రోజాతో పెట్టుకుంటే మడతడిపోద్దని తెలీదా లోకేష్‌

By KTV Telugu On 17 February, 2023
image

 

నారా లోకేష్‌ పాదయాత్ర మొదలుపెట్టడమే పార్టీలో ఓ సంచలనం. ఎప్పుడన్నా ఒకటీ అరా మాట మాట్లాడితేనే అన్వయలోపాలు అక్షరదోషాలతో ఆగమాగం అయిపోతుంటాడు నారావారి వారసుడు. అలాంటిది అన్ని రోజులు అంత సుదీర్ఘపాదయాత్రంటే పెద్ద రిస్కే. ప్రతీచోటా మాట్లాడాల్సి ఉంటుంది. బోరు కొట్టకుండా ప్రసంగించాల్సి ఉంటుంది. నారా లోకేష్‌ నాలుగుముక్కలు కాస్త మాట్లాడగలుగుతోంది ఇప్పుడే. మౌనదీక్షల్లాంటివైతే బాగా సూటవుతాయిగానీ పాదయాత్ర పొడవునా ప్రసంగాలంటే చాలా పెద్ద టాస్కే. అందుకే లోకేష్‌ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్పీచ్‌లు బూమరాంగ్‌ అవుతున్నాయి.

పోయిపోయి ఎవరన్నా కొడాలి నాని నోట్లో నోరు పెడతారా. పనిగట్టుకుని రోజాని టార్గెట్‌ చేసుకుంటారా. చేసుకున్నారంటే ఏమవుద్దో అందరికంటే లోకేష్‌కి స్వానుభవమే. కొడాలి అయితే వాడూవీడని గాలితీసేస్తారు. ఇక రోజా నోరిప్పితే జబర్దస్త్‌ డైలాగులే. గుక్కతిప్పుకోకుండా సెటైర్లు వేసి ఎదుటోడిని కామెడీ చేసి పారేస్తుంది. పాదయాత్ర నగరికి చేరుకోగానే లోకల్‌ ఎమ్మెల్యే ఆర్కే రోజాని టార్గెట్‌ చేసుకున్నారు లోకేష్‌. రోజా ఆంటీ అంటూ లోకేష్‌ సెటైర్‌ వేశాననుకుంటే వాట్స్‌ ద మ్యాటర్‌ అంకుల్‌ అంటూ గోడక్కొట్టిన బంతిలా రివర్స్‌లో వచ్చిపడింది కౌంటర్‌. డైమండ్‌ రాణి డైమండ్‌ పాప అంటూ రోజాని ఆడుకుందామనుకున్నారు లోకేష్‌. హెరిటేజ్‌ ఆంటీ హెరిటేజ్‌ బేబీ అంటూ రోజానుంచి రివర్స్‌ పంచ్‌లు వచ్చిపడ్డాయి.

చీర సారె అంటూ లోకేష్‌పై రోజా వేసిన సెటైరికల్ బాణంతో టీడీపీ ఉడికిపోయింది. పంపు తల్లీ మా ఆడపడుచులకు ఇచ్చుకుంటానని నారావారబ్బాయి రియాక్ట్‌ అయ్యారు. టీడీపీ కార్యకర్తలు అదే ఊపులో చీర సారెతో రోజా ఇంటికి వెళ్లడంతో రచ్చరచ్చ. నా పేరే ఓ బ్రాండ్‌. మరి నీ బ్యాక్‌గ్రౌండేంటని లోకేష్‌ని ఉడికించారు రోజా. తాతలు తండ్రులు పెళ్ళాం పేరుచెబితేగానీ నువ్వెవరో గుర్తుపట్టలేరంటూ చంద్రబాబు వారసుడిని ఆడేసుకున్నారు. లోకేష్‌ తన సెంటర్‌కొచ్చి మాట్లాడాక సైలెంట్‌గా ఉంటే బాగోదని గాలి ముద్దుకృష్ణమ వారసుడు కూడా నోరు కలిపి ఇంకాస్త రచ్చ చేశాడు. మన్నార్ గుడి మాఫియాలా తయారైందంటూ రోజాపై గాలి భాను విరుచుకుపడితే వైసీపీ మహిళానేతలు చీపుర్లు బయటికి తీశారు. జబర్దస్త్ ప్రోగ్రాంలా నడుస్తున్న రోజా-లోకేష్ ఎపిసోడ్‌లో ఇంకెన్ని పంచ్‌ డైలాగులు పేలబోతున్నాయో.