వివిధ పత్రికల్లో ఉన్నత పదవులు నిర్వర్తించిన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా ఆయన పార్టీలోనూ కీలక పాత్ర పోషించారు. ఇపుడు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ కూడా ఆయన కీలకమైన నేతగా ఉన్నారు. అటువంటి సజ్జలపై ఎందుకు విపక్షాలు దాడులు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడి రాజకీయ వ్యవహార శైలి గురించి తెలిసిన వారికి ఆయన వ్యవహారాలు బాగా అర్ధం అవుతాయి. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కొంత కాలం మౌనంగా ఉన్నా ఆ తర్వాత నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే కీలక నేతలపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. విజయసాయి రెడ్డి వై.వి.సుబ్బారెడ్డిలను వెంటాడి వేటాడి విమర్శలతో వేధిస్తున్నారు. వై.వి.సుబ్బారెడ్డి టిటిడి ఛైర్మన్ కాగానే క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారంటూ విష ప్రచారం చేశారు టిడిపి నేతలు. వై.వి సుబ్బారెడ్డే క్రైస్తవుడని కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు.
ఆ క్రమంలోనే కొంతకాలంగా సజ్జలపై అస్త్రం ఎక్కు పెట్టారు. తాను విమర్శించడమే కాదు తనతో స్నేహంగా ఉండే రాజకీయ పార్టీలనూ సజ్జలపైకే ఎగదోస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా సజ్జలపై విమర్శలు చేస్తున్నారు.
సకల శాఖల మంత్రి అంటూ సజ్జలకు టిడిపి నేతలు పేరు కూడా పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ పై కన్నా కూడా సజ్జలపైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడే కాదు ఆయనతో టచ్ లో ఉండి తాజాగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సజ్జలపైనే గురి పెడుతున్నారు. సజ్జల నుండి తనకు ప్రాణహాని ఉందని ఉండవల్లి శ్రీదేవి మరీ తీవ్రమైన ఆరోపణ చేశారు కూడా. వైసీపీ నుండి సస్పెన్షన్ కు గురైన ఈ నలుగురు నేతలూ సజ్జలనే తప్పుబడుతున్నారు.
దీనికంతటికీ కారణం ఒక్కటే. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ సజ్జల రామకృష్ణా రెడ్డి తనదైన సలహాలు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ తప్పుదోవ పట్టించేందుకు టిడిపి అధినేత పన్నే వ్యూహాలు ఎత్తుగడలను చిత్తు చేసేలా సజ్జల పార్టీ అధినేతకు సూచనలు చేస్తూ ఉంటారు. దీంతో చంద్రబాబు నాయుడు పన్నే కుట్రలు చాలా వరకు భగ్నం అవుతున్నాయన్నది టిడిపి అధినేత ఆక్రోశం. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో ఓటమి చెందడానికి సజ్జలే కారణమని విమర్శలు చేయడం ద్వారా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఇటువంటి ఆలోచనలు చేయడంలో చంద్రబాబు దిట్ట. 2019 ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యూహాలే పన్నారు. అప్పట్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పై చంద్రబాబు నాయుడు ఒంటికాలిపై లేచి నిలబడేవారు. చీటికీ మాటికీ దుయ్యబట్టేవారు. ఏపీని బిహార్ చేసేస్తున్నాడు అంటూ ప్రశాంత్ కిషోర్ పై మండి పడేవారు. నిప్పులు చెరిగేశారు. దానికి కారణం లేకపోలేదు.
ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వైసీపీలో తన మనుషులు కొందరిని పంపించి కోవర్టు ఆపరేషన్లు చేయిద్దామని ప్లాన్ చేశారు. తన మనుషులను వైసీపీలోకి పంపి టికెట్లు సంపాదించి ఎన్నికల్లో గెలిచాక తనవైపు తిప్పుకుందామని పథక రచన చేశారు. అయితే చంద్రబాబు ఎత్తుగడలను పసిగట్టిన ప్రశాంత్ కిషోర్ వైసీపికి పనికిరాని వారికి టికెట్లు ఇవ్వకుండా అడ్డు పడ్డారు. గెలిచే అభ్యర్ధులకు మాత్రమే ఆయన టికెట్లు ఇవ్వడానికి తన నివేదికల్లో సిఫారసులు చేశారు. తన ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కాకపోవడంతో చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనానికి గురయ్యారు. అందుకే ఆయనకు అపుడు ప్రశాంత్ కిషోర్ అంటేనే ఒళ్లు మండుకొచ్చి పళ్లు పటపటా కొరికేవారు. అపుడు పీకే ఎలానో ఇపుడు సజ్జల అలానే కనిపిస్తున్నారు చంద్రబాబుకు. అందుకే ఆయనపై చంద్రబాబు కక్షగట్టి ఉండచ్చని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాకపోతే చంద్రబాబు వ్యూహాలను బాగా చదివిన జగన్ మోహన్ రెడ్డి అపుడు పీకే విషయంలోనూ ఇపుడు సజ్జల విషయంలోనూ చంద్రబాబు అండ్ కో విసురుతోన్న పాచికలను పారనివ్వకుండా అసలు సిసలు చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు.