రాజకీయ చైతన్యమున్న ప్రజలుండే నియోజకవర్గం సత్తెనపల్లి. అక్కడేం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు ఖాయమంటారు. రోజు ఏదో విధంగా సత్తెనపల్లి నియోజకవర్గం వార్తల్లో ఉంటుంది. ఇప్పుడా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీని దెబ్బకొట్టేందుకు వైసీపీ పాచికలు వేస్తోంది. అధికారపార్టీని మట్టి కరిపించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దానితో సత్తెనపల్లి హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన అంబటి రాంబాబు ఇదే సత్తెనపల్లి నుండి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా మంత్రిగా కూడా ఉన్నారు. నియోజకవర్గంలో అంబటి పెత్తనమే సాగుతోంది. ఆయన అరాచకాలకు కూడా అంతు లేకుండా పోయింది. నియోజకవర్గంలో అంబటి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దానితో అంబటి పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.
కోడెల శివప్రసాద్ మరణంతో అస్తవ్యస్తంగా మారిన సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీని సరైన దారిలో పెట్టేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. కోడెల తనయుడు శివరాం సత్తెనపల్లి టికెట్ ను ఆశిస్తూ పనులు చేస్తున్నప్పటికీ గతంలో ఆయన అరాచకాలను గుర్తు చేసుకుంటూ పార్టీ అధిష్టానం విముఖంగా ఉంది. పార్టీలో రెండు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేసిన మన్నెం శివనాగేశ్వరరావు అలియాస్ అబ్బూరి మల్లి టికెట్ అశిస్తున్నప్పటికీ అది ఎంత వరకు సాధ్యమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దానితో సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీ నారాయణను సత్తెనపల్లి నుండి బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు చంద్రబాబు, కన్నా వైరి వర్గంలో ఉండేవారు. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం ఇద్దరూ కలిశారు. పైగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నాకు ఉన్న క్లీన్ ఇమేజ్ పార్టీకి ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నారు. అంబటి మళ్లీ పోటీ చేసిన పక్షంలో ఆయన్ను ఓడించాలంటే బలమైన అభ్యర్థి అనివార్యమని భావించిన చంద్రబాబు సత్తెనపల్లి నుంచి కన్నాను బరిలోకి దించాలనుకుంటున్నారు. పైగా తరచూ పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకుంటున్న అంబటికి బుద్ధి చెప్పాలంటే ఆయన్ను ఓడించడమే మార్గమని భావిస్తున్న జనసేన శ్రేణులు కూడా కన్నాకు మద్దతిచ్చే అవకాశం ఉంది.
టీడీపీ వ్యూహాలను పసిగట్టిన వైసీపీ నేతలు కూడా ఇప్పుడు అప్రమత్తమయ్యారు. టీడీపీ వైపు నుంచి పోటీ చేసే అభ్యర్థిని బలంగా ఢీకొట్టి విజయం సాధించే కేండెట్ ను రంగంలోకి దించాలని తీర్మానించారు. అంబటిని క్రియాశీలంగా ఉండాలని చెబుతూనే ప్లాన్ బీని కూడా జగన్ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా 2004 నుంచి 2014 వరకు సత్తనపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన యర్రం వెంకటేశ్వర రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారు. యర్రం 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో క్రియాశీలంగా లేరు. ఆయన కుటుంబం కాంట్రాక్టులు చేసుకుంటూ వైసీపీ పెద్దలకు కాస్త చేరువగానే ఉంది. సత్తెనపల్లిలో రెడ్లు అంబటికి కాస్త దూరం జరిగారన్న ప్రచారం నడుమ అది మరింత పెరగకుండా చూసేందుకే యర్రం వెంకటేశ్వర రెడ్డిని చేర్చుకున్నట్లు భావిస్తున్నారు. పైగా చేరికల కార్యక్రమంలో అంబటి కూడా ఉండి తన ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు అంబటిని పక్కనపెట్టాల్సిన పరిస్థితి వస్తే యర్రం వెంకటేశ్వర రెడ్డి లేదా ఆయన కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారట. ఇదీ కాపు రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దీని వల్ల సత్తెనపల్లి నియోజకవర్గంలో రెడ్డను కూడా దారిలో పెట్టినట్లయ్యింది. కన్నా టీడీపీలో చేరడం పట్ల అసంతృప్తిగా ఉన్న కాపు నేతలను పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ భావిస్తోంది. మరి టీడీపీ దానికి ఎలాంటి కౌంటరిస్తుందో చూడాలి.