకుంటుంటే ఇప్పుడు టీడీపీ వాళ్లు కూడా ఆయన్ని దేకడం లేదు. దీంతో టీడీపీ టికెట్ ఇస్తుందని ఆశించే పరిస్థితుల్లోనే ఇంకా ఉన్నారు కోటంరెడ్డి.
కోటంరెడ్డి ట్యాపింగ్ ఆరోపణలను ఆయన స్నేహితుడే ఖండించటంతో ఆ మ్యాటర్ కాస్తా వీకైపోయింది. బెల్లం చుట్టే ఈగలుంటాయి. రాజకీయాల్లో అధికారం ఉన్నవారితోనే నాయకులు ఉంటారు. తెలిసినోడనో అప్పుడెప్పుడో ఏదో మేలు చేశాడనో భవిష్యత్తులో చూసుకుంటాడనో వెంట నడిచేవాళ్లు రాజకీయాల్లో తక్కువ. రోజులు గడిచేకొద్దీ కోటంరెడ్డికి తత్వం బోధపడుతుంది. కానీ అప్పటికి చుట్టూ ఎవరూ లేకపోవచ్చు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలంతా వీర విధేయులనీ కల్లో కూడా ప్రభుత్వంపైనో పార్టీపైనో అసంతృప్తితో లేరనుకోడానికి లేదు. కచ్చితంగా మనిషన్న ప్రతీవాడికీ ఎక్కడోచోట ఇగో హర్ట్ అవుతుంది. అవమానాలు ఎదురవుతుంటాయి. అంచనాలు తప్పుతుంటాయి. పరిస్థితులు చక్కబడేదాకా ఓపికపట్టాలి. రాజకీయాలన్నాక పట్టువిడుపులు ఉండాలి. కానీ కోటంరెడ్డికి అంత ఓపిక లేకపాయ. ఇప్పుడాయన తొందరపడ్డానని ఒకవేళ పశ్చాత్తాపపడ్డా చేయగలిగిందేమీ లేదు.