అవినీతిపరులకు సమాజంలో గౌరవం ఉండదంటారు. అవసరమైనప్పుడు సమాజం వారిని వాడుకుని.. తర్వాత వదిలేస్తుంటారు. లంచాలు తీసుకుని నైతిక విలువలకు తిలోదికాలు ఇచ్చే వారు తర్వాత సమాజాన్ని నిలదీసే పరిస్తితి ఉండదంటారు. వాళ్లు భోరున ఏడ్చినా జనం పట్టించుకోరని అంటారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి కూడా అదేనని చెప్పక తప్పదు. చేసిన తప్పును ఇప్పుడామె గట్టిగా బయటకు చెప్పుకోలేరు కదా… ఏదో ఒకటి రెండు ట్వీట్లతో సరిపెట్టుకోవడం తప్ప…
ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం తాడికొండ ఎమ్మెల్యే. జగనన్న పిలిచి మరీ 2019లో టికెట్ ఇచ్చిన వారిలో ఆమె కూడా ఒకరిగా ఉన్నారు. రాజధాని ప్రాంతం ఆమె నియోజకవర్గంలోకి వస్తుంది. మూడు రాజధానులంటూ అమరావతి రైతులను జగన్ మోసగిస్తుంటే ఎంజాయ్ చేసిన వారిలో శ్రీదేవి కూడా ఉన్నారు. పైగా కడుపుమంటతో రైతులు ఉద్యమిస్తుంటే వారికి అండగా నిలవాల్సిన శ్రీదేవీ… నాలుగు తిట్లు కూడా తిట్టారు. పేద రైతులను ఛీకొట్టారు. వారిని ఉద్యమాన్ని అపహాస్యం చేశారు. అదీ ఉండవల్లి శ్రీదేవి గతితప్పిన చరిత్ర. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్ మార్చాలనుకున్న ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి పేరు కూడా ఉండటంతో ఆమె టెన్షన్ పడ్డారు. అంతలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. శ్రీదేవి నేరుగా జగన్ ను కలిసి ఆయన్ను బ్లాక్ మెయిల్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. తనకు సీటు గ్యారెంటీ ఇవ్వాలని ఆమె జగన్నే నిలదీశారు. సారీ ఆ పని కూదరదని జగన్ ఆమె మొహాన్నే కుండబద్దలు కొట్టారు. మాటామాటా పెరగడంతో ఏం చేసుకుంటావో చేసుకోపో అని కూడా జగన్ అనేశారు. అప్పుడు కూడా ఉండవల్లి శ్రీదేవీ వెనుకాముందు ఆలోచించలేదు. అలాంటి వారి కోసమే ఎదురుచూస్తున్న టీడీపీ ట్రాప్ లో శ్రీదేవి పడిపోయారు. ఆమెను టీడీపీ క్యాష్ తో కొట్టిందనేది పెద్ద టాక్ …
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచే సీన్ కూడా టీడీపీకి లేదు. ఐనా వైసీపీలో అసంతృప్తిపరుల క్రాస్ ఓటింగ్ తో గెలిచే అవకాశం ఉందని చంద్రబాబు గ్రహించారు. పంచుమర్తి అనురాధను రంగంలోకి దించారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో పంచుమర్తి అనురాధ గెలిచారు. ఆమెను గెలిపించిన వారిలో ఉండవల్లి శ్రీదేవీ కూడా ఉన్నారు..
క్రాస్ ఓటింగ్ చేసిన వారిలో ఇద్దరు జగన్ పై కసి కొద్ది టీడీపీకి ఓటేశారని విశ్లేషణలు వినిపించాయి. మరో ఇద్దరు జగన్ పై కసితో పాటు కాసులకు కక్కుర్తి పడ్డారని రాజకీయ వర్గాల్లో అప్పుడు చర్చ జరిగింది. మూటలు అందుకున్న ఇద్దరిలో శ్రీదేవి ఒక్కరని చెబుతారు. దానికి ఆధారాలు చూపడం కష్టమే అయినా రాజకీయవర్గాల్లో ఈ చర్చ జోరుగానే సాగిందీ,సాగుతుంది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలిచిన తర్వాత టీడీపీ వారికి శ్రీదేవి దగ్గరయ్యారు. నారా లోకేష్ పాల్గొన్న యువగళం బహిరంగ సభలో ఆమె వ్యాఖ్యాతగా అంటే యాంకర్ గా వ్యవహరించే అవకాశం కూడా పొందారు. ఇంకేముందు టీడీపీ తనకు అగ్రతాంబూలమిచ్చిందని ఆమె తెగపొంగిపోయారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అయిపోయి మంత్రి కావడమొక్కటే మిగిలి ఉందని ఆమె కలలు గన్నారు. ఈ క్రమంలో తాడికొండ లేదా తిరువూరు రిజర్వ్ స్థానాల్లో ఒక దానిని తనకు కేటాయించాలని చంద్రబాబు వద్ద ప్రతిపాదన పెట్టారు. అలా కుదరని పక్షంలో బాపట్ల రిజర్వ్ ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు. అప్పుడు చంద్రబాబు అన్నింటికీ సరే అన్నారు. తర్వాత క్రమంగా ఆమెను దూరం పెట్టారు. అందుకు టీడీపీలో ఆశావహులు పెరిగిపోవడం కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. పైగా పార్టీలో అసలు పనిచేయకపోవడం,బేరం మాట్లాడుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడం లాంటి చర్యల కారణంగా ఆమె వీకైపోయాయి. ఇప్పుడు తాడికొండ, తిరువూరు, బాపట్ల ఎందులోనూ ఆమె పేరు లేకపోవడంతో ఉండవల్లి శ్రీదేవికి రాజకీయ తత్వం తెలిసొచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆమె దుమ్మెత్తిపోస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయో,ఎవరు ఎలా ఉంటారో ఈ రోజు అర్థమైంది అంటూ ట్వీట్ చేసిన ఆమె బాపట్ల లోక్ సభా నియోజకవర్గం మ్యాప్ ను దానికి ట్యాగ్ చేశారు. చంద్రబాబు నిండా ముంచారని ఆమె కన్నీరు, ఏడుపు అన్నీ ఆ ట్వీట్ లో కనిపిస్తూనే ఉన్నాయి. పైగా కత్తి సింబర్ కూడా జతచేయడంతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆమె చెబుతున్నట్లయ్యింది. నిజానికి ఆమె ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత ఏడ్చి ముక్కు చీదినా… ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆమె ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పార్టీని మోసగించారు. ఓటు వేసేందుకు లంచావతారం ఎత్తారు. అందుకే శ్రీదేవిని టిష్యూ పేపర్లా, కూరలో కరివేపాకులా టీడీపీ పరిగణించిందని పొలిటికల్ టాక్….
వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవిపై వీర లెవల్లో సెటైర్లు వేస్తోంది. చంద్రబాబు కంటే జగన్ ఎలా మంచివారో ఇప్పుడైనా అర్థమైందా అని ప్రశ్నిస్తోంది. జగన్ మొహం మీదే చెప్పేశారని, చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ప్రచారం చేస్తోంది. కాకపోతే ఇదీ జగన్, చంద్రబాబు వ్యవహారం కాదనుకోవాలి. అమ్ముడుపోయే నాయకులకు ఎలా బుద్ధిచెప్పాలో ఉండవల్లి శ్రీదేవి ఎపిసోడ్ ను ఒక ఉదాహదరణగా తీసుకుంటే బావుంటుందనుకోవాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…