సీనియర్ తమ్ముళ్లకు నో సీట్ అన్న బాబు AP-Politics-TDP-CBN-Senior Leaders,

By KTV Telugu On 23 February, 2024
image

KTV TELUGU :-

తెలుగుదేశం పార్టీలో సీనియర్ల కోసం చంద్రబాబు నాయుడు  మంచి కుచ్చుటోపీలు చేయించారు. జనసేనతో పొత్తుతో పాటు.. లోకేష్ ఎప్పుడో మాటిచ్చిన ఎన్.ఆర్.ఐ. బాబులకు టికెట్లు ఇచ్చే  క్రమంలో పార్టీలో  సీనియర్ల సీట్లకు ఎసరు పెట్టాలని డిసైడ్ అయ్యారు చంద్రబాబు. అలా సీట్లు ఇవ్వలేని వారికి  చక్కగా ఒక టోపీ పెట్టి పంపించాలని ఆయన భావిస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసినందుకు టోపీలను  కానుకగా ఇవ్వాలన్నది చంద్రబాబు ఐడియాగా చెబుతున్నారు. మరి  టికెట్ రాని నేతలు టోపీ పెట్టుకుంటారా లేక  లాగి ఎడం కాలితో తన్ని పారేస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పండితులు. ఆంధ్ర ప్రదేశ్ లో యాక్టివ్ గా లేదు కానీ..లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీతోనూ పొత్తు పెట్టుకోడానికి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేసేవారే.

ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడం తన ఇంటా వంటా లేదని నమ్మే చంద్రబాబు నాయుడు ప్రతీ ఎన్నికలోనూ సిద్ధాంతాలు, విలువలతో పనిలేకుండా ఎంచక్కా ఎవరితో పడితే వారితో పొత్తులు పెట్టుకుని ఏ మాత్రం సిగ్గులేకుండా రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈ ఎన్నికల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని నేరుగా ఎదుర్కొనే సత్తా తమకి లేదని గ్రహించిన చంద్రబాబు తాను గతంలో తిట్టిపోసిన బిజెపి తో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. గత ఎన్నికల ముందు తనను తిట్టిపోసిన జనసేనతో ఆల్ రెడీ చెట్టాపట్టాలేశారు. రేపో మాపో బిజెపికూడా పొత్తుకు సై అంటే  బిజెపి-జనసేనలకు  ఎంత లేదన్నా 75 సీట్లు దాకా ఇవ్వక తప్పదని ప్రచారం జరుగుతోంది.

జనసేనే-బిజెపిలతో పొత్తులో భాగంగా వారికి  కేటాయించబోయే సీట్లలో టిడిపి సీనియర్లకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఏకపక్షంగా రెండు స్థానాలకు అభ్యర్ధులను ఏకపక్షంగా ప్రకటించారు. దాంతో జనసేన కూడా  రాజానగరం, రాజోలునియోజక వర్గాల నుంచి పోటీ చేస్తామని డిక్లేర్ చేసింది.తాజాగా పవన్ కళ్యాణ్  గోదావరి , విశాఖ జిల్లాల నుండి కొన్ని నియోజక వర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారని జనసైనికులు ప్రచారం చేస్తున్నారు.పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, భీమిలి, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు జనసేన నేతలు వెల్లడించారు. దీంతో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గాజువాక టీడీపీ ఇన్‌ఛార్జి పల్లా శ్రీనివాసరావు సీట్లకు రెక్కలు వచ్చినట్లే. చంద్రబాబే పవన్ చేత ఈ నియోజక వర్గాల పేర్లు ప్రకటించి ఉండచ్చని  సీట్లు గల్లంతు అవుతోన్న  బండారు, పల్లాల వర్గీయులు భావిస్తున్నారు.

ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం లో మాజీ మంత్రి దేవినేని ఉమ సీటు తనకే అని ధీమాగా ఉన్నారు. అయితే దేవినేని ఉమాకి ఈ సారి టికెట్ గల్లంతే అని పార్టీ వర్గాలంటున్నాయి. మైలవరం నియోజక వర్గానికి చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ మధ్యనే  టిడిపిలో చేరారు. ఆయనకే మైలవరం టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. దాంతో  తన పరిస్థితి ఏంటి? అని దేవినేని   నిప్పులు చెరుగుతున్నారు.

టిడిపిలో చంద్రబాబు నాయుడికన్నా సీనయర్ అయిన  గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ కూడా చిరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. రాజమండ్రి రూరల్ నుండి బుచ్చయ్య చౌదరి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి ఆ సీటును జనసేనకు కేటాయిస్తున్నారు. రూరల్ నుండి తానే పోటీ చేస్తానని జనసేన అభ్యర్ధి కందుల దుర్గేష్ ప్రచారం చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని బుచ్చయ్య అంటున్నారు. ఒక వేళ పార్టీ తనకి టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి అల్టిమేటం జారీ చేశారు.

బుచ్చయ్యతో పాటు టిడిపి ఆవిర్బావం నుంచి ఉన్న చింతకాయల అయన్న పాత్రుడిదీ అదే పరిస్థితి. అయ్యన్న కుటుంబంలో ఒక్కరికే టికెట్ ఇస్తామని చంద్రబాబు తేల్చి  చెప్పడంతో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని చూస్తోన్న అయ్యన్నకు మండుకొస్తోంది. తెనాలి నుండి తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్  చెప్పుకుంటున్నారు. తెనాలి నియోజక వర్గమంతా  పర్యటిస్తూ హడావిడి చేస్తున్నారు కూడా. ఇదే నియోజక వర్గం నుండి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్  గతంలోనే ప్రకటించారు. తాజాగా నారా లోకేష్ కూడా  తెనాలి సీటు జనసేనకే అని స్పష్టం చేశారట. ఈ వార్త తెలిసి ఆలపాటిరాజేంద్ర ప్రసాద్ గుండె జారిపోయిందని అంటున్నారు.అనంత పురం జిల్లాలో జేసీ బ్రదర్స్  కు కూడా చంద్రబాబు  కండిషన్  పెట్టారట.  జేసీ బ్రదర్స్  కుటుంబాల నుండి ఎవరో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వగలమని రెండో వారికి సాధ్యం కాదని అన్నారట. దీంతో జేసీ కుత కుత లాడిపోతున్నట్లు సమాచారం.

పరిటాల కుటుంబానికి కూడా ఇదే షరతు పెట్టారట. పరిటాల సునీత, శ్రీరాంలలో ఎవరో ఒకరికే టికెట్ అన్నారట చంద్రబాబు. దీంతో ధర్మవరం నియోజక వర్గంపై ఆశలు వదులుకోవలసి వస్తోందని పరిటాల కుటుంబం భగ్గుమంటోంది.ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియకు కూడా టికెట్ హళక్కే అన్నారట చంద్రబాబు. జనసేన-టిడిపిల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయితే  టిడిపిలో టికెట్లు గల్లంతు అయ్యే నేతల జాబితా మరింత పెరగచ్చని అంటున్నారు. ఒక్క సారి కూడా గెలవలేకపోయిన నారా లోకేష్ లాంటి వారి సీట్లు పదిలంగా ఉంచుకుంటూ గెలవగలిగే సీనియర్లకు ఎసరు పెట్టడంపై  పార్టీ వర్గాల్లో  అసంతృప్తి రాజుకుంటోంది. ఇది ఎన్నికల నాటికి తిరుగుబాటుగా  పెరిగే అవకాశాలున్నాయంటున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి