కొడాలి నానిపై బరిలోకి రేణుకాచౌదరి..!

By KTV Telugu On 7 February, 2023
image

తెలంగాణలో ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల నగరా మోగుతోంది. ఇది కొందరు నేతలకు అడ్వాంటేజ్‌అవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లోని సీనియర్లకు వరంగా మారుతోంది. అసెంబ్లీతో పాటు ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు పలువురు హస్తంపార్టీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో గెలిస్తే సరే ఓడితే పార్లమెంట్‌కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి ఇంట ఓడిపోయిన వారిని అధిష్టానం ఢిల్లీకి పంపుతుందా. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఓడిపోయారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా విజయం సాధించారు. హుజూర్‌నగర్‌లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం నల్గొండ ఎంపీగా పోటీ చేసి మరలా విజయం సాధించారు. ఈసారి కూడా కొందరు నేతలు ఆవిధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకాచౌదరి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌కు పోటీ చేస్తానని అంటున్నారు. అంతేకాదు పక్క రాష్ట్రంలోనూ పోటీకి సిద్ధమంటున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. అది కూడా వైసీపీకి బలమైన సెగ్మెంట్‌ నుంచి బరిలోకి దిగుతానంటున్నారు. గుడివాడలో పోటీకి సిద్ధమంటూ కొడాలికి సవాల్ విసురుతున్నారు. గుడివాడలో కమ్మ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ పోటీ చేస్తే తన సామాజికవర్గం ఓటర్లు అండగా నిలుస్తారనే అంచనాతో పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉందనే విషయాన్ని ప్రజలు రాష్ట్ర విభజనానంతరం మర్చిపోయారు. మరి అలాంటిచోట తెలంగాణ నుంచి ఏపీ రాజకీయాల్లోకి వెళ్లి అది కూడా గుడివాడ లాంటి చోట కాంగ్రెస్‌ టికెట్‌పై గెలవడమంటే మాటలు కాదు.

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానన్న రేణుకాచౌదరి తన మనసులో గుడివాడ కూడా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రమే కదా ఏపీలో పోటీ చేస్తే తప్పేంటని లాజిక్ తీస్తున్నారు రేణుకాచౌదరి. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని అందుకే గుడివాడలో పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రెండు చోట్లా పోటీ చేయడంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఖమ్మం ఎంపీగా పోటీ చేసే విషయంలో పార్లమెంట్ ఎన్నికప్పుడు ఆలోచిస్తానంటున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపైనా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరొచ్చినా స్వాగతిస్తామంటూనే ఎక్కడా దిక్కులేని వాళ్లకు కాంగ్రెస్‌ దిక్కంటూ సెటైర్లు వేశారు. మొత్తంగా తెలుగు భాష లెక్క అక్కడ ఉంటా ఇక్కడా ఉంటానంటోన్నారు రేణుకా చౌదరి. రేణుకాచౌదరి వ్యాఖ్యలపై కొడాలి నాని ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.