ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజక వర్గం తెలుగుదేశంలో రచ్చ రంబోలా నడుస్తోంది. ఈ ఎన్నికల్లో ఉండి నియోజక వర్గం టికెట్ ను సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజకు కేటాయించారు చంద్రబాబు. అయితే తాజాగా వైసీపీ నుండి టిడిపిలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొద్ది రోజులుగా ప్రచారం చేసుకుంటోన్న మంతెన రామరాజు వర్గం మండి పడుతోంది. మంతెన రామరాజుతో పాటు టిడిపి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కూటా టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఎక్కడో బయటి నుండి వచ్చిన రఘురామకు టికెట్ ఇవ్వడం పట్ల లోకల్ రామరాజులు ఇద్దరూ గుర్రుగా ఉన్నారు.
ఉండి నియోజక వర్గానికి రామ రాజులకు అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. 1978 నుండి ఉండి నియోజక వర్గంలో ఎక్కువ సార్లు గెలిచిన వారి పేర్లు ఏదో ఒక రామరాజు కావడం విశేషం. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాత పాటి సర్రాజు గెలిచారు. 1978 నుండి 2019 ఎన్నికల వరకు 2004 ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ గెలిచిన రాజుల పేర్లలో రాముడు ఉండడం విశేషం.1978లో గొట్టుముక్కల రామచంద్రరాజు విజయం సాధించారు.1983 నుండి 1999 వరకు వరుసగా 5 సార్లు కలిదిండి రామలింగరాజు టిడిపి నుండి గెలుస్తూ వచ్చారు. 2009,2014 ఎన్నికల్లో వేటుకూరు శివరామరాజు గెలవగా 2019 లో మంతెన రామరాజు విజయం సాధించారు.
మొత్తం మీద ఉండి నియోజక వర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటోంది. వై.ఎస్.జగన్ ప్రభంజనం వీచిన 2019 ఎన్నికల్లోనూ ఇక్కడ టిడిపి విజయకేతనం ఎగరేసింది. ఈ ఎన్నికల్లోనూ గత ఎన్నికల్లో గెలిచిన మంతెన రామరాజుకే టికెట్ కేటాయించారు చంద్రబాబు. అయితే ఆ తర్వాత అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి అదే ఎంపీ సీటు నుండి కూటమి తరపున పోటీ చేయాలనుకున్నారు. అయితే బిజెపికి కేటాయించిన ఆ స్థానంలో బిజెపి భూపతి రాజు శ్రీనివాస వర్మకు టికెట్ ఇచ్చింది. దాంతో రఘురామకు ఉండి సీటు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.
నరసాపురం సీటు నుండే పోటీ చేయాలనుకున్న రఘురామ కృష్ణం రాజు బిజెపి-టిడిపి-జనసేనల్లో ఏదో ఒక పార్టీ నుండి బరిలో దిగుతా అన్నారు. అయితే మూడు పార్టీలు టికెట్ ఇవ్వకపోయే సరికి రఘురామ చంద్రబాబు నాయుడిపైనే ధ్వజమెత్తారు. తనకు సీటు సంపాదించలేని వారు పోలవరం ప్రాజెక్టును ఎలా సాధిస్తారు? అంటూ మండి పడ్డారు. అయితే కూటమి నేతలంతా కలిసి రఘురామను బుజ్జగించి ఏదో ఒక సీటు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. నరసాపురం సీటును రఘురామకే ఇచ్చి దానికి బదులుగా బిజెపికి ఏలూరు సీటు ఇస్తామని చంద్రబాబు ప్రతిపాదించినట్లు సమాచారం.
చంద్రబాబు నాయుడి ప్రతిపాదన మేరకు నరసాపురంలో తమ అభ్యర్ధిని మార్చే ప్రసక్తి లేదని బిజెపి అగ్రనాయకత్వం తేల్చి చెప్పింది. దీంతో రఘురామకు ఎక్కడి నుంచి ఇవ్వాలా అని కసరత్తులు చేసిన చంద్రబాబు నాయుడు టిడిపికి బలమైన నియోజక వర్గంగా ఉన్న ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆశపెట్టారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రఘురామ దానికి ఒప్పుకున్నారు. దాంతో ఉండి సీటును రఘురామకు ఖరారు చేశారు చంద్రబాబు. అది సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పుట్టి ముంచేలా ఉంది. మంతెన అనుచరులు అయితే రఘురామ విజయానికి తాము పనిచేసేది లేదంటున్నారు.
గత ఎన్నికల్లో ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరు శివరామరాజును నరసాపురం లోక్ సభ నియోజక వర్గం నుండి బరిలో దింపారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన రఘురామ కృష్ణం రాజు విజయం సాధించారు. ఆ ఎన్నికల తర్వాత వేటుకూరు శివరామరాజుకు ఈ ఎన్నికల్లో ఉండి టికెట్ ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అయితే చివరిదాకా ఊరించి మంతెన రామరాజుకు ఇచ్చారు. ఇపుడు ఆయన్ను కూడా మార్చి రఘురామ కృష్ణం రాజుకు ఇచ్చారు. మొత్తానికి ఈ ముగ్గురు రాముల్లో ఇద్దరు రాముళ్లు రఘురామను ఓడిస్తాం అంటున్నారు. దీంతో ఉండి ఎన్నిక ఆసక్తిగా మారింది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…